Pages

Monday, September 6, 2010

వర్మగారొక మర్మయోగి

(సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. 'రక్తచరిత్ర' నేపథ్యంలో ఓబుల్‌రెడ్డి అనుచరులు తనని బెదిరించారన్న వర్మ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమా పాటలో తెలుగు దర్శకులందరినీ విమర్శించి హాట్‌టాపిక్ అయ్యారు. మరి ఆయన గురించి నటుడు ఎవిఎస్ తన బ్లాగ్‌లో ఏం రాసుకున్నారో చదవండి)

రామ్‌గోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం. నిస్సందేహంగా గొప్ప దర్శకుడు. తెలుగు వాళ్లు గర్వించదగ్గ జాతీయ స్థాయి పర్సనాలిటీ. తెలుగు సినిమాలకో ట్రెండ్ నేర్పిన సంచలన సాంకేతిక నిపుణుడు. ఆయనలోని దర్శకుడి ప్రతిభా పాటవాలకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్... గ్లామర్... నిరీక్షణ.. ఇది అందరికీ సాధ్యం కాని పని.

కాని ఇటీవలి కాలంలో వర్మలోని దర్శకుడిని బిజినెస్‌మాన్ డామినేట్ చేస్తున్నాడు. సినిమాను ఎలా అమ్ముకోవాలి.. ఎలా బయ్యర్లను ఆకట్టుకోవాలి... రిలీజుకు ముందే సినిమాను ఎలా సెన్సేషన్ చేసుకోవాలి.. అన్న వాటి మీదనే వర్మ గారి దృష్టి యావత్తూ ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వినిపిస్తున్న విమర్శ. ఇంతకుముందు వర్మ సినిమాలు రిలీజుకు ముందు నిశ్శబ్దంగా ఉండి రిలీజు తరువాత సంచలనాలను సృష్టించేవి.

ప్రస్తుతం రిలీజుకు ముందు సంచలనాలు సృష్టించి రిలీజు తరువాత నిశ్శబ్దంగా ఉంటున్నాయి. ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక వివాదం. అవి నిజమే అయినా తరచూ జరుగుతుండటం వల్ల చూసేవాళ్లకు.. వినేవాళ్లకు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక గొప్ప దర్శకుడి సినిమాలకు ఈ తరహా వివాదాలు అవసరమా? అన్న ప్రశ్న నాలాంటి చాలామంది అభిమానులను బాధకు గురిచేస్తోంది. తమ సినిమాలను బిజినెస్ చేసుకోవటం ఎవరికైనా అవసరమే.. కాదనలేము. కాని రాంగోపాల్ వర్మ లాంటి అత్యున్నత దర్శకుడికి ఆ అవసరం లేదన్నది నా అభిప్రాయం.

పోనీ అంతే మేరకు ఆయన సినిమాలు విజయాలను పొందుతున్నాయా? అంటే అదీ లేదు. వర్మ గారి లెక్కలు ఏమిటో తెలుసుకోవాలంటే ఆ మర్మం ఏమిటో అర్థం చేసుకోవాలంటే అందరివల్లా కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. వర్మ గారిని అర్థం చేసుకోవడంలో నేను ఫెయిలయ్యానని ఎవరయినా భావిస్తే నేను చేయగలిగిందేమీ లేదు.
- ఎవిఎస్, ఉ. 9.32, సెప్టెంబర్ 3, 2010

No comments:

Post a Comment