Pages

Wednesday, August 25, 2010

ఇష్టం కనిపెట్టడమే కష్టం... జయహో.. విజయగాధలు: పద్ధతులు-2

ఇష్టమైన పనిని మనందరం కష్టపడి చేస్తాం అని మనందరికి తెలుసు.
ఆ ఇష్టమైన పనేదో మనకెప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది ??
కొంతమందికి తల్లిదండ్రులు స్ఫూర్తినిచ్చి, వారి వృత్తే పిల్లలకు ఇష్టమైన వృత్తిగా మారేలా చూస్తారు. మనలో చాలా మందికి రోల్ మోడల్స్ మన తల్లిదండ్రులే కదా.
కొంతమంది దురదృష్టవంతులకి ఇది వర్తించకపోవచ్చు. తల్లిదండ్రులు నేరస్తులయితేనో, లంచగొండులయితేనో..
పైన ఉదహరించుకొన్న కోవకి చెందిన వారు - డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు తదితరులు.
వీరికి వంశపారపర్యంగా వస్తున్న కుటుంబ వృత్తి వ్యాపారాలు ఆదర్శప్రాయంగా, ఆచరణీయంగా మారి, ఎంచుకున్న వృత్తి ఇష్టపడే వృత్తి ఒకటిగానే ఉండిపోతాయి. వీరికి ఏ చిక్కూ లేదు.
తండ్రిదో ఉద్యోగం, పిల్లలవి వేరువేరు...
మా నాన్న గారు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. మా అన్నయ్యా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోనే. చిన్నతనంలోనే మా అన్నయ్యకి నాన్న గారి వృత్తి మీద అభిమానంవల్లో లేక మా నాన్న గారి ప్రోద్భలంవల్లో ఆ రంగంలో చదువుకొని ఉద్యోగస్తుడయ్యాడు. ఆ రంగంలోనే రిటైర్ అయ్యాడు. తనకు ఆ రంగమంటే అసహ్యమని మా అన్నయ్య చెప్పగా నేనెన్నడూ వినలేదు.

ఇక నా విషయానికొస్తే, నా కిష్టమైన రంగమేంటో తెల్సుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా ప్రయోగాలు చేశాను. విద్యార్థిగా కనీసం ఇంజనీరింగ్ చదువుకోవాలనే గాఢమైన కోరికుండేది. కనీసం అని ఎందుకన్నానంటే, అసలైన కల డాక్టర్ కావాలని. నిజానికి ఆ రోజుల్లో అంతే 1950 దశకం నుంచి 1990 దశకం దాకా ప్రతి వాడికి డాక్టరో, ఇంజనీరో కావాలనే కోరిక తప్ప మరేది ఉండేది కాదేమో. నేటిలాగా పలు రంగాలు అభివృద్ధి చెందలేదు. పరిమితమైన జీవితాలు - ఇంకా పరిమితమైన చదువులు. ఇంకా ఇంకా పరిమితమైన అవకాశాలు. ఈ అవకాశాలు అదృష్టవంతులకు మాత్రమే లభ్యమవుతాయన్న ఒక బలమైన నమ్మకం కేవలం నాకే కాదు, ఆ నాటి సమాజంలో గాఢంగా పాతుకుపోయిందేమోననిపిస్తుంది.

"పెట్టి పుట్టాలి''
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా''
ఇలాంటి సామెతలు తరచుగా వింటుండే వాణ్ణి. ముఖ్యంగా మా అమ్మ ద్వారా.
బీదరికం
తరతరాలుగా వస్తున్న బీదరికం కాదు.
"మా నాన్న గారు పుట్టినపుడు 1901లో వారిది గుంటూరు జిల్లాలోనే ఒక సంపన్న కుటుంబం''.
'బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్' అంటామే - వాడికేమయ్యా, ఆగర్భ శ్రీమంతుడనో లేక నోట్లో బంగారు చెంచాతో పుట్టాడయ్యా అనో అంటామే - ఆ కోవకి చెందిన వారు మా నాన్న గారు.

పురిట్లోనే తల్లిని కోల్పోయారు మా నాన్నగారు. కొన్నేళ్ల తర్వాత భోగభాగ్యాలు కూడా, ఎందుకయ్యా అంటే, మా తాత గారు ఆనాటి సమాజంలోని పదుగురిలా అబద్దం చెప్పని సీదాసాదా వ్యాపారస్థుడు. పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారం. లక్షల్లో స్టాక్ కొని గిడ్డంగుల్లో నింపారు. సడన్‌గా రేట్లు పడిపొయ్యాయి. బాకీలు పెరిగాయి. కోర్టు కేసులు. ఒక్క అబద్దం చెబితే యావదాస్థి నిలిచేది. ఊహు.. ఆ మహానుభావుడు నిజం చెప్పాడు కోర్టులో యావదాస్థి తనదేనని.. తనది కాదు, తమ్ముడిదని చెప్పుంటే ఆస్తి జప్తు జరిగేది కాదు.
మాటే ప్రాణంగా భావిస్తున్న రోజులవి. విలువలకి సర్వం కోల్పోవటానికవి సిద్దమయిన రోజులవి.

మా తాత గారు అబద్దం చెప్పలేదు. ఆస్థి నిలువలేదు.
మా నాన్న గారి నోట్లోని బంగారు చెంచా సడన్‌గా సత్తు
చెంచాగా మారిపోయింది.
జీవన పోరాటం మొదలైంది. చిన్న ఉద్యోగం.
ఆనాటి అందరి లాగే పెద్ద కుటుంబం. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. నాది రెండో నంబరు.
పుట్టింది వినుకొండలోనైనా నా చిన్ననాటి జ్ఞాపకాలన్ని తెనాలి, బాపట్ల లోనివే. తెనాలిలోని మారీస్ పేటలో ఉండేవాళ్ళం. పూరింట్లోని ఒక భాగం అద్దెకు తీసుకుని అందులో ఉండేవాళ్లం.
మిగతా అమ్మల సంగతి నాకు తెలీదు కాని, మా అమ్మ అంత మంచి అమ్మ, కష్టపడే అమ్మ వేరెవ్వరూ ఏ లోకంలోనూ ఉండరు.

ఐదుగురు పిల్లలు... వీరు బతికిన సంతానం. పోయిన వారు కాని తెల్సినంత వరకు మరో ఇద్దరు. అందరి కన్నా పెద్దదైన అక్క, అందరి కన్నా చిన్నదైన చెల్లెలు.
ఇంట్లో బీదరికం.
ఎడంపక్కన మేడ. చౌదరి గారు ఉంటుండేవారు. ఆ రోజుల్లో మేడ ఉందంటే భాగ్యవంతుడి కింద లెక్కే కదా.
కుడి పక్కన డాబా ఇల్లు. అందులో రోజు నాకు దర్శనమిస్తూ, నా ఈర్ష్యకు గురైన ఒక మధ్య వయస్కుడు.
ఆరేడు ఏళ్లు ఉంటాయామో నాకు అప్పుడు.
రోజు ఉదయం స్కూలుకి వెళ్లేటపుడు ఈ పెద్ద మనిషి ఎంచక్కా ఒక పడక కుర్చీలో హాయిగా పడుకుని, చేతిలో పేపరు, పక్కన టేబులు మీద పాడుతున్న రేడియోతో దర్శనమిచ్చేవాడు.

ఇవన్నీ మాకు లేవు.
డాబా లేదు.
రేడియో లేదు.
పూరిల్లు, కరెంటు లేదు.
ఆహా ఈయన గారిది ఏమి అదృష్టమనుకుంటూ రోజూ ఈర్ష్యకు గురయ్యేవాడిని. నేను ఏనాటి కైనా ఈ పెద్ద మనిషిలాగా ఓ మిద్దె, ఓ రేడియో ఒక పడక్కుర్చీ పొంది, హాయిగా జీవించాలనేకునేవాణ్ణి.
దానికి మరి పెట్టి పుట్టాలి కదా.

అదృష్టముండాలి కదా.
కష్టేఫలి సూత్రం వినే వయస్సు లేదు. దాన్ని నమ్మి ఆచరించే వయస్సు అంతకన్నా కాదు.
ఈ నమ్మకం - అదృష్టమే.. జీవితంలోని ప్రతి మంచికి, సుఖానికి మూల కారణమనే నమ్మకం - 1968 నవంబర్ 2న అహ్మదాబాద్ చేరిన తర్వాత పదేళ్లలో పూర్తిగా మరుగున పడిపోయింది.
1968 లో గీరా బెన్ శరభాయ్‌ను కలిసాను.
1976లో ధీరూభాయ్ అంబానీనీ కలిసాను.

1968 నుంచి 1971 దాకా కష్టపడి పనిచేసి గీరా బెన్ నమ్మకాన్ని, అభిమానాన్ని పొంది 1972 లో అహ్మదాబాద్‌లో స్థాపించబడిన శిల్పీ అడ్వర్‌టైజింగ్‌లోకి మార్చబడ్డాను.
1972 నుంచి నేటి దాకా ఈ అడ్వర్‌టైజింగ్ రంగంతో తెగని బంధం నాది. ఈ రంగమే నాకు కూడు, గుడ్డ, ఇల్లు వాకిలీ, మొబైల్ అన్నీ సమకూర్చింది. ఎంతో ప్రియమైన రంగం నాకిది.
ఇన్నేళ్ల తర్వాత కూడా అంటే. 38 ఏళ్ల తర్వాత కూడా ఏదన్నా, మంచి యాడ్ సృష్టిలో భాగం పంచుకుంటే ఆనాడు పండగే.
ఎన్ని గంటలైనా పనిచేయగలను, నేటికి కూడా అలసిపోకుండా.

దీన్నే ఇష్టమైన పని కష్టం కాదనటం అంటే.
అయితే నా విషయంలో ఈ పనే నా కిష్టమైనదని 1972లో కాని తెలియలేదు. అంటే నా ముప్పయ్యో ఏట.
ఈ లోగా ఎన్ని ప్రయోగాలో, కూటి కోసం కోటి విద్యలంటారే.. అలాగా...
అయితే ఏదో ఒక రోజున మన కిష్టమైన పనేదో మనం గ్రహిస్తేనే, జీవితంలో ముందంజ..దానికో సార్థకత లభించేది...


-ఎజి కృష్ణమూర్తి

No comments:

Post a Comment