Pages

Friday, December 17, 2010

ఎ.జి.కె యాడ్‌ గైడ్

అడ్వర్‌టైజ్‌మెంట్ ఏం చేయాలి..? కంపెనీ బ్రాండ్‌ను పెంచాలి. ఉత్పత్తులు వేగంగా అమ్ముడుపోయేలా చేయాలి. ఈ రెండు పనులు చేయలేదంటే ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ ఫెయిల్ అయినట్లే కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రస్తుతం వస్తున్న ప్రకటనల్లో 85 శాతం ఫలితాలను ఇవ్వడం లేదు. కంపెనీలు కోట్లు కుమ్మరించి తీస్తున్న ప్రకటనలు వృథా అవుతున్నాయి. ఈ రంగాన్ని ఆషామాషీగా తీసుకుని పనిచేస్తున్న వాళ్లు ఎక్కువవ్వడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఇన్స్యూరెన్స్ కంపెనీలలాగే అడ్వర్‌టైజింగ్ రంగం కూడా అంతటి సీరియస్ వృత్తి. ఇందులో పనిచేసేవాళ్లు తాము అందరికంటే సృజనాత్మకశీలురమని భ్రమిస్తుంటారు. ప్రజల అభిరుచులు ఎలా మారిపోతున్నాయి..? ఏం కోరుకుంటున్నారు..? ఎవరి కొనుగోలు శక్తి ఎంత..? అనే విషయాలే పట్టడం లేదు ప్రకటనల రూపకర్తలకు.

వాగ్దానం+నాణ్యత

ఒక్కోసారి కొన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లు అసలుకే మోసం తెస్తాయి. కోకాకోలా కంపెనీ ఉత్పత్తిలో అదే జరిగింది. కోక్‌నే కొంచెం మార్చి 'న్యూ కోక్' అనే కొత్తరకం పానీయాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించారు. అయినా సరే, ఆ ఉత్పత్తి ఘోరంగా విఫలమైంది. మళ్లీ పాత కోక్‌నే ఉత్పత్తి చేయక తప్పలేదు. ప్రకటనలలో ఇచ్చే వాగ్దానానికి, నాణ్యతకు పొంతన కుదరకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. మన దేశంలో ప్రకటనల రంగం విలువ రూ.22 వేల కోట్లు.

దీనిలో ఎలక్ట్రానిక్ మీడియా వాటా 55 శాతంకాగా ప్రింట్ మీడియా 40 శాతం ఔట్‌డోర్ 3, రేడియో, ఇంటర్‌నెట్ కలిపి ఒక శాతం ఉంది. భవిష్యత్తులో మొబైల్ ప్రకటనలు కూడా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, ముంబయి, ఢిల్లీ, చెన్నైలలో ఈ రంగం ఎందుకు దూసుకెళుతోందంటే.. అక్కడ ఉత్పత్తిదారులు ఎక్కువమంది ఉన్నారు. మన రాష్ట్రంలో సేవలు మినహా, ఉత్పత్తి తక్కువ. అందుకే మన దగ్గర ప్రకటనల రంగం అభివృద్ధి కావడం లేదు. అయితే గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లో కూడా వస్తువినియోగం వేగవంతమవుతోంది. వినియోగదారుని మనస్తత్వం కూడా మారిపోతోంది.

కాని దీనికి తగ్గట్టు అడ్వర్‌టైజ్‌మెంట్లు మారడం లేదు. విమల్, రస్నా, నిర్మా కంపెనీల ప్రకటనలు గుర్తుండిపోయినట్లు.. ఇప్పుడొస్తున్న ప్రకటనలు గుర్తుండటం లేదు. బ్రాండ్ అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రకటనలు కూడా రావడం లేదు. ప్రజలను సమ్మోహితులను చేసి.. వినియోగదారులుగా మార్చగలిగే శక్తి కొన్ని ప్రకటనలకే ఉంది. నిజానికి ఇప్పుడు అన్ని ఉత్పత్తులలో నాణ్యత పెరిగింది. దానికి తోడు పోటీ ఎక్కువైంది. ఇలాంటి సమయంలో ప్రకటనలే కీలకపాత్ర పోషిస్తాయి. వినియోగదారుని మనసులోకి పరకాయప్రవేశం చేస్తేనే ప్రభావశీలమైన ప్రకటనలను తయారుచేయగలరు.

ఈ పుస్తకంలో..

మన దేశంలో ప్రకటనల రంగం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ఒకటి అనుభవజ్ఞుల పుస్తకాలు లేకపోవడం. ఈ కొరతను తీర్చేందుకే 'లర్నింగ్స్ ఆఫ్ యాన్ అడ్వర్‌టైజింగ్ ప్రాక్టీషనర్' పుస్తకం రాశాను. ఈ రంగంలో నాకున్న 30 ఏళ్ల అనుభవాలను ఈ పుస్తకంలో విశ్లేషించాను. కంపెనీ బ్రాండ్లకు ఎలా పేరు తేవాలి? వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు? ఉత్పత్తులను ఎంతవరకు ప్రజెంట్ చేయవచ్చు? ప్రకటనలరూపకర్తల ఆలోచనలకు ఎలాంటి హద్దులుండాలి? అనే విషయాలతోపాటు సుమారు ప్రకటనలరంగం మీద 20 అధ్యాయాలుగా విశ్లేషణలున్నాయి. ఈ పుస్తకం శనివారం హైదరాబాద్‌లోని క్రాస్‌వర్డ్ బుక్‌స్టోర్‌లో ఆవిష్కరించనున్నాం.

జూ ఆది మల్లెంపూటి

Thursday, December 16, 2010

అతడు డబ్బును జయించాడు

నేటి ప్రపంచంలో అత్యధిక సంపన్నుడు, పేరు ప్రతిష్ఠలున్న బిల్‌గేట్స్ గురించిన ముచ్చట్లు గతవారం ప్రారంభించాం. పదండి ముందుకు.. ఈ మహాశక్తి వివరాలను విజయాలను మరికొన్ని తెలుసుకుని స్ఫూర్తిని, ఆనందాన్ని సొంతం చేసుకుందాం. ఓ కంప్యూటర్ సంస్థ ప్రకటనకు జవాబుగా చీకట్లో ఒక రాయి విసిరారు బిల్‌గేట్స్, ఆయన మిత్రుడు పాల్ అలెన్. అది సరిగ్గా తగలాల్సిన చోటే తగిలింది. వారి ప్రయత్నానికి సానుకూల స్పందన లభించటం ఆ సంస్థ నుంచి పిలుపు రావటం జరిగింది. మిత్ర ద్వయం రెండు రోజులు నిర్విరామంగా ఆ కంప్యూటర్‌తో కుస్తీపట్టి విజయం సాధించారు.దీంతో వారి విజయ ప్రస్థానం మొదలైంది.

మైక్రోసాఫ్ట్ అవతరణకు దారితీసింది. తాను సాధించిన ప్రతి విజయాన్ని మరోమెట్టుగా వేసుకుంటూ పెద్దపెద్ద విజయాలపై దృష్టి సారించాడు బిల్‌గేట్స్. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగు పరుచుకుంటూ ఎంతగానో తాను ప్రేమించి అభిమానించే రంగంలో మరెంతగానో కృషి చేసాడు. పెనుమార్పులు సాధించాడు. చివరకు బిల్‌గేట్స్ పేరు సాఫ్ట్‌వేర్‌కి పర్యాయపదమైంది. తనదైన రంగం మీద పట్టు బిగించి, సంపూర్ణ ఆధిక్యాన్ని, ఆధిపత్యాన్ని సాధించటానికి సర్వోత్తమ ఉదాహరణ బిల్‌గేట్స్. నిజానికి మనమెవరైనా సరే ఒక రంగంలో నిష్ణాతుడై కొన్ని విజయాలను చవిచూశాక అనంతంగా కృషి చేస్తూ పోవటమే మనముందున్న ఏకైక మార్గం.

కొంచెం బద్దకించామా మనవెనకున్న వ్యక్తి ముందుకు దూసుకుపోతాడు. మనం ఓటమితో నిరాశా నిస్పృహలకు లొంగిపోతాం. విజయం పులి మీద స్వారీ లాంటిది. ఒకసారి పులి స్వారీ మొదలయ్యాక మధ్యలో దిగలేం. దిగితే పులి మనను స్వాహా చేసేస్తుంది. పులి స్వారీ సాగుతూనే ఉండాలి. అయితే అందులోఉన్న ఆనందం, గౌరవం, గుర్తింపు వేరెక్కడా లభించవు. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టమన్నారు. స్వారీ చేయదలిస్తే ఏ కుక్కనో, నక్కనో కాక పులిని స్వారీ చేయాలి. అలాగే మనకిష్టమైన రంగంలో అవిరామంగా కృషి చేసి నిష్ణాతుడిగి రూపాంతరం చెంది సదా విజయపతాకం ఎగురవేసే కంటే జీవితంలో మరే ఆనందముంటుంది. విజయం కన్నా విలువైన ప్రాణవాయువు ఇంకేదైనా ఉందా ఈ లోకంలో..

విజేతల ముఖాలు ఎలా ఆనందంతో, ఆరోగ్యంతో తొణికిసలాడుతుంటాయో గమనించారో ! వారి నడక, వారి బాడీ లాంగ్వేజి, వారి మాట ఈ సారి పరీక్షగా గమనించండి. వారు ఓ ప్రత్యేక జాతికి చెందిన వారుగా, ప్రజ్వలిస్తున్న చైతన్యంతో ఎంతో హాయిగా ఆనందంగా చిరంజీవులుగా గోచరిస్తారు. అంతేకాదు విజేతలు వారు కోరుకున్న జీవితాలను జీవిస్తారు. ఇంతకన్నా ఏ జీవికి మాత్రం ఏం కావాల్సి ఉంటుంది ? కలల కన్నా జీవితాన్ని జీవిచటమే మనందరికి జీవిత గమ్యం కదా ! ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా మారి అనునిత్యం కృషితో మందంజ వేస్తూ ఉంటేనే ఈ ఆనందమయమైన జీవితం సాధ్యమయ్యేది. బిల్‌గేట్స్ ఈ కోవకి చెందిన వ్యక్తుల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్నాడు.

ఆయన కృషి వల్ల సాఫ్ట్‌వేర్ పరిశ్రమ బలంగా వేళ్లూనుంది. ఆయన ఆలోచనల వెంట ప్రపంచం అడుగులు వేసింది. ఒక గేట్స్ విధానాన్ని అనుసరిస్తూ ఒక మహాధ్యాయానికి ప్రపంచం తెరతీసింది. 1995లో 'ద రోడ్ ఎహెడ్' అనే పుస్తకంలో బిల్‌గేట్స్ రాసిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయి. మీరు మీ కుర్చీలోనే కూర్చొని ఉంటారు. మీ డెస్క్‌ని అంటిపెట్టుకొనే ఉంటారు. అక్కడ నుంచే మీరు పగ్గాలు ధరించి మీ వ్యాపారాన్ని నడిపిస్తారు. ఆ స్థానంలో కూర్చోనే ప్రపంచాన్ని అధ్యయనం చేస్తారు. సంస్కృతుల్ని గమనిస్తారు. వినోదం మీ ముందే ఉంటుంది. స్నేహితులు ఏర్పడతారు. పొరుగు మార్కెట్లతో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారు. ఎక్కడో దూరంగా ఉన్న మీ బంధువులకు మీ ఫోటోల్ని చూపిస్తారు. వీటన్నింటినీ మీరు చల్ల కడుపులో చల్ల కదలకుండా చేసే రోజు ఎంతో దూరం లేదు. అది (కంప్యూటర్) ఒక పరికరం లాగా కాకుండా మీ నిత్యావసారాల్లో భాగమైపోతుంది. మీ వినూత్న జీవిత విధానానికి పాస్‌పోర్టులాగా వినియోగపడుతుంది.

ఆనాడు కేవలం 15 ఏళ్ల క్రితం బిల్‌గేట్స్ కన్నకలల్లో నేడు మీరు, నేను నివసిస్తున్నాం. ఆయన రాసిన మాటల్లో ఒక్క మాట పొల్లుపోలేదు. అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్న తపన, అంకితభావాల వెనక ప్రతిఫలించే ప్రగాఢమైన శక్తి బిల్‌గేట్స్‌ని ఒక మిషనరీగా, భవిష్యత్తును చూడగలిగే అసాధారణ జ్ఞానిగా నిలబెట్టింది. కేవలం తన జీవితాన్ని మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండేవారి జీవితాన్ని సైతం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడింది. నిజానికి బిల్, అలెన్‌లు కంప్యూటర్ రంగంలో ప్రవేశించినపుడు అందులో చెప్పుకోదగ్గ సంఖ్యలో పోటీదారులు లేరు. ఆ విషయాన్ని మిత్రులు నిర్లక్ష్యం చేయలేదు. ధైర్యంగా ఉండిపోలేదు. ప్రతిభకు పదును పెట్టారు. సరికొత్త ప్రయోగంతో వినూత్న ఉత్పాదనలతో ముందుకెళ్లారు. ఎవరికీ అందనంత ముందుకి...

విజయ మార్గంలో పయనమంటూ మొదలయ్యాక అది పులి స్వారీ లాంటిదని బిల్, అలెన్‌లకు తెలుసు. అందుకే అప్రతిహతితంగా వారి విజయ పరంపర కొనసాగుతూనే ఉంది నేటి దాకా. అందువల్ల ప్రపంచానికి ఎలాంటి మేలు జరిగిందో చూడండి. కంప్యూటర్ లేకుండా క్షణకాలం కూడా ఊహించలేని ప్రపంచంలో జీవిస్తున్నాం మనం. నేడు కంప్యూటర్ ఒక యంత్రం కాదు. అది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనకు జవసత్వాలనిచ్చే టానిక్.

అవునా.. కాదా ?! ఇంత గొప్ప జీవిత సౌలభ్యాన్ని ఆవిష్కరణ చేసిన బిల్‌గేట్స్ ఎంత సంపాదించి ఉంటాడు ? ఊహించండి ...! ప్రపంచంలోని అందరికన్నా ఎక్కువ ధనవంతుడంత ! ఆయన సంపద దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైనే. మూడు లక్షల కోట్ల పైచిలుకు!! ఆయన వయస్సెంతో తెలుసా ? కేవలం 54. ఇంతటి సంపదను ఏం చేస్తున్నాడో అనే ఊహరాక మానదు మనకు. సింహభాగం దానధర్మాలకు.. అదీ ప్రపంచవ్యాప్తంగా..ఆయన సతీమణి మెలిండా గేట్స్ పేరున స్థాపించిన ట్రస్టు ద్వారా 10 బిలియన్ డాలర్లు ..అంటే 45 వేల కోట్ల రూపాయలను కొత్త వ్యాక్సిన్సు కనుగొనటానికై విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారు. ఈ వ్యాక్సిన్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా సామాన్యంగా బీద, బడుగు వర్గాలను పీడించే అంటురోగాలను నియంత్రించేందుకై.

అంతేకాదు తన సంపదనంతా మనందరం యధావిధిగా మన వారసులకు ఇచ్చేలా కాకుండా లోక కళ్యాణం కోసం వెచ్చిస్తానన్నాడు బిల్ గేట్స్. ఎంతటి మహోన్నత వ్యక్తి కదా బిల్ గేట్స్. ఈ విషయాన్నే ఇటీవల మన దేశంలోని లక్షల కోట్లకు పడగలెత్తిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రస్తావించి..మీరు బిల్ గేట్స్ లాగా ఎందుకు మీ సంపదలో కొంతైనా మన దేశ కళ్యాణానికి వినియోగించరని ఒక జర్నలిస్టు అడిగితే, ఆయన సమాధానం.

"అమెరికాలో పన్నులు జాస్తి. వాటిని తప్పించుకోవటానికి అక్కడి వారు అలా చేస్తుంటారని జవాబిచ్చారు!! ఎంతటి సంపదా మనకే చాలకపోతే, తోటివారి గురించి మనమెందుకు ఆలోచిస్తారా ?? బిల్‌గేట్స్ లాంటి వ్యక్తులు రోజు మనకు తారసపడరు. వారి జీవితం మనకు స్ఫూర్తిని, ఏదైనా సాధించాలనే తపనని, దైర్యాన్ని కలిగించి ఆపై మన సంపదలో కొంతైనా ఆర్తుల సహాయానికై వినియోగపడేలా చేస్తే.. జయహో.. ''
- ఎజి కృష్ణమూర్తి

ఆకర్షణతో ఆకాశమంత ఎత్తుకు..

కొత్త మార్గాన్ని అన్వేషించటం లేక ఉన్న మార్గాన్ని మెరుగుపరచటం.. ఈ రెండే మనముందున్న దోవలు. జీవితంలో ఏదైనా సాధించి పైకి రావాలంటే.. ప్రతి విజేత గాధలో అంతర్లీనంగా ఉన్న సత్యమిదే. సాధిర్ అనే దేవదాసిల నృత్యాన్ని మెరుగుపరిచి భరతనాట్యమనే కొత్త నాట్యకళకు జీవం పోశారు రుక్మిణీ దేవి అరండేల్. నోబిన్ దాస్ నోరూరించే రసగుల్లాకు కొత్త జీవం పోసి దేశ విదేశాల్లో మనకో సరికొత్త అనుభూతికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అలాగే ఎందరో మహానుభావులు వాడుకలో ఉన్న కళలకి, వస్తువులను మెరుగుపరిచి తాము లాభపడ్డారు. మన జీవితాల్లోకి అనూహ్య అనుభూతులను తెచ్చారు.

ఎంఎస్ స్వామినాథన్, రైట్ బ్రదర్స్, నిర్మా కర్సన్‌భాయ్ పటేల్, హెన్రీ ఫోర్డ్, సర్ సివి రామన్, ఎడిసన్.. ఇలా ఎందరో అపర బ్రహ్మలు కొత్త మార్గాల్ని అన్వేషించి మానవ జీవనానికి కొత్త అర్థాన్ని, సరికొత్త రూపురేఖలనీ ఇచ్చారు. రెండు మార్గాలు ఉత్తమమైనవే... మన శక్తి సామర్థ్యాల పైన, ప్రజ్ఞాపాటవాల మీద ఆధారపడుంది మనకే దోవ మంచిదో అనే నిర్థారణ. నా దగ్గరకు ఎంతో మంది యువకులు వస్తుంటారు కొత్త కొత్త కలలు, గమ్యాలతో.. వీరిలో పెక్కు మంది సరికొత్త పథకాలతో, ఆలోచనలతో ఏదైనా కొత్త పుంత తొక్కాలంటే కేవలం ఒక కొత్త ఆలోచనే సరిపోదు.

ఈ ఆలోచనను లేదా ఉత్పాదనను అమల్లోకి తెచ్చి అది నలుగురికి తెలిసి ప్రాచుర్యం పొందేదాకా నిలబడగలిగే స్థోమత, ఓర్పు ఎంతో ముఖ్యం. ప్రతి కొత్త ఆలోచన, ఉత్పాదన ఉద్భవించాక అవి నిలబడి నాలుగు కాలాలపాటు జీవించి ఉండాలంటే పెట్టుబడులు అవసరం. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి యువకుడికి చెప్తుంటాను కలల సాకారం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని అని. కొత్త మార్గాలు అన్వేషించి వాటిలో పయనం మొదలుపెట్టబోయే ముందు ఈ రెండు విషయాలు .. పెట్టుబడి.. అవి ఫలితాలనిచ్చే దాకా నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు.

ఓర్పు.. మనకున్నాయా లేదా అనే విషయం మీద లోతుగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవటం ఎంతో ముఖ్యం. ఇక అమల్లో ఉన్న పద్దతులను, ఉత్పాదనలను మెరుగుపర్చాలన్నా, పెట్టుబడులు, ఓర్పు ఎంతో అవసరం. నిజానికి ఏ దోవ ఎంచుకున్నా ముందుగా ఆ రంగంలో నిష్ణాతుడిగా మారటం అన్నిటి కన్నా ముఖ్యం. ఈ రోజు మరో నిష్ణాతుడి గురించి ముచ్చటించుకుందాం. ఈయన మన ఆధునిక జీవితాన్ని సంపూర్ణంగా మార్చి వేసిన వ్యక్తి. అంతేకాదు తన అపారమైన ధనరాశిని ప్రపంచవ్యాప్తంగా లేమితో బాధపడే ప్రజానీకానికి పంచుతూ వారి జీవితాల్లో వెలుగులు, పెను మార్పు తెస్తున్న వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఈయన పేరు తెలియని యువతీ యువకులు ఎవరన్నా ఉంటారంటే ఆశ్చర్యపోవలసిన విషయమే.

వ్యాపారం, రాజకీయాలు, సంఘసేవ నేపథ్యాలుగా కలిగిన కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు తన నేపథ్యానికి భిన్నంగా ఎంతో వైవిధ్యంగా ఆలోచించాడు. తన అసమాన ప్రతిభతో అనూహ్య పరిజ్ఞానంతో ప్రపంచ పోకడనే మార్చివేశాడు. ఆయన కృషివల్ల ప్రపంచం మాటతీరు మారింది. పనితీరు కొత్తదనాన్ని సంతరించుకొంది. సువిశాలమైన గ్లోబల్ విలేజ్‌గా రూపాంతరం చెందింది.

ఆయనే బిల్ గేట్స్.. బిల్ గేట్స్‌కు లెక్కలంటే చాలా ఇష్టం. స్కూల్లోని తెలివైన పిల్లల జాబితాలో ఆ కుర్రాడి పేరు ముందుండేది. ప్రపంచం చేసుకొన్న అదృష్టం కొద్ది ఆ అబ్బాయి అప్పట్లో తొలి దశలో ఉన్న కంప్యూటర్ వైపు ఆకర్షితుడయ్యాడు. అదేం విచిత్రమోకాని ఆ ఆక ర్షణ బిల్‌గేట్స్‌కి కంప్యూటర్‌కి ఒక విడదీయరాని బంధంగా ఏర్పడిపోయింది. అక్కణ్ణుంచి ఆ కుర్రాడు కంప్యూటర్ వదిలితే ఒట్టు !

బిల్‌గేట్స్‌కి అతని నేస్తం పాల్ అలెన్ తోడయ్యాడు. కంప్యూటర్‌ని చూస్తే చాలు ఇద్దరూ తమని తాము మర్చిపోయేవారు. ఫలితంగా స్కూలు పాఠాల మీద శ్రద్ధ తగ్గింది. టీచర్లు బోధించే విషయాలకంటే యంత్రం మౌనంగా వివరించే విషయాల మీద ఆసక్తి పెరిగింది. క్లాసులకు నామం పెట్టి కంప్యూటర్ రూమ్‌లో కాలక్షేపం చేస్తూ మిత్రులిద్దరూ తరచూ పట్టుబడేవారు. వారి ఆలోచనల్లో కంప్యూటర్.. అన్న పానాల్లో కంప్యూటర్, కలల్లో కంప్యూటర్.. అదో యంత్రం కాదు..తమకు మిత్రుడు, ఆత్మీయుడు. దాంతో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందరికన్నా తొందరగా వంటబట్టించుకున్నారు.

తమ భావి జీవితాలు కంప్యూటర్‌తోనే ముడిపడి ఉన్నాయని బాల్యంలోనే ఆకళింపు చేసుకున్నారు. ఇష్టమైన పని చేస్తుంటే ఇదే జరిగేది. సర్వకాల సర్వావస్తలయందు ఆ ఇష్టమైన పని మీదే ధ్యాస. ఫలితంగా ఆ రంగంలో కొద్ది కాలంలోనే ప్రావీణ్యత పొందుంతాం. ఇదే జరిగింది బిల్‌గేట్స్‌కి..పాల్ అలెన్‌కి. దీనికి తోడు అవకాశం కోసం ఎదురు చూసేవారికిఅది తలుపు తడుతుందనే సామెత నిజమైంది వీరిద్దరి విషయంలో. ఆ అవకాశం వీరి తలుపు తట్టింది. ఆ ఇద్దరు మిత్రులు హార్వర్డ్‌లో ఉన్నప్పుడు ఓ పత్రికలోని ప్రకటన వారిని ఆకర్షించింది.

ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ కిట్ తన కమర్షియల్ మోడల్స్‌లో మార్పులు తీసుకు రాబోతుందని ఆ ప్రకటన సారాంశం. ఇంకేం బిల్, పాల్ ఎగిరి గంతేశారు. అవకాశాన్ని అందుకునేందుకు ముందుకొచ్చారు. కంప్యూటర్ కంపెనీకి ఫోన్‌చేసి తమ వద్ద ఓ ప్రోగ్రాం సిద్ధంగా ఉందని, ఆ కంప్యూటర్‌కి చక్కగా సరిపోతుందని చెప్పారు. నిజానికి ఉత్సాహమే తప్ప ప్రోగ్రాంలాంటిదేది వారి దగ్గర సిద్ధంగా లేదు. ఊరికే చీకట్లో రాయి విసిరారంతే. ఆ రాయి వెళ్లి సరిగ్గా తగలాల్సిన గురికే తగిలింది. ఫలితంగా వారి ప్రయత్నానికి అనుకూల స్పందన. కంపెనీ నుంచి పిలుపు వచ్చింది.

ఇద్దరు మిత్రులు కంప్యూటర్‌తో రెండు రోజులపాటు నిర్విరామంగా కుస్తీ పట్టారు. నిజానికి అలాంటి కంప్యూటర్ గాని లేదా ఆ తరహా చిప్‌కాని అంతకు మునుపు వారు చూడలేదు. సరికొత్త గుర్రాన్ని రౌతు మచ్చిక చేసుకొన్నట్టుగా ఆ కంప్యూటర్ స్వభావాన్ని వారు ఆకళింపు చేసుకొన్నారు. డెమో డే రానే వచ్చింది. మిత్రుల ఆదేశాల్ని తుచ తప్పకుండా పాటించిన కంప్యూటర్ వారి తొలి విజయానికి అంకురార్పణ చేసింది .అక్కడ నుంచి బిల్‌గేట్స్ విజయయాత్ర ప్రారంభమైంది. 
- ఎజి కృష్ణమూర్తి

నోబిస్ దాస్..రసగుల్లా

రుక్మిణీ దేవి అరండేల్ దక్షిణాదిలో సృష్టించిన చెన్నై కళాక్షేత్రం నుంచి తూర్పు దిశగా పయనించి నోరూరించే రసగుల్లాలు ఆస్వాదిద్దామా ? అయితే పదండి ఒడిషా వెళదాం. ఈ లోగా మరోసారి గుర్తు చేసుకుందామా.. భగవంతుడు మనకెలాంటి నైపుణ్యాన్ని ప్రసాదించాడన్నది కాదు ముఖ్యం, దాన్ని ఎంత తొందరగా, ఎంత బాగా గుర్తించి, వెలుగులోకి తీసుకువచ్చామన్నదే ప్రధానం.

భరత నాట్యం కావచ్చు.. రసగుల్లాలు కావచ్చు... వాషింగ్ పౌడర్ కావచ్చు....రస్నాలాంటి సాఫ్ట్ డ్రింక్ కాన్‌సంట్రేట్ కావచ్చు... లేక అప్పడాలు కావచ్చు. 'కవితకేది కాదు అనర్హం' అన్నట్లు పేరు ప్రఖ్యాతులు, ధనలక్ష్మీ కటాక్షం పొందటానికి అన్ని రంగాలు, అన్ని వృత్తులు, అందరూ అర్హులే. ఈ సత్యాన్ని విస్మరించి ఎక్కడో దేన్నో వెతుక్కుని తద్వారా గుర్తింపు పొంది విజేతగా రూపాంతరం చెందాలనుకోవటం చంకన పిల్లవాన్ని పెట్టుకుని ఊరంతా గాలించటమే అవుతుంది. మనలో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక నైపుణ్యాన్ని ప్రసాదించాడు. ముందు ఈ సత్యాన్ని గ్రహించటం ఎంతో అవసరం. ఆపైన దాన్ని గుర్తించి, ఆ రంగంలో శ్రమించి నిష్ణాతుడిగా మారటం ఇంకా ఎంతో అవసరం.

ఇక తిరుగేమిటి ? విజయ ప్రస్థానం వైపు దూసుకెళ్లటమే.. చంకలో పిల్లాడంటే గుర్తుకొచ్చింది ఈ చిన్న కథ. అనగనగా ఒక రోజున ఒక వ్యక్తి పేరు రాజయ్య అనుకుందాం. కాశీ యాత్రకు బయల్దేరాడు. ఆ రోజుల్లో నేటిలాగా క్షణాల్లో కాశీలో దించే విమానాలు లేవు కదా ! నడకే ఉన్న ఏకైక మార్గం...మూటా ముల్లే చంకలో వేసుకుని ప్రయాణిస్తున్నాడు. నేటిలాగా ఆ రోజుల్లో కూడా దొంగలకు కొదవలేదు. ఓ దొంగ... రాజయ్య మూటాముల్లే గమనించి తోటి కాశీ ప్రయాణికుడి లాగా పరిచయం చేసుకుని, ఆయనతో ప్రయాణం మొదలుపెట్టాడు.

అయితే ఆ దొంగ కళ్లన్నీ రాజయ్య ముల్లె మీదే... ఒక రాత్రి సత్రంలో బసచేశారు.. ఒకే గదిలో విశ్రమిస్తున్నారు. అర్థరాత్రి దాటాక రాజయ్య ధనాన్ని తస్కరిద్దామని గదంతా గాలించాడు దొంగ. ఎంత వెతికినా, ఎంత శ్రమపడ్డా ఆ డబ్బు మూట దొరకలేదు. విసుగు చెంది నిద్రపోయాడు దొంగ. మర్నాడు ఉదయం రాజయ్య నిద్రలేచాక అడిగాడు "నీ డబ్బు మూటని ఎక్కడ దాచావో కాని, గదంతా గాలించా ఎక్కడా దొరకలేదు... ఎక్కడ దాచావేంటి'' ?!!

"నీ వాలకాన్ని బట్టి నువ్వు దొంగవనే అనుకున్నాను..నువ్వెక్కడా చూడని చోటున నా డబ్బు మూట పెట్టానన్నాడు.'' అదే ఎక్కడ ?? "నీ తల దిండు కింద'' అన్నాడు రాజయ్య చిరునవ్వుతో..దీన్నే చంకలో పిల్లాణ్ణి పెట్టుకొని ఊరంతగా గాలించటమంటే. స్వతహాగా మనకు అబ్బిన నైపుణ్యాన్ని గుర్తించక, కొత్త నైపుణ్యాల కోసం వేటాడటం సమజంసమేనా ? నేను ప్రకటనా రంగంలో కాకుండా మరేదో రంగాన్ని వృత్తిగా ఎన్నుకుని ఉంటే ఏమై ఉండేదో అని తలచుకుంటేనే భయమేస్తుంది. అలాగే బిల్‌గేట్స్ సాఫ్ట్‌వేర్ కాకుండా ఏ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సో చేసుంటే ఏమై ఉండేదో కదా !

ఊహే భయంకరంగా లేదు ? సో, ఫ్రెండ్స్ మీలో అంతర్లీనమై ఉన్న మీ ప్రావీణ్యాన్ని వెలికి తీయండి. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు..ఆపలేరు. ఇక పదండి నోరూరించే రసగుల్లాల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. ఈ వ్యక్తి బిల్‌గేట్స్ లాంటి అసాధారణ సాంకేతిక ప్రతిభాశాలి కాకపోవచ్చు. కాని ప్రపంచం ఆయన చేతి మహత్తును రుచి చూస్తోంది. ఆయన చేస్తున్న రసగుల్లాలను అద్భుతంగా ఆహ్వానిస్తోంది.

ఇది నోబిన్ దాస్ స్ఫూర్తిదాయకమైన గాథ. ఆయన స్థాపించిన 'కెసి దాస్ అండ్ సన్స్' సంస్థ ప్రపంచవ్యాప్తంగా రసగుల్లా ప్రియుల పాలిట వరప్రసాదంగా మారిన వైనాన్ని నోరూరించేలా వివరించే కథనం... భువనేశ్వర్‌కి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో పహాలా అనే గ్రామంలో కాటేజ్ చీజ్ (పన్నీర్) పంచదార పాకాన్ని మేళవించి తయారు చేసే రసగుల్లా అనే సాంప్రదాయ వంటకం ఎక్కణ్ణుంచి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుంటే ఔరా అని విస్తుపోక మానరు.

రసగుల్లా ఎక్కువ కాలం నిల్వ ఉండదు.. త్వరగా పాడైపోతుంది. పుల్లగా మారిపోతుంది. ఎంత గొప్ప రిఫ్రిజిరేటర్‌లో దాచినా సరే రెండు రోజులకి మించి దాని రుచిని కాపాడటం కష్టం. నోబిన్ చంద్ర దాస్ నిరుపేద. తండ్రి లేడు. శిథిలావస్తలో ఉన్న మిఠాయి దుకాణాన్ని నెట్టుకొస్తూ తల్లినీ, తోబుట్టువులను పోషిస్తూ వచ్చాడు. నోబిన్ దాస్ వద్ద పెట్టుబడి లేకపోయినా, తన వ్యాపారానికి సంబంధించిన పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉంది. అందువల్లే బెంగాలీ వంటకాలు చేస్తూ బతుకు బండి లాగిస్తూ వచ్చాడాయన. లోలోపల మాత్రం ఏదో తపన. ప్రయోగాలు చెయ్యాలనీ, కొత్తదనాన్ని అన్వేషించాలనీ చాలా ఆరాటపడేవాడు. 1868లో ఓ రోజు నోబిన్ దాస్ జీవితాన్ని మలుపు తిప్పింది. వంటశాలలో ఆయన కొత్త దినుసులు రంగరించాడు. అంతవరకు అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు.

నోబిన్ దాస్ ప్రయోగాల ఫలితంగా రసగుల్లా జీవితకాలం పెరిగింది. రుచిని కోల్పోకుండా, ఎక్కువ రోజులు నిల్వచేయటం వీలైంది. ఆనాటి ప్రయోగం వ్యాపారపరంగా విజయవంతమై, నోబిన్ దాస్‌కి ధనలక్ష్మీ కటాక్షం కలిగించిందో లేదో కానీ, ఆయన కుమారుడు మాత్రం మరో ఆకు ఎక్కువే చదివాడు. తండ్రి కనిపెట్టిన సూత్రాన్ని వ్యాపార విజయంగా మలుచుకున్నాడు. రసగుల్లాలను డబ్బాల్లో ప్యాక్ చేసి, శరవేగంతో అమ్ముడయ్యేలా చేశాడు.

అంతే.. అన్నాళ్లు , ఒకటి రెండు రోజులకు పరిమతమై పోయిన రసగుల్లా అమృతంగా మారి మరో కొత్త జన్మ ఎత్తింది. తన జీవిత కాలంతో పాటు మార్కెట్ పరిధిని కూడా విస్తరించుకుంది. చిక్కటి పాకంలో పౌర్ణమి నాటి చందమామల్లా తేలుతూ దాస్ గారి దుకాణం నుంచి రసగుల్లాలు ఇతర ప్రాంతాలకు ఎగిరివెళ్లాయి. తీపి పదార్థ ప్రియులకు కొత్త లోకాన్ని పరిచయం చేసినాయి.

ఒకరోజు నోబిన్ చంద్రదాస్ చేసిన ప్రయోగం చూడండి. ఎంత గొప్ప వ్యాపార విజయానికి పునాదులు వేసిందో ?! నిజానికి నోబిన్ చంద్ర దాస్ మిఠాయి వంటలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రజ్ఞావంతుడేమి కాదు. అప్పట్లో ఒరియా, బెంగాలీ వంటకాల తయారీలో అనుసరించే పద్దతుల్నే అతడు అనుసరించేవాడు.

కానీ, ఒక్కటే తేడా ! తన రంగంలో నిష్ణాతుడిగా కావాలన్న తపన, పట్టుదలే నోబిన్‌దాస్‌ని ప్రయోగాల వైపు నడిపించింది. కేవలం ఒక్కరోజుకే పరిమితమైన రసగుల్లాని మరిన్ని రోజుల పాటు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న జిజ్ఞాస, తన జీవితాన్నే కాకుండా తన తర్వాత తరాల వారి జీవితాల్ని, రసగుల్లా చరిత్రను మార్చివేసింది.
- ఎజి కృష్ణమూర్తి

సంకల్పంతోనే కళాక్షేత్రాలు

  '' నీకు ఎలుక బోను తయారు చేయటం వచ్చా ? అయితే అందులో నిష్ణాతుడిగా మారి, నీ పనితనం చూపించు. అందరి కన్నా మెరుగైన ఎలుకల బోను తయారు చేయి.. అందరూ వాటి కోసం నీ ఇంటి ముందు బారులు తీరుతారు''   ఎమర్సన్ చెప్పిన మాటలవి.
అక్షర సత్యాలు.. విజేతలు కావాలనుకునే ప్రతి ఒక్కరూ పాటించవలసిన ప్రాథమిక సూత్రం ఆచరించవలసిన పద్ధతి. ప్రపంచంలోని ఏ విజేత అయినా తను ఎంచుకున్న రంగంలో నిష్ణాతుడిగా మారి, విజయాలను తన హస్తగతం చేసుకోన్నాడు. ముందుగా బలమైన, దీర్ఘకాలిక కలలు, గమ్యాలను ఏర్పరచుకోవటం.. వీటి గురించి గత 15 వారాలుగా మనం ముచ్చటించుకుంటూ వస్తున్నాం. ఎంతో మంది విజేతలను కలుసుకున్నాం. వారి జీవిత విశేషాల గురించి తెలుసుకున్నాం. ఈ మహానుభావులందరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులై, కొత్త వరవడులను సృష్టించిన వారే.

కర్సన్ భాయ్ పటేల్ కొత్త తరహాకు చెందిన డిటర్జెంట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టి, ఆ రంగంలో ఎన్నో మార్పులను తేగా, ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ స్థాయిలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి, కలలకు, గమ్యాలకు అర్హతలు ఎల్లలు లేవని నిరూపించాడు. ఆనాటి ఒరవడికి ఎదురీది లేక ఏదో ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగాన్ని వదులుకుని ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాంది పలికారు.

ఇలా ఎందరో... అందరూ ఎంచుకున్న రంగాల్లో అపారమైన కృషి చేసి నిష్ణాతులుగా మారి వారి వారి కలలను సాకారం చేసుకున్న వారే. అటువంటి మరి కొందరి జీవితగాధలను ఈ వారం నుంచి ముచ్చటించుకుందాం. వీరి జీవిత గాధలు మనకిచ్చే సందేశం ఒక్కటే. ఎంచుకొన్న రంగంలో నిష్ణాతులుగా మారటం. ఏదో ఒక నైపుణ్యం, కొంతైనా చాకచక్యం.. వాటిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చునేమో గాని, భగవంతుడు మనుషులందరికి ప్రసాదించాడన్నది మాత్రం నిజం. మనిషి చేయవలసిందల్లా ఒక్కటే. తనను తాను విశ్లేషించుకోవాలి. తనలోని సామర్థ్యాన్ని గుర్తించాలి. దాన్ని సానబెట్టి, పదునుపెట్టాలి.

అందరూ ఒకే రకమైన పనుల్లో నిష్ణాతులు కావాలన్న నియమం లేదు. ఒకరు అప్పడాలను అత్యుత్తమంగా తయారు చేయటంలో ప్రతిభ కనబరిస్తే, మరొకరు శూన్యంలోంచి సిరుల వర్షం కురిపించవచ్చు. ఎవ రి ప్రతిభ వారిది. ఆ ప్రతిభను గుర్తించాల్సిన బాధ్యత మాత్రం మనది. ఇంకా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. చేస్తున్న పని ఏదైనా, ఎంత గొప్పగా చేస్తున్నామన్నదే ముఖ్యం.

నిజానికి ఈ ప్రపంచంలోని సర్వసుఖాలు, గౌరవ మర్యాదలు, అన్ని విజేతలకే కదా. ఆ విజేతలు తమ తమ రంగాల్లో నిష్ణాతులుగా మారటం వల్లే కదా.. ఆ విజయాలన్ని... సచిన్ టెండూల్కర్ నుంచి మన బాలు దాకా. అందరూ తమ తమ రంగాల్లో ఆరితేరిన వారు, ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకున్నవారు. గతంలో చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. ఆడటం ముఖ్యం కాదు, ఆడిన ఆటలో విజేతలుగా మారటం ముఖ్యం. 'విన్నర్ టేక్స్ ఆల్' అన్నది ఎంతో నిజం. విజేతే అన్నింటినీ కైవసం చేసుకుంటాడు. కనుకే ఆడటమే కాదు. ఆ ఆటలో గెలవటం ముఖ్యం.

ఏ పందెంలోనైనా గెలిచిన వారు గుర్తుంటారు మనకు. ఓడిన వారు కాదు కదా! పదండి చెన్నైకి ప్రయాణం చేద్దాం. గజ్జల సవ్వడి వినబడటం లేదూ! అదుగో చూడండి.. నట్టువాంగాలతో, మృందగ నాదాలతో రాగ తాళభరితమైన భరత నాట్య వేదికకు తెరలేస్తూంది. ఆ వేదిక మీద ఆవిడ దర్శనమిస్తారు మనకు. భారత దేశానికి ప్రతీకగా, అంతర్జాతీయ వేదికలపై భరతనాట్యాన్ని నిలిపిన ఆ మహిళా మూర్తి మనకి మార్గదర్శిలా స్ఫూర్తినిస్తారు. రుక్మిణీ దేవి అరండేల్ గురించి నేను చెబుతున్నది.

ఇప్పుడు భరతనాట్యమంటున్నామే.. దాని సృష్టికర్త రుక్మిణీ దేవే. 1930 దశకంలో భరత నాట్య శైలికి ఆమె ఊపిరి పోశారు. తన మానస పుత్రికను మనోహరంగా తీర్చిదిద్దారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రుక్మిణీ దేవి తన తండ్రి ద్వారా దివ్యజ్ఞాన సమాజంలో ప్రవేశించారు. అక్కడే తన భావి జీవిత భాగస్వామిని కలుసుకొన్నారు. ఆయనే డాక్టర్ అరండేల్ రుక్మిణీ దేవి కళారాధనకూ, కళా సాధనకూ అండగా నిలిచిన వ్యక్తి. నృత్యం వైపు ఆమె ఆకర్షితురాలు కావటానికి దోహదం చేసిన వారు మాత్రం ప్రముఖ నాట్యవేత్త అన్నా పావ్లోవా. రుక్మిణీ అరండేల్ దంపతులు బొంబాయి నుంచి ఆస్ట్రేలియాకు నౌకలో వె ళ్తున్నప్పుడు అదృష్టవశాత్తు వారికి అన్నా పావ్లోవాతో పరిచయం అయింది.

ఆ సందర్భంలో భారతీయ నృత్యరీతులపై దృష్టి సారించి, నిర్లక్ష్యానికి గురైన సత్సంప్రదాయాలకు పునర్‌వైభవాన్ని తీసుకురావాల్సిందిగా రుక్మిణీ దేవిని అన్నా పావ్లోవా కోరారు. ఆ సలహా ఆమెకు ఎంతో నచ్చింది. ఆ రంగం వైపు దృష్టి సారించేలా చేసింది. ఒకరోజు రుక్మిణీ దేవి అరండేల్ 'సాధిర్' అనే దేవదాసీలు చేసే నృత్యాన్ని చూశారు. ఆ రోజుల్లో దేవదాసీ నృత్యాలను తక్కువ స్థాయికిచెందిన వినోద ప్రదర్శనలుగా సమాజంలోని ఉన్నత వర్గాల వారు భావించేవారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రుక్మిణీ దేవి మాత్రం అలా భావించలేదు. పైగా ఆ నృత్యం ఆమెకో లక్ష్యాన్ని ప్రసాదించింది. సలక్షమైన మార్గానికి రూపకల్పన చేసే దిశగా పురికొల్పింది.

శ్రీ శంకర్ మీనన్ మాటల్లో చెప్పాలంటే "దేవదాసీల నృత్యంలోని అభ్యంతరకరమైన అంశాన్ని తొలగిస్తే దానికొక ఉదాత్తమైన, కళాత్మకమైన శైలిగా రూపొందించే వీలుంది. రుక్మిణీ దేవి ఆ సంకల్పంతోనే తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తమ కులం నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాల్ని , విమర్శల్నీ ఆవిడ పట్టించుకోలేదు. దేవదాసీల నృత్యాన్ని త్రికరణ శుద్ధిగా అభ్యసించేందుకు అడుగు ముందుకు వేశారామే. కానీ మార్గం చాలా కఠినమైనదన్న విషయం వెంటనే తోచింది. ఎందుకంటే 'సాధిర్'నృత్యం అంతగా ప్రాచుర్యం పొందిన నృత్యశైలి కాదు. పైగా గురువు దొరకటం చాలా కష్టం. అప్పట్లో పేరు ప్రఖ్యాతులున్న నాట్య గురువులందర్నీ ఆవిడ కలుసుకొన్నారు. 'సాధిర్' నృత్యం నేర్పించమని వేడుకున్నారు. తిరస్కారాలే ఎదురయ్యాయి. నిరుత్సాహపడలేదామె. అసలు నాట్యం వైపు తాను ఆకర్షితురాలయ్యేందుకు కారకుడైన పండనల్లూర్ మీనాక్షీ సుందరం పిళ్లైని ఎలాగైతేనేం రుక్మిణీ దేవి ఒప్పించగలిగారు. ఆయన ఆ రంగంలో గొప్ప నిష్ణాతుడు.

పిళ్లై కఠోర సాధనకు మారుపేరు. ఉదయం ఏడు గంటలకు గజ్జెలు కడితే మధ్యలో ఓ గంట భోజన విరామం మినహాయించి సాయంత్రం ఏడు గంటల వరకు సాధన చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో రుక్మిణీ దేవి పగలంతా చేసిన సాధన పట్ల సంతృప్తి చెందని పిళ్లై ఆమె చేత రాత్రివేళ కూడా నాట్య సాధన చేయించేవారు. దాన్ని రుక్మిణీ దేవి శిక్షగా కాకుండా శిక్షణలో భాగంగా ఆనందంగా స్వీకరించేవారు. నాట్యమే సర్వస్వంగా భావించి, నిరంతర సాధనతో తన కలల్ని నిజం చేసుకోవాలని భావించిన రుక్మిణీ దే వి అరండేల్ అరంగేంట్రం సిద్దమయ్యారు. అప్పుడు ఆవిడ వయస్సు 34 సంవత్సరాలు. సాధారణంగా వయస్సు ఇరవై దాటక ముందే అందరూ అరంగేట్రం చేస్తారు. ఈ వయసులో ఆవిడ ఏం నాట్యం చేస్తుందిలే ? అన్న సంశయం లోలోపల గూడు కట్టుకున్నా సమాజంలో పేరు ప్రతిష్టలున్న అరండేల్ మీదున్న గౌరవం కొద్ది చెన్నైలోని పెద్దలు నాట్య ప్రదర్శనకు విచ్చేశారు.

రుక్మిణీ దేవి అరండేల్ జీవితంలో తొలి నాట్య ప్రదర్శనకు తెరలేచింది.. నాట్యం మొదలైన దగ్గర్నుంచి చివరి దాకా అందరూ ఆశ్యర్యచకితులయ్యారు. దేవదాసీల నృత్యాల్లోని అభ్యంతరకర అంశాల్ని తొలగించి, దైవదత్తమైన ఉదాత్త హావాభావాలకు ఆమె పెద్దపీట వేశారంటూ విమర్శకులు పొగిడారు. "ఈ క్షణం నుంచి దీని పేరు భరత నాట్యం'' అంటూ ఇ కృష్ణ నామకరణం చేశారు. ఓ మహోదాత్తమైన నృత్యకళ ప్రాణం పోసుకుంది. తొలి ప్రదర్శనకు అపూర్వమైన ఆదరణ లభించినా, తన ప్రస్థానం అప్పుడే మొదలైందని, గమ్యం ఎంతో దూరమని రుక్మిణీ దేవి గ్రహించారు.

తన లక్ష్యసాధనకై 'కళా క్షేత్ర'ను నెలకొల్పారామె. కానీ అందులోకి విద్యార్ధినీ, విద్యార్ధులను రప్పించటం కష్టమైపోయింది. కారణం.. పరువు ప్రతిష్టలున్న కుటుంబాల వారికి నృత్యం నేర్చుకోవటం నామోషీగా అనిపించటమే ! రుక్మిణీ దేవి నిరుత్సాహపడలేదు. తన కల సాకారమయ్యేందుకు అవిరామంగా శ్రమించారు. భరత నాట్యంలోని ప్రత్యేకతలను గురించి వ్యక్తులకు వివరించారు.

చివరకు కళా క్షేత్ర కళకళలాడింది. ఒకప్పుడు అత్యంత చౌకబారుగా ముద్రపడిన నాట్యశైలి. ఉదాత్తమైన అథ్యాత్మిక భావప్రకటనగా ఆమోదం పొందింది. ఇదంతా రుక్మిణీ దేవి అరండేల్ ధృడస్పంకల్పం, కృషి వల్లనే సాధ్యమైంది. పరిస్థితులకు ఎదురీది మూఢభావాలను నిర్మూలించి అపురూపమైన కళా ప్రక్రియను అత్యున్నత శిఖరాలపై నిలబెట్టి ప్రపంచాన్ని తన దారికి రప్పించిన ఘనత రుక్మిణీ దేవి అరండేల్‌దే.

కలలకి, నిష్ణాతులకి అసాధ్యాలంటూ ఏమీ ఉండవని మరోసారి నిరూపించారు రుక్మిణీ దేవి అరండేల్. 
- ఎజి కృష్ణమూర్తి