కొన్నికొన్ని పరిశోధనలు ఎవరి ఆలోచనల్లో మెదిలినవో తెలీకుండానే ప్రపంచానికి సరికొత్త అధ్యాయానికి తెర తీస్తాయి. అటువంటి వాటిల్లో ‘కాఫీ’ ఒకటి. పొద్దున లేస్తూనే ఘుమఘుమలాడే ‘కాఫీ’ పరిమళాలను ఆస్వాదించని వ్యక్తి లోకంలోనే ఉండరు. కానీ ‘కాఫీ’ సిప్‌ని మొట్టమొదటిసారిగా ఎవరు చేసి ఉంటారు అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. కొన్ని వేల ఏళ్ల క్రితం - అబిస్సినియన్ జాతుల వారికి ‘బెర్రీ’ గింజలు లభ్యమయ్యాయి. ఇవి చూట్టానికి అలానే ఉండటంవల్ల వాటికి ఆ పేరు వచ్చింది. రుచిగా.. మనసుకి హాయినిచ్చేదిగా.. పరిమళ భరితంగా ఉన్న ఈ గింజలను ఆయా తెగలు తింటూండేవారు. అప్పటికి కాఫీ అన్న పదం పుట్టలేదు. అలా తూర్పు ఆఫ్రికన్లు మొట్టమొదటిసారిగా ఆ గింజలను ‘టేస్ట్’ చేశారు. క్రీ.శ.15వ శతాబ్దం నాటికి ఆ రుచి దక్షిణ అరేబియా వరకూ పాకింది. ఇప్పుడు మనం ‘రుచి’ చూస్తున్న కాఫీ గింజలు 200 ఏళ్ల నాటివే. వీటిని యెమెన్‌లో పెంచారు. క్రీ.శ.19వ శతాబ్దంలో జావాలో డచ్ వారు ఈ పంటను పెంచ నారంభించారు. అక్కడ్నుంచీ జమైకా ద్వీప సముదాయాల్లోనూ.. మధ్య.. దక్షిణ అమెరికాలకు పాకింది. యూరోప్‌లోనూ.. అమెరికాలోనూ ‘కాఫీ’ జీవితంలో ఒక భాగమైంది. నేడు ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యే కాఫీ పంటలో 3/4 వంతు బ్రెజిల్‌దే. ఎందుకంటే - ఇక్కడ కాఫీ పంటకు అనుకూల వాతావరణం ఉంది. ఇక వెనిజులా, కొలంబియా, గుటిమాలా, మెక్సికో, వెస్టిండీస్, జావా తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాయి. నేడు ‘కాఫీ’లో బోలెడన్ని వెరైటీలు. వాటిలో ‘మోకా’ ‘జావా’ ‘రియో’ ‘సాంటోస్’ ప్రసిద్ధి గాంచాయి.
No comments:
Post a Comment