అసాధ్యాలంటూ ఏమీ ఉండవేమో, స్ఫూర్తితో కొన్ని పద్ధతులను అవలంబిస్తే...
*** మనసుంటే మార్గముంటుంది; పర్‌ఫెక్ట్ చదువు, పర్‌ఫెక్ట్ ఉద్యోగం అవసరం లేదని నిరూపించాడు నోబెల్ బహుమతి విజేత సర్ సి.వి.రామన్
*** కలలకు గమ్యాలకు ఉన్న శక్తి సామర్థ్యాలేమిటో ప్రపంచానికి చాటిచెప్పిన మరో విశిష్ట భారతీయుడు; మన దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా దారి మళ్ళించిన విజేత - ఎం.ఎస్.స్వామినాథన్.
*** విల్మా రుడాల్ఫ్
అమెరికన్ వనిత. నల్లజాతికి చెందినది.
1940లో పుట్టిన ఆమెకు సంవత్సరం తిరిగేలోగా పోలియో సోకింది.
డాక్టర్లు ఇక ఆమె నడవలేదని తేల్చి చెప్పారు.
ఇరవై ఏళ్ళ తర్వాత 1960లో జరిగిన ఒలంపిక్స్‌లో విల్మా రుడాల్ఫ్ మూడు గోల్డ్ మెడల్సు గెలుచుకుంది. వాటిలో రెండు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి.
ఇది కల కాదు.
కథ కాదు
యాభై ఏళ్ళ క్రితం జరిగిన చరిత్రలోని ఒక పుట.
ఇది చదివాక అసాధ్యాలు అంటూ ఏవైనా ఉంటాయని మీరింకా భావిస్తూ ఉంటే, తీరిగ్గా కూర్చొని పునరాలోచన చేయండి
*** నేనెవర్ని?
నాలో దాగి ఉన్న ప్రజ్ఞ ఏమిటి?
ఏ పనిలో నేను నిష్ణాతుణ్ణి??
ఏ పని నన్ను ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది??
స్వశక్తిపై నమ్మకాన్ని, ఎన్నుకొన్న రంగంలో అపారమైన కృషి చేసి, నిష్ణాతుడిగా మారి దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు గడించిన కర్సన్‌బాయ్ పటేల్ సృష్టి 'నిర్మా' వాషింగ్ పౌడర్. ఆయన జీవిత గాథ, విజయాలు మనందరినీ ఉత్తేజపరిచేవే!
మనందరికీ మార్గదర్శకాలే!
*** ఈ విజేతలందరూ సామాన్యులే
ప్రేరణే వారి బలం. పద్ధతులు వారి ఆయుధాలు
*** రే క్రాక్
వయస్సు: 52
అమెరికన్
డయాబిటీస్ ఉంది.
ఆ్రర్దయిటిస్ కూడా ఉంది
గాల్ బ్లేడర్ తీసేసారు.
థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం కూడా తీసేసారు.
"అయినప్పటికి నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది''.
రే క్రాక్ అన్నమాటలివి.
అన్నమాటలే కాదు. చేసి నిరూపించాడు తనకీ, యావత్ ప్రపంచానికి.
నేటి మెక్‌డొనాల్డ్స్ సంస్థ నిర్మాణంలో మూలస్థంభం లాంటి వ్యక్తి ఈ రేక్రాక్ మహాశయుడే.
ఈ ప్రస్థానం మొదలైంది ఆయన 52వ ఏట. రకరకాల ఆరోగ్య సమస్యల వలయంలో ఉన్నప్పటికీ రే క్రాక్ తన గమ్యాలను వీడలేదు. అనుకున్నది సాధించాడు.
*** ఇలా ఎన్నో గాథలు. అన్నీ స్ఫూర్తినిచ్చేవే. మనల్ని కార్మోన్ముఖులుగా మార్చేవే.
రాబోయే వారాల్లో వీరి గురించి, ఇంకా పలువురి గురించి వివరంగా ముచ్చటించుకుందాం.
విజయానికి మార్గాలేవో మనమూ కనుగొందాం!
ఈ నా రచనకి మూలకారణమైన ప్రస్థానానికి నాంది పలికిన రోజు నాకింకా ఎంతో స్పష్టంగా గుర్తుంది.
31 అక్టోబర్ 1968
ఆ రోజు రాత్రి చేతిలో ఒక పాత ఇనప్పెట్టె, అందులో రెండు మూడు జతల బట్టలు, జేబులో నూట యాభై రూపాయలు, గుండెల్లో భయం, మనస్సులో వేయి కోరికలతో హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌లో రాత్రి 7.55కి బయల్దేరాల్సిన బాంబే ఎక్స్‌ప్రెస్‌లో ఒక థర్డ్‌క్లాస్ డబ్బా ఎక్కాను. అన్నీ తెలియని ముఖాలు. ఊహకందని భవిష్యత్తు.
29 నవంబరు 2009న తిరిగి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ నివాస మేర్పరచుకోవటానికని.
నలభై ఒక్క సంవత్సరాలు.
ఆ పైన ఇరవై ఎనిమిది రోజులు.
జీవితంలోని ముఖ్య భాగమంతా అహ్మదాబాద్‌లోనే గడచిపోయింది.
నేను అహ్మదాబాద్‌లో అడుగు పెట్టినప్పటి పరిస్థితులకి, తిరిగి హైదరాబాద్ రావటానికి వీడ్కోలు చెప్పిన నాటికి ఒక గొప్ప తేడా ఉంది.
ఆనాడు, తమ ప్రకటనల కోసం గుజరాత్‌లోని పలు వ్యాపార సంస్థలు బాంబేలోని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలకు ఆ బాధ్యతలను అప్పచెప్పుతుండే వారు.
1980 దశకంలో అది పూర్తిగా ఆగిపోయింది. అహ్మదాబాదులోని ముద్రా స్థాపనతో.
1990 దశకానికల్లా దేశంలోని నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా అడ్వర్‌టైజింగ్ రంగంలో ఉన్నత విద్య నభ్యసించటానికి విద్యార్థులు అహ్మదాబాద్‌కి రావటం మొదలుపెట్టారు. మైకా స్థాపనతో (మైకా: ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాదు) నేడు ఇది అంతర్జాతీయంగా పేరుపొందిన విద్యా సంస్థ.
ఎలా జరిగాయి ఈ అద్భుతాలన్నీ..
-ఎజి కృష్ణమూర్తి
No comments:
Post a Comment