Pages

Friday, July 8, 2011

అనంతాయనమః





 కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ప్రాచీన అనంత పద్మనాభ స్వామి ఆలయం కొద్ది రోజులుగా ప్రపంచం దృష్టిని అకర్షిస్తున్నది. లక్షకోట్లకు పైగా విలువైన సంపద ఆ ఆలయం నుంచి బయటపడడం అందుకు కారణం. శ్రీమహావిష్ణువు యోగనిద్రామూర్తిగా దర్శనం ఇచ్చే అనంతపద్మనాభస్వామి ఆలయం అనంత సంపదకే కాదు, అపురూప శిల్పకళకూ నిలయం. సంపదలో తిరుమల వేంకటపతిని మించిపోయిన అనంతపద్మనాభుని విశేషాలు.

శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి సాధారణంగా మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగనిద్రామూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో స్వామి యోగనిద్రా మూర్తిగా కనిపిస్తారు. స్వామి క్షేత్రాల్లో విశిష్టమైనదిగా భావించే తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. తమిళ ఆళ్వారుల ప్రబంధాల్లో ఈ ఆలయం ప్రస్తానవ కనిపిస్తుంది. ట్రావన్‌కోర్ రాజుల ఇలవేల్పుగా స్వామి పూజలందుకున్నారు. మార్తాండవర్మ రాజ్యాధికారంలో ఉన్న సమయంలో ఈ ఆలయం వైభవ నలుదిశలా వ్యాపించింది. 8వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని ట్రావన్‌కోర్ రాజు మార్తాండవర్మకాలంలో పునరుద్ధరించారు.

ఆ రూపం..దివ్యతేజం
పద్మనాభ అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కలవాడని అర్థం. మహావిష్ణు అవతారమైన అనంతపద్మనాభ స్వామి దివ్యమంగళ రూపం నయనానందకరంగా ఉంటుంది. స్వామి యోగనిద్రామూర్తిగా శయనించి ఉండగా, ఆయన నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై ఉంటాడు. శేషుని మీద శయనించి ఉన్న శ్రీమహావిష్ణువు చేతి కింద శివలింగం కూడా ఉంటుంది. ఇలా ఈ ఆలయం త్రిమూర్తులకు నిలయంగా భాసిల్లుతున్నది. గర్భగుడిలో మూలవిరాట్టు వెనుక, కుడి, ఎడమ గోడల మీద అపురూపమైన దేవతామూర్తుల చిత్రాలు ఉంటాయి. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీమహావిష్ణువు ఉత్సవ మూర్తుల విగ్రహాల్ని కూడా దర్శించుకోవచ్చు.

ఆదిశేషుని మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుని 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి దర్శించుకోవాలి. మొదటి ద్వారం నుంచి స్వామి తల ఛాతీ మాత్రమే కనిపిస్తుంది. రెండవ ద్వారం నుంచి చేతులు, నడుము భాగం కనిపిస్తుంది. మూడవ ద్వారం నుంచి స్వామి పాదాలు దర్శించుకోవచ్చు. పదివేల ఎనిమిది సాలగ్రామాలతో రూపుదిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆలయంలో నరసింహ, అయ్యప్ప, గణపతి, శ్రీకృష్ణ, హనుమ, విష్వక్సేన, గరుడ ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. కేరళలోని దాదాపు అన్ని ఆలయాల్లో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
శిల్పకళా వైభవం
శ్రీఅనంతపద్మనాభ స్వామి ఆలయం, రాజగోపురం అపురూప శిల్పకళలకు నిలయం. శిల్పాలు, పంచలోహాలు, చెక్కలో అందంగా మలచిన దేవతామూర్తులు ఈ ఆలయంలో దర్శనం ఇస్తాయి. ద్రావిడ శైలి శిల్పకళా చాతుర్యం ఆలయంలో అణువణువునా కనిపిస్తుంది. గర్భగుడితో పాటు వంద అడుగుల ఎతైన గాలిగోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి. ఆలయం ముందు పద్మతీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్థంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆయల ప్రాంగణంలో ఉన్న బలిపీఠ మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి. ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తు శిల్పాలను అందంగా చెక్కడం విశేషం. శిల్పుల కళా ప్రతిభ అంతా ఇక్కడ పోతపోసుకుందా అనిపిస్తుంది.

అనంత నిధి
ఈ ఆలయంలోని గత వారంలో కళ్లుచెదిరే రీతిలో నిధి నిక్షేపాలు కనుగొన్నారు. ఈ నిధి విలువ లక్షకోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. వీటి విలువ 5 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని మరో అంచనా. ఆలయంలోని నేలమాళిగలో ఉన్న ఆరు గదుల్లో ఈ అపార సంపద బయటపడింది. వజ్రవైఢూర్యాలు, పచ్చలు, స్వర్ణఆభరణాలు, బంగారు దేవతామూర్తుల విగ్రహాలు బయటపడ్డాయి. 30 కిలోల బంగారంతో తయారు చేసిన 12 అంగుళాల శ్రీమహావిష్ణువు విగ్రహం ఈ నిధిలో లభ్యమైంది. ఈ విగ్రహానికి వందకు పైగా వజ్రవైఢూర్యాలను పొదిగారు.

సర్వాగ సుందరంగా ఉన్న ఈ విగ్రహం విలువే 500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇంతే అందంగా ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం కూడా లభ్యమైంది. 18 అడుగుల బంగారు జడ, బంగారు తాడు, బంగారు కొబ్బరి చిప్పలు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో జారీ చేసినవిగా భావిస్తున్న బంగారు నాణాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన దేవతా మూర్తుల ఆభరణాలు ఆలయంలోని రహస్య గదుల్లో లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు ఐదు గదుల తలుపులు తెరిచారు. మరో గది తలుపులు తెరవడంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈ గది తలుపు మీద నాగబంధం ఉండడం, గతంలో ఈ తలుపు తెరిచేందుకు ప్రయత్నించినప్పుడు విపత్తులు సంభవించాయనే ప్రచారంతో ఏం చేయాలనే అంశంపై అధికారులు మీమాంసలో ఉన్నారు.
దర్శనం...ఉత్తమం
1750 ప్రాంతంలో ట్రావన్‌కోర్‌ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్‌కోర్ రాజులకు అనంతపద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. ప్రస్తుతం ఆలయం నుంచి అపార సంపద బయటపడినా, అది ట్రావన్‌కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజవంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంతపద్మనాభునికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిరద్శనం. ఈ విధంగా ట్రావన్‌కోర్ రాజులు అనంతపద్మనాభుడిని సర్వస్వంగా భావించి, ఆరాధించారు. మార్తాండవర్మ కాలంలోనే ఆలయానికి అపార సంపద సమకూరి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ అనంతపద్మనాభుని ఆలయాన్ని దర్శించి.. తరిద్దాం.

ప్రస్తుతం ఆలయం నుంచి అపార సంపద బయటపడినా, అది ట్రావన్‌కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజవంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభునికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిరద్శనం.

No comments:

Post a Comment