Pages

Tuesday, November 2, 2010

రాష్ట్రానికి సూపర్ సైక్లోన్ గండం! * పొంచివున్న సూపర్ సైక్లోన్?

వాతావరణ నిపుణుల అనుమానం.. ముందే అప్రమత్తం కావాలని సూచన
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో వాయుగుండం
బంగాళాఖాతంలో బలంగా ఉన్న వాయుగుండం సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం
రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు... కోస్తాంధ్రపై పెను ప్రభావం
దీపావళి నాటికి ప్రతాపం చూపే ప్రమాదం... ఇదే జరిగితే భారీగా నష్టం
1977లో దివిసీమ ఉప్పెనకు సూపర్ సైక్లోనే కారణం

అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో వాయుగుండం
రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు వచ్చే అవకాశం
 
రాష్ట్రానికి తుపాను రూపంలో పెనుగండం పొంచి ఉందా..? ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనంతో అతలాకుతలమవుతున్న రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోందా..? దివిసీమను వణికించిన భయంకర పరిస్థితులు కోస్తాంధ్రలో మళ్లీ పునరావృతం కానున్నాయా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి ‘సూపర్ సైక్లోన్’ ముప్పు ఉందని పేర్కొంటున్నారు. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ వద్ద అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఏర్పడ్డ వాయుగుండం తీరుతెన్నులను బట్టి వీరు ఈ అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ముందుకు కదిలి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనంలో విలీనమైంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ పెను తుఫాన్‌కు ‘జల’ అని నామకరణం చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుఫాను మనరాష్ట్రం వైపు రావడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పట్టనుంది. అంటే దీపావళి (ఈ నెల 5) నాటికి ప్రతాపం చూపడం ఆరంభిస్తుందన్నమాట! ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో బలంగా ఉంది. దీని కదలికను బట్టి తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల వైపు దూసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాయుగుండం పరిస్థితిని అంచనా వేస్తున్న వాతావరణ శాస్తవ్రేత్తలు ఇది ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే 1999 నవంబర్‌లో ఒరిస్సాలో సంభ వించిన పరిస్థితులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. 1999 అక్టోబర్ 25న ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫానుగా, అనంతరం సూపర్‌సైక్లోన్‌గా బలపడి నవంబర్ మూడో తేదీ వరకూ ప్రతాపం చూపింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. ఈ బీభత్సానికి ఒరిస్సాలో 15 వేల మంది దుర్మరణం పాలయ్యారు. 1977 నవంబర్‌లో దివిసీమ ఉప్పెనకు కూడా సూపర్ సైక్లోనే కారణం. అయితే ప్రస్తుతం అంతటి తీవ్రత దీనికి లేకున్నా రానున్న ప్రమాదాన్ని తక్కువగా చూడలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా ఎలాంటి ప్రభావం చూపని అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాలతోనే ఈశాన్య రుతుపవనాలు రెచ్చిపోయి కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటిది రుతుపవనాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్న తరుణంలో వచ్చే పెను తుపానుతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో పలుచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు తోడుకానున్నాయి. మరోవైపు ఈ పెనుతుపాను వారం రోజుల్లో తమిళనాడుకు ఉత్తరంగా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాన్ని తాకుతుందని స్కైమెట్ అంచనా వేస్తోంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేకచోట్ల రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు కొద్దిపాటి భారీ వర్షాన్ని కూడా భరించే స్థితిలో ఇవి లేవు. ముందున్న ముప్పును అంచనా వేసిన ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లను ఈ నెల 9 వరకూ కొనసాగించాలని ఆదేశించింది. తుపాను ప్రభావం చూపడానికి ఇంకా రెండు, మూడు రోజుల సమయం ఉండటంతో పూటుగా నిండిన చెరువులు, కరకట్టల గట్టులను యుద్ధ ప్రాతిపదికన పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. తాగునీటిని, మందులను నిల్వ చేయాలని ఆంధ్రా వర్సిటీ వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు గౌరవ ప్రొఫెసర్ ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ సూచించారు.

సూపర్ సైక్లోన్ అంటే..?
వాతావరణంలో అల్పపీడన ద్రోణి నుంచి సూపర్ సైక్లోన్ ప్రస్థానం మొదలవుతుంది. ద్రోణి బలపడి అల్పపీడనంగా మారుతుంది. అది వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగానూ రూపాంత రం చెందాక తుఫాను అవుతుంది. ఇది బలపడితే తీవ్ర తుఫాను, మరింత తీవ్రమైతే సూపర్ సైక్లోన్‌గా మారుతుంది. అల్పపీడనంగా ఉన్నప్పుడు గాలుల వేగం గంటకు 30 కిలోమీటర్ల లోపు, వాయుగుండంగా మారితే 30-49 కిలోమీటర్లు, తీవ్రవాయుగుండానికి 50-61, తుఫానుకు 62-87, తీవ్ర తుఫానుకు 88- 117, అతి తీవ్ర తుపానుకు 118-220, సూపర్ సైక్లోన్‌కు 222 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ సమయంలో పక్కా ఇళ్లు, భారీ వృక్షాలు కూడా నేలమట్టమవుతాయి. 20 సెం.మీలకు పైగానే వర్షపాతం నమోదవుతుంది. సూపర్ సైక్లోన్ సమయంలో సముద్రంలో అలల ఉధృతి 14 మీటర్లకు పైనే ఉంటుంది.

Sunday, October 3, 2010

కలల ప్రపంచంలోకి... సరికొత్త ఆలోచనకు స్ఫూర్తి


పారిస్ పట్టణ ప్రజలకు ‘పాల్ కౌడమీ’ అంటే బోలెడంత ఇష్టం. ఇతగాడి ఆలోచన ఉంటే చాలు - ఎంచక్కా కలల ప్రపంచంలోకి దొర్లిపోవచ్చన్నది జనం మాట. హాయిగా నిద్రపోతూ ఈ లోకానే్న మర్చిపోవచ్చునంటార్ట. కొంపతీసి - ఇతగాడు ‘హిప్నటైజ్’ చేసో.. జోలపాట పాడో నిద్రపుచ్చుతాడా? అంటే అవేవీ కాదు. మీ బెడ్‌రూంని అందంగా డిజైన్ చేస్తాడు. మీ మనస్తత్వానికి తగ్గట్టు. పారిస్‌లో పావువంతు ఇళ్లు ఇతను డిజైన్ చేసినవే. తన ‘ఆర్ట్’తో జనాన్ని నిద్రపుచ్చటం ఇతనికి జోలపాటతో వచ్చింది. ఆఫీసులనూ పడగ్గదులనూ.. హాల్స్‌నూ - విభిన్న తరహాలో డిజైన్ చేసి జనాన్ని మెప్పించటమే కాదు.. పాత గుహల్లోకి సైతం తీసికెళ్లగలడు. బెడ్‌రూంని ‘ఎలుగుబంటి గుహ’గా మార్చేయగలడు. ఉరికే జలపాతం బెడ్‌రూంని తడిపేయనూ వచ్చు. అందంగా అమరిన ‘కీ బోర్డ్’ కాస్తంత తడిసి కరిగి గోడల నుంచీ జాలువారనూ వచ్చు. లేదా మరొకటి మరొకటి... మీ ఆలోచన ఏమిటో చెప్పండి. దానికి తగ్గట్టు ఉన్నది ఉన్నట్టుగా క్షణాల్లో మార్చివేస్తాడు. దీనికి అంత ఖర్చూ ఉండదు. భవన నిర్మాణంలో మిగిలిపోయిన రాళ్ల ముక్కలూ.. చిప్స్.. విరిగిన టైల్స్.. ఏవైనా కావొచ్చు. వాటిని భద్రంగా మీరు ఇంటికి తెచ్చుకోగలిగితే చాలు. ఇక మీ పనై పోయినట్టే.





ఓ రోజు ఖాళీగా కూర్చుని ఆలోచిస్తూంటే - బెడ్‌రూంలో ఓ మూలగా ‘కలర్’ అంటి ఉండటం గమనించాడు. తుడిపేద్దామని ప్రయత్నించాడు. పోలేదు. దాంతో ఆ గోడపై మరిన్ని ‘కలర్’ మరకలు వేశాడు. ‘మరక మంచిదే’ అన్న కానె్సప్ట్‌కి తగ్గట్టు తయారైందా గది. రోజులూ వారాలూ గడిచాయి. బెడ్‌రూమంతా రంగుల కలగా మారిపోయింది. ఇదేదో బాగుందే?! అనుకొని అప్పట్నుంచీ ‘గ్రాఫిక్ డిజైన్స్’ చేయటం మొదలుపెట్టాడు. అలా అలా అది పారిస్ అంతా పాకింది. ఇంటీరియర్ డిజైన్లకు పాల్ పెట్టింది పేరైంది. ఇదే బాటలో స్వీడిష్ గ్రాఫిక్ డిజైనర్ లిసా బెంగ్‌ట్సాన్ కూడా బెడ్‌రూంని ఫొటో ఫ్రేమ్‌లతో నింపేశాడు. అవన్నీ జ్ఞాపకాల పొరలు. ఏళ్ల తరబడి ఆల్బమ్‌లలో శిథిలమై పోతున్న జ్ఞాపకాలు అలా గోడలపై వేలాడటం సరికొత్త ఆలోచనకు స్ఫూర్తిని అందించింది.

-హేమ


కాఫీ ఏనాటిది?


కొన్నికొన్ని పరిశోధనలు ఎవరి ఆలోచనల్లో మెదిలినవో తెలీకుండానే ప్రపంచానికి సరికొత్త అధ్యాయానికి తెర తీస్తాయి. అటువంటి వాటిల్లో ‘కాఫీ’ ఒకటి. పొద్దున లేస్తూనే ఘుమఘుమలాడే ‘కాఫీ’ పరిమళాలను ఆస్వాదించని వ్యక్తి లోకంలోనే ఉండరు. కానీ ‘కాఫీ’ సిప్‌ని మొట్టమొదటిసారిగా ఎవరు చేసి ఉంటారు అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. కొన్ని వేల ఏళ్ల క్రితం - అబిస్సినియన్ జాతుల వారికి ‘బెర్రీ’ గింజలు లభ్యమయ్యాయి. ఇవి చూట్టానికి అలానే ఉండటంవల్ల వాటికి ఆ పేరు వచ్చింది. రుచిగా.. మనసుకి హాయినిచ్చేదిగా.. పరిమళ భరితంగా ఉన్న ఈ గింజలను ఆయా తెగలు తింటూండేవారు. అప్పటికి కాఫీ అన్న పదం పుట్టలేదు. అలా తూర్పు ఆఫ్రికన్లు మొట్టమొదటిసారిగా ఆ గింజలను ‘టేస్ట్’ చేశారు. క్రీ.శ.15వ శతాబ్దం నాటికి ఆ రుచి దక్షిణ అరేబియా వరకూ పాకింది. ఇప్పుడు మనం ‘రుచి’ చూస్తున్న కాఫీ గింజలు 200 ఏళ్ల నాటివే. వీటిని యెమెన్‌లో పెంచారు. క్రీ.శ.19వ శతాబ్దంలో జావాలో డచ్ వారు ఈ పంటను పెంచ నారంభించారు. అక్కడ్నుంచీ జమైకా ద్వీప సముదాయాల్లోనూ.. మధ్య.. దక్షిణ అమెరికాలకు పాకింది. యూరోప్‌లోనూ.. అమెరికాలోనూ ‘కాఫీ’ జీవితంలో ఒక భాగమైంది. నేడు ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యే కాఫీ పంటలో 3/4 వంతు బ్రెజిల్‌దే. ఎందుకంటే - ఇక్కడ కాఫీ పంటకు అనుకూల వాతావరణం ఉంది. ఇక వెనిజులా, కొలంబియా, గుటిమాలా, మెక్సికో, వెస్టిండీస్, జావా తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాయి. నేడు ‘కాఫీ’లో బోలెడన్ని వెరైటీలు. వాటిలో ‘మోకా’ ‘జావా’ ‘రియో’ ‘సాంటోస్’ ప్రసిద్ధి గాంచాయి.

- హెచ్


తపనే ‘వెల్త్’!


కామన్‌వెల్త్ క్రీడలను పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ‘కామన్‌వెల్త్ ఆన్ వీల్’ పోటీల్లో విస్మయానికి గురిచేసిన అంగవికలుల భరతనాట్య ప్రదర్శన.

గిన్నిస్ ఎడిటర్ మెచ్చిన గిన్నిస్ రికార్డు

పెద్ద ఆవు పక్కన నిలబడిన ఈ చిన్న ఆవు పేరు స్వాలో. ఇది ఎంత చిన్న ఆవు అంటే గొర్రెకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఎత్తు కేవలం 33.5 అంగుళాలు (0.8 మీటర్). పదకొండేళ్ల ఈ ఆవు ఇప్పటికే తొమ్మిది దూడలకు జన్మనిచ్చింది. తాజాగా అతిచిన్న ఆవుగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. చాలా విషయాలు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం గిన్నిస్ బుక్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెండే మనసు దోచింది. తాజాగా నమోదైన మూడువేల గిన్నిస్ రికార్డుల్లో క్రెయిగ్‌ను ఈ విషయం బాగా ఆకట్టుకుందని బీబీసీ పేర్కొంది.

సంబరాల స్వాతంత్య్రం !


విచిత్ర వేషధారణలో పొడవైన బూరలు ఊదుతూ కొనసాగుతున్న ఈ ఊరేగింపు మెక్సికోలోది. మెక్సికన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుక జరిగింది. ఇది మెక్సికన్లకు 200వ స్వాతంత్య్ర దినోత్సవం కావడం విశేషం. 1810 సంవత్సరానికి ముందు స్పెయిన్ పాలనలో ఉన్న మెక్సికన్లు సుమారు పదేళ్లు పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నారు.

బురక్రొద్దీ ఐడియా


సమస్య చూసే కోణాన్ని బట్టి పరిష్కారం ఉంటుంది. ఈ చిత్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగా నదిపై తీసినది. నదిని దాటడానికి బ్రిడ్జి లేకపోవడంతో అక్కడ పడవలు వాడేవారు. అయితే, గురప్రు డెక్క విపరీతంగా పెరిగిపోయి పడవ ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో స్థానికులు ఇలా పడవలన్నింటినీ ఒకదానిపక్కన ఒకటి వేసి వంతెనలాగా తయారుచేసుకున్నారు. ఆలోచించాలే గాని పరిష్కారాలకు ఏం కొదవ చెప్పండి!