Pages

Wednesday, August 25, 2010

డబ్బే ముఖ్యం కాదు.. జయహో విజయగాధలు : పద్ధతులు - 3

ఇష్టమైన పని, అది ఎంత కష్టమైనా ఆనందంగా చేస్తాం...చేస్తూనే ఉంటాం...
ఉదాహరణగా, ప్రేయసి పార్కులో ఎదురు చూస్తుంది. బస్సు దొరకలేదు.ఆలస్యమవుతూంది.. మరో బస్సు వచ్చింది. జనంతో కిటకిటలాడుతూ ఉంది. ఫుట్ బోర్డు మీద వెళ్లాడ్తూ దుమ్ము ధూళి లెక్కచేయకుండా, సంతోషంగా ప్రయాణం చేసి ప్రియురాలిని చేరుకుంటాడు ప్రియుడు.
ఇంతకన్నా సాహసాలు చేసిన ఎంతో మంది ప్రేమికుల కథలు,గాధలు మనకు సుపరిచయాలే కదా !
ఇష్టమైన వ్యక్తి కోసం కష్టంలో కూడా సుఖమే దొరుకుతుంది.
అసలది కష్టమైతేనే కదా...
అదే మన ఫుట్ బోర్డ్ ప్రియుణ్ణి అలాగే ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లవయ్యా అంటే వెళ్తాడా? ఛాన్సేలేదు !!
నిదానంగా ఆఫీసు చేరుకొని ఎందుకు ఆలస్యమయిందయ్యా అంటే, బస్సు దొరక లేదంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇష్టమైన పనికి, లేని దానికి ఉన్న తేడా ఇది.
ముద్రాలో ట్రీసా అనే ఆవిడ నా సెక్రటరీగా చాలా కాలం పని చేసింది. ఆమెకి తన వృత్తి మీద అపారమైన ప్రేమ, గౌరవం. రాత్రిపూట, పెను తుపాను, నాలుగైదు అడుగుల ఎత్తుగా సిటీ అంతా నిలిచిన నీరు..ఇవేవి లెక్కచేయకుండా మా ఇంటికి వచ్చింది ఆ మర్నాడు ఉదయం నా ప్రయాణానికి అవసరమైన టిక్కెట్లు, ఆ మీటింగ్ కాగితాలతో.. తన వృత్తి మీద ఎంత ఇష్టం, గౌరవం లేకపోతే ఈ సాహసం చేయగలుగుతుంది ట్రీసా.
ఫలితంగా అటువంటి వారికి సంస్థలో గౌరవ మర్యాదలు అందరి కన్నా మిన్నగా జీతభత్యాలు లభించటం సహజమే కదా. విజేతలు అవలంబించే పద్దతుల్లో ఇదొకటి. ఎన్నుకున్న వృత్తిని ప్రేమించటం, అందులో ఉత్తములుగా ఎదగటం.
అందరికీ డబ్బు కావాలి !
అయితే డబ్బు ఉప ఉత్పాదన అన్న విషయం చాలా మందికి తెలియదు. నమ్మకంగా కష్టపడి పని చేస్తే పేరొస్తుంది. దాని ప్రతిఫలమే డబ్బు. ఇంత చిన్న సత్యం గ్రహించలేక డబ్బు కోసం వెంపర్లాడి, అది లభించక అశాంతికి గురైపోతాం లేదా అడ్డదార్లు వెతుక్కుంటాం.
మూర్ఖత్వం కాదా ?
గుజరాతీలకు వంశపారపర్యంగా అబ్బినది వ్యాపారంలోని మెళకువలు.. వ్యాపారం పట్ల మక్కువ. ఉద్యోగాలంటే అయిష్టం. వారికి వ్యాపారమంటే ఎంతో ఇష్టం.అందుకే తరాలు మారినా కుటుంబ వ్యాపారం అలా అలా సాగిపోతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది.
కనుకే వీరికి ఇష్టమైన పనేదో తెల్సుకోవటం, ఆ పనిని ఎంతో ఇష్టంగా చేయటం కష్టం కాదు.
మరి మనలాంటి వారి మాటేమిటి ?
తరతరాలుగా వ్యాపారాన్నే నమ్ముకున్న గుజరాతీయులు కాదు మనం. మన తల్లిదండ్రులు డాక్టర్లు, లాయర్లు కారు. మన కుటుంబానికంటూ ఎలాంటి వ్యాపారమూ లేదు. రాజకీయాల మీద వ్యామోహం లేదు మనకి.
మధ్యతరగతి లేక నిత్యం పోరాటం సాగిస్తున్న బీద కుటుంబాలో మనవి.
ఎలా మనకి ఏది ఇష్టమో తెల్సుకోవటం ? ఎలా ఆ తెల్సుకున్న రంగంలో నిష్ణాతులుగా మారటం ?
ఎలా విజేతగా రూపాంతరం చెందటం. ???
ప్రశ్నలు..ప్రశ్నలు.. ప్రశ్నలు...
సమాధానాలకు మూలకారణాలు ప్రశ్నలే కదా !
మీ ప్రస్థానం కూడా ప్రశ్నల నుంచే మొదలు కావాలి. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటూనే ఉండాలి. మీకు సమాధానం లభించేదాకా.
నా మొదటి ఉద్యోగం బాపట్ల కోర్టులో స్టెనో టైపిస్టుగా.
ఇంజనీరింగ్ చదవాలనే నా కోరిక ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులు రాక తీరని కోరికగానే మిగిలిపోయింది. 1956లో ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాను బాపట్లలో. 56 శాతం వచ్చినట్లు గుర్తు. పాలిటెక్నిక్‌కి ఆ మార్కులు సరిపోలేదు. డొనేషన్ రాజ్యం ఇంకా మొదలు కాలేదు. అందుకని తమిళనాడులో ఉంటున్న మా ఆమ్మ కొడుకు సహాయం అర్థించాం. ఆయన మంచి పొజిషన్‌లో, ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాడు. సరే, రమ్మన్నాడు మధురై. నేను, మా నాన్న గారు పెట్టే బేడాతో వెళ్లాం. నన్ను దింపి రెండ్రోజులుండి, మా నాన్న బాపట్ల తిరిగి వచ్చారు.

ఐదారు రోజుల తర్వాత తెల్సింది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇతర రాష్ట్రాల వారికి సీటు రావటం చాలా కష్టమని. అంతే తిరుగుటపాలో పెవిలియన్‌కి. బాపట్లకు చేరా.

తర్వాత తెల్సింది జీవితంలోని మంచి చెడ్డల గురించి సింహావలోకనం చేసుకుంటున్న సమయంలో. నాకే గనుక ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులు అంటే ఏ డెబ్బయ్యో, ఎనభైయ్యో వచ్చుంటే నాకు మన రాష్ట్రంలోనే ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజిలో ఇంజనీరింగ్ సీటు వచ్చి ఉండేదని. జీవితంలో మొదటి పాఠానికి పునాది పడింది ఆ రోజుల్లోనే..
చేస్తున్న పని ఏదైనా కష్టపడి ఆ పనిలో శ్రేష్టుడిగా నిలవాలని..
'విన్నర్ టేక్స్ ఆల్'- విజేతకే అన్నీ లాంటి లోకోక్తులతో తర్వాత పరిచయమైనప్పటికి, ఒక్కటి మాత్రం నిజం నాకు ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులొచ్చి ఉంటే, అప్పటి నా కల నెరవేరేదని.
మధురై నుంచి బాపట్ల తిరిగి వచ్చిన నన్ను చూసి మా కుటుంబమంతా షాక్ అయ్యారు. వారి దృష్టిలో నేను అక్కడ పాలిటెక్నిక్‌లో చేరిపొయ్యాననే. నిరాశ నిస్పృహలు మరుగున పడ్డాక కొన్నాళ్లు టీకాలు వేసే వేక్సినేటరుగా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత టైపు, షార్టు హ్యాండు క్లాసుల్లో చేరాను.

అప్పుడు నా వయసు 15
ఒక సంవత్సరంలోనే టైపు హయ్యరు, షార్టు హ్యాండు లోయర్ పాసయ్యాను.
బాపట్ల సబ్‌కోర్టులో లీవ్ వేకెన్సీలో రెండు మూడు నెలల కోసం స్టెనో టైపిస్ట్ ఉద్యోగం.
పదహారేళ్ల వయసు
పొట్టిగా ఉండేవాణ్ణి.
శాస్త్రిగారని అడిషనల్ సబ్ జడ్జిగారి దగ్గర ఉద్యోగం. స్ఫురద్రూపి, కంచు గంట లాంటి కంఠం.
ధారాళంగా ఇంగ్లీషులో డిక్టేషన్ ఇచ్చేవాడు పొద్దున్నే ఇంటికి పిలిచి. ఒక్క ముక్క కూడా అర్ధమయ్యేది కాదు. తప్పుల తడకలుగా టైపు చేసి ఇచ్చే వాణ్ణి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు.
ఒక రోజున కోర్టులోకి పిలిచాడు డిక్టేషన్‌కని. కోర్టులో కెళ్లే సిబ్బందీ అందరూ కోట్లు ధరించాలి. నాకు సొంత కోటు లేక మా అన్నయ్య కోటు వేసుకొని కోర్టుకెళ్తుండే వాడిని.
ఆ రోజున శాస్త్రిగారి మూడ్ బాగా లేదో, నా టైపింగ్ మరీ చంఢాలంగా ఉందో కాని, నిండు కోర్టులో ఎడాపెడా దులిపేశాడు. కోర్టులోనే ఏడ్చాను. నిజానికి నేటి క్కూడా- అంటే 52 ఏళ్ల తర్వాత కూడా ఆ కోర్టు సీను నా కళ్లకు కట్టినట్లుగా కనబడుతుంది.
నిండు కోర్టులో ఉగ్ర నరసింహ స్వామిలా జడ్జిగారు....వెక్కిళ్లు పెడ్తూ నేను.
ఆ నరకం తొందరగానే ముగిసింది. అది టెంపరరీ జాబ్ కనుక. అయితే ఆ దృశ్యం అలాగే నిలిచిపోయింది, నేను నా జీవితంలో ఎంతో తీవ్రంగా ద్వేషించే దృశ్యంగా.
ఆ తర్వాత మరికొన్ని టెంపరరీ జాబులు-కోర్టుల్లోనే.
1960లో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజీ ద్వారా నాకు ఇంటర్వ్యూ వచ్చి భారతీయ పురాతత్వ శాఖలో స్టెనో గ్రాఫర్‌గా పర్మనెంట్ ఉద్యోగం దొరికింది. అదీ గుంటూరులోనే.
జీవితం మరో మలుపు తిరిగింది. మరో ప్రయోగం మొదలైంది.
ఇన్నేళ్లు గడిచినా, ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులొచ్చి ఉంటే ఎంత బాగుడేంది కదా అనిపిస్తుంది !

-ఎజి కృష్ణమూర్తి

No comments:

Post a Comment