Pages

Sunday, October 3, 2010

కలల ప్రపంచంలోకి... సరికొత్త ఆలోచనకు స్ఫూర్తి


పారిస్ పట్టణ ప్రజలకు ‘పాల్ కౌడమీ’ అంటే బోలెడంత ఇష్టం. ఇతగాడి ఆలోచన ఉంటే చాలు - ఎంచక్కా కలల ప్రపంచంలోకి దొర్లిపోవచ్చన్నది జనం మాట. హాయిగా నిద్రపోతూ ఈ లోకానే్న మర్చిపోవచ్చునంటార్ట. కొంపతీసి - ఇతగాడు ‘హిప్నటైజ్’ చేసో.. జోలపాట పాడో నిద్రపుచ్చుతాడా? అంటే అవేవీ కాదు. మీ బెడ్‌రూంని అందంగా డిజైన్ చేస్తాడు. మీ మనస్తత్వానికి తగ్గట్టు. పారిస్‌లో పావువంతు ఇళ్లు ఇతను డిజైన్ చేసినవే. తన ‘ఆర్ట్’తో జనాన్ని నిద్రపుచ్చటం ఇతనికి జోలపాటతో వచ్చింది. ఆఫీసులనూ పడగ్గదులనూ.. హాల్స్‌నూ - విభిన్న తరహాలో డిజైన్ చేసి జనాన్ని మెప్పించటమే కాదు.. పాత గుహల్లోకి సైతం తీసికెళ్లగలడు. బెడ్‌రూంని ‘ఎలుగుబంటి గుహ’గా మార్చేయగలడు. ఉరికే జలపాతం బెడ్‌రూంని తడిపేయనూ వచ్చు. అందంగా అమరిన ‘కీ బోర్డ్’ కాస్తంత తడిసి కరిగి గోడల నుంచీ జాలువారనూ వచ్చు. లేదా మరొకటి మరొకటి... మీ ఆలోచన ఏమిటో చెప్పండి. దానికి తగ్గట్టు ఉన్నది ఉన్నట్టుగా క్షణాల్లో మార్చివేస్తాడు. దీనికి అంత ఖర్చూ ఉండదు. భవన నిర్మాణంలో మిగిలిపోయిన రాళ్ల ముక్కలూ.. చిప్స్.. విరిగిన టైల్స్.. ఏవైనా కావొచ్చు. వాటిని భద్రంగా మీరు ఇంటికి తెచ్చుకోగలిగితే చాలు. ఇక మీ పనై పోయినట్టే.





ఓ రోజు ఖాళీగా కూర్చుని ఆలోచిస్తూంటే - బెడ్‌రూంలో ఓ మూలగా ‘కలర్’ అంటి ఉండటం గమనించాడు. తుడిపేద్దామని ప్రయత్నించాడు. పోలేదు. దాంతో ఆ గోడపై మరిన్ని ‘కలర్’ మరకలు వేశాడు. ‘మరక మంచిదే’ అన్న కానె్సప్ట్‌కి తగ్గట్టు తయారైందా గది. రోజులూ వారాలూ గడిచాయి. బెడ్‌రూమంతా రంగుల కలగా మారిపోయింది. ఇదేదో బాగుందే?! అనుకొని అప్పట్నుంచీ ‘గ్రాఫిక్ డిజైన్స్’ చేయటం మొదలుపెట్టాడు. అలా అలా అది పారిస్ అంతా పాకింది. ఇంటీరియర్ డిజైన్లకు పాల్ పెట్టింది పేరైంది. ఇదే బాటలో స్వీడిష్ గ్రాఫిక్ డిజైనర్ లిసా బెంగ్‌ట్సాన్ కూడా బెడ్‌రూంని ఫొటో ఫ్రేమ్‌లతో నింపేశాడు. అవన్నీ జ్ఞాపకాల పొరలు. ఏళ్ల తరబడి ఆల్బమ్‌లలో శిథిలమై పోతున్న జ్ఞాపకాలు అలా గోడలపై వేలాడటం సరికొత్త ఆలోచనకు స్ఫూర్తిని అందించింది.

-హేమ


No comments:

Post a Comment