Pages

Saturday, September 25, 2010

పొడుపు ప్రశ్నలు

సర్దుకుపోయే మనిషి

నీకు నిజాలు తెలుసుకునే హక్కు కావాలా? అబద్ధాలు వినే శక్తి కావాలా?
అబద్ధాలు తెలుసుకునే హక్కు, నిజాలు వినే శక్తి ఇచ్చినా పర్వాలేదు.

లెక్కమంతుడు

ఎన్ని అబద్ధాలు కలిస్తే ఒక నిజం అవుతుంది?
రెండు అబద్ధాలు పోట్లాడుకుంటే ఒక నిజం అవుతుంది.


భాష్యకారుడు

స్వార్థానికి మంచి అర్థం ఎప్పుడొస్తుంది?
అర్థం అంటే డబ్బు ఒక్కటే కాదని తెలిసినప్పుడు.

సూక్ష్మగ్రాహి

మూడు పూవులు ఆరు కాయలని ఎందుకు అంటారు?
ఆడవాళ్లు జనాభాలో సగమే కదా!

దయార్ద హృదయుడు

మనిషి మెదడును ప్రింటర్‌కు కనెక్ట్ చేస్తే ఏమవుతుంది?
పాపం! నల్లటి కాగితాలు ఎన్నని చదువుతారు అందరూ.

యదార్థవాది

మంచివాళ్లు ఉండబట్టే వర్షాలు ఇంకా పడుతున్నాయని, పంటలు ఇంకా పండుతున్నాయని ఎందుకంటారు? వాళ్ల అవసరాలు అంత ఎక్కువా?
ఎక్కువ వానలు కురిసి ఎక్కువ పంటలు పండకపోతే మిగతావాళ్లు వాళ్ల కడుపు మాడ్చి చంపేయరూ.

Tuesday, September 7, 2010

8 - 9 - 10 వెయ్యేళ్లకోసారి * ఇది బుధవారమే ప్రత్యేకత!

 8.. 9.. 10.. ఇదేంటీ..!? వరుసగా అంకెలు లెక్కబెడుతున్నారు అనుకుంటున్నారా!? అదేం కాదు. నేటి బుధవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇదో అరుదైన రోజు. ఈరోజు తారీఖు 8. ఈనెల సెప్టెంబర్ అంటే, 9. ఈ ఏడాది 2010, అంటే 10. ఈరోజు ఎవరు సంతకాలు చేసి తేదీ వేయాల్సి వచ్చినా వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది వేయాల్సిందే! ఈ అంకెలు ఇలా వరుసగా రావడం వెయ్యి సంవత్సరాలకు ఓసారి వస్తుంది.

ఇక, ఈ తేదీల కలయిక చాలా మంచిదని సంఖ్యా శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఎందుకంటారా.. ఈ మూడింటినీ కలిపితే 27. ఆ రెండు అంకెలనూ కలిపితే 9. ఇది అందరికీ మంచి సంఖ్యేనని వారు వివరిస్తున్నారు. అందరికీ కలిసొచ్చే ఈ సంఖ్య వల్ల ఈ రోజంతా శుభమే కలుగుతుందని చెబుతున్నారు.  

Monday, September 6, 2010

వర్మగారొక మర్మయోగి

(సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. 'రక్తచరిత్ర' నేపథ్యంలో ఓబుల్‌రెడ్డి అనుచరులు తనని బెదిరించారన్న వర్మ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమా పాటలో తెలుగు దర్శకులందరినీ విమర్శించి హాట్‌టాపిక్ అయ్యారు. మరి ఆయన గురించి నటుడు ఎవిఎస్ తన బ్లాగ్‌లో ఏం రాసుకున్నారో చదవండి)

రామ్‌గోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం. నిస్సందేహంగా గొప్ప దర్శకుడు. తెలుగు వాళ్లు గర్వించదగ్గ జాతీయ స్థాయి పర్సనాలిటీ. తెలుగు సినిమాలకో ట్రెండ్ నేర్పిన సంచలన సాంకేతిక నిపుణుడు. ఆయనలోని దర్శకుడి ప్రతిభా పాటవాలకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్... గ్లామర్... నిరీక్షణ.. ఇది అందరికీ సాధ్యం కాని పని.

కాని ఇటీవలి కాలంలో వర్మలోని దర్శకుడిని బిజినెస్‌మాన్ డామినేట్ చేస్తున్నాడు. సినిమాను ఎలా అమ్ముకోవాలి.. ఎలా బయ్యర్లను ఆకట్టుకోవాలి... రిలీజుకు ముందే సినిమాను ఎలా సెన్సేషన్ చేసుకోవాలి.. అన్న వాటి మీదనే వర్మ గారి దృష్టి యావత్తూ ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వినిపిస్తున్న విమర్శ. ఇంతకుముందు వర్మ సినిమాలు రిలీజుకు ముందు నిశ్శబ్దంగా ఉండి రిలీజు తరువాత సంచలనాలను సృష్టించేవి.

ప్రస్తుతం రిలీజుకు ముందు సంచలనాలు సృష్టించి రిలీజు తరువాత నిశ్శబ్దంగా ఉంటున్నాయి. ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక వివాదం. అవి నిజమే అయినా తరచూ జరుగుతుండటం వల్ల చూసేవాళ్లకు.. వినేవాళ్లకు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక గొప్ప దర్శకుడి సినిమాలకు ఈ తరహా వివాదాలు అవసరమా? అన్న ప్రశ్న నాలాంటి చాలామంది అభిమానులను బాధకు గురిచేస్తోంది. తమ సినిమాలను బిజినెస్ చేసుకోవటం ఎవరికైనా అవసరమే.. కాదనలేము. కాని రాంగోపాల్ వర్మ లాంటి అత్యున్నత దర్శకుడికి ఆ అవసరం లేదన్నది నా అభిప్రాయం.

పోనీ అంతే మేరకు ఆయన సినిమాలు విజయాలను పొందుతున్నాయా? అంటే అదీ లేదు. వర్మ గారి లెక్కలు ఏమిటో తెలుసుకోవాలంటే ఆ మర్మం ఏమిటో అర్థం చేసుకోవాలంటే అందరివల్లా కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. వర్మ గారిని అర్థం చేసుకోవడంలో నేను ఫెయిలయ్యానని ఎవరయినా భావిస్తే నేను చేయగలిగిందేమీ లేదు.
- ఎవిఎస్, ఉ. 9.32, సెప్టెంబర్ 3, 2010

Sunday, September 5, 2010

సేమియా బచ్చలి బొండా

కావలసిన పదార్థాలు
సేమియా - ఒక కప్పు, శనగపిండి - ఒక కప్పు, గోధుమ పిండి - ఒక కప్పు, మినుములు - ఒక కప్పు, క్యారెట్‌లు - రెండు, బచ్చలి ఆకులు(సన్నగా తరిగినవి) - ఒక కప్పు, ఉల్లిపాయలు - మూడు, పచ్చి మిరపకాయలు - మూడు, కొత్తిమీర- ఒక కట్ట, కరివేపాకు - మూడు రెబ్బలు, వంటసోడా - చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేయు విధానం
సేమియాను ఒక గంట పాటు నానబెట్టిన తరువాత నీళ్లు వంపేసి పెట్టుకోవాలి. మినుములను కూడా ఒకగంట ముందుగా నానబెట్టి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్‌లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఈ పదార్థాలన్నింటినీ వేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి.

కొత్తిమరీ, కరివేపాకు, వంటసొడా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక పాత్రలో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. పిండిని బొండాల మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే..సేమియా బచ్చలి బొండాలు రెడీ.
- కె. మంజుల, తిరుపతి.