Pages

Thursday, December 16, 2010

సంకల్పంతోనే కళాక్షేత్రాలు

  '' నీకు ఎలుక బోను తయారు చేయటం వచ్చా ? అయితే అందులో నిష్ణాతుడిగా మారి, నీ పనితనం చూపించు. అందరి కన్నా మెరుగైన ఎలుకల బోను తయారు చేయి.. అందరూ వాటి కోసం నీ ఇంటి ముందు బారులు తీరుతారు''   ఎమర్సన్ చెప్పిన మాటలవి.
అక్షర సత్యాలు.. విజేతలు కావాలనుకునే ప్రతి ఒక్కరూ పాటించవలసిన ప్రాథమిక సూత్రం ఆచరించవలసిన పద్ధతి. ప్రపంచంలోని ఏ విజేత అయినా తను ఎంచుకున్న రంగంలో నిష్ణాతుడిగా మారి, విజయాలను తన హస్తగతం చేసుకోన్నాడు. ముందుగా బలమైన, దీర్ఘకాలిక కలలు, గమ్యాలను ఏర్పరచుకోవటం.. వీటి గురించి గత 15 వారాలుగా మనం ముచ్చటించుకుంటూ వస్తున్నాం. ఎంతో మంది విజేతలను కలుసుకున్నాం. వారి జీవిత విశేషాల గురించి తెలుసుకున్నాం. ఈ మహానుభావులందరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులై, కొత్త వరవడులను సృష్టించిన వారే.

కర్సన్ భాయ్ పటేల్ కొత్త తరహాకు చెందిన డిటర్జెంట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టి, ఆ రంగంలో ఎన్నో మార్పులను తేగా, ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ స్థాయిలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి, కలలకు, గమ్యాలకు అర్హతలు ఎల్లలు లేవని నిరూపించాడు. ఆనాటి ఒరవడికి ఎదురీది లేక ఏదో ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగాన్ని వదులుకుని ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాంది పలికారు.

ఇలా ఎందరో... అందరూ ఎంచుకున్న రంగాల్లో అపారమైన కృషి చేసి నిష్ణాతులుగా మారి వారి వారి కలలను సాకారం చేసుకున్న వారే. అటువంటి మరి కొందరి జీవితగాధలను ఈ వారం నుంచి ముచ్చటించుకుందాం. వీరి జీవిత గాధలు మనకిచ్చే సందేశం ఒక్కటే. ఎంచుకొన్న రంగంలో నిష్ణాతులుగా మారటం. ఏదో ఒక నైపుణ్యం, కొంతైనా చాకచక్యం.. వాటిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చునేమో గాని, భగవంతుడు మనుషులందరికి ప్రసాదించాడన్నది మాత్రం నిజం. మనిషి చేయవలసిందల్లా ఒక్కటే. తనను తాను విశ్లేషించుకోవాలి. తనలోని సామర్థ్యాన్ని గుర్తించాలి. దాన్ని సానబెట్టి, పదునుపెట్టాలి.

అందరూ ఒకే రకమైన పనుల్లో నిష్ణాతులు కావాలన్న నియమం లేదు. ఒకరు అప్పడాలను అత్యుత్తమంగా తయారు చేయటంలో ప్రతిభ కనబరిస్తే, మరొకరు శూన్యంలోంచి సిరుల వర్షం కురిపించవచ్చు. ఎవ రి ప్రతిభ వారిది. ఆ ప్రతిభను గుర్తించాల్సిన బాధ్యత మాత్రం మనది. ఇంకా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. చేస్తున్న పని ఏదైనా, ఎంత గొప్పగా చేస్తున్నామన్నదే ముఖ్యం.

నిజానికి ఈ ప్రపంచంలోని సర్వసుఖాలు, గౌరవ మర్యాదలు, అన్ని విజేతలకే కదా. ఆ విజేతలు తమ తమ రంగాల్లో నిష్ణాతులుగా మారటం వల్లే కదా.. ఆ విజయాలన్ని... సచిన్ టెండూల్కర్ నుంచి మన బాలు దాకా. అందరూ తమ తమ రంగాల్లో ఆరితేరిన వారు, ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకున్నవారు. గతంలో చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. ఆడటం ముఖ్యం కాదు, ఆడిన ఆటలో విజేతలుగా మారటం ముఖ్యం. 'విన్నర్ టేక్స్ ఆల్' అన్నది ఎంతో నిజం. విజేతే అన్నింటినీ కైవసం చేసుకుంటాడు. కనుకే ఆడటమే కాదు. ఆ ఆటలో గెలవటం ముఖ్యం.

ఏ పందెంలోనైనా గెలిచిన వారు గుర్తుంటారు మనకు. ఓడిన వారు కాదు కదా! పదండి చెన్నైకి ప్రయాణం చేద్దాం. గజ్జల సవ్వడి వినబడటం లేదూ! అదుగో చూడండి.. నట్టువాంగాలతో, మృందగ నాదాలతో రాగ తాళభరితమైన భరత నాట్య వేదికకు తెరలేస్తూంది. ఆ వేదిక మీద ఆవిడ దర్శనమిస్తారు మనకు. భారత దేశానికి ప్రతీకగా, అంతర్జాతీయ వేదికలపై భరతనాట్యాన్ని నిలిపిన ఆ మహిళా మూర్తి మనకి మార్గదర్శిలా స్ఫూర్తినిస్తారు. రుక్మిణీ దేవి అరండేల్ గురించి నేను చెబుతున్నది.

ఇప్పుడు భరతనాట్యమంటున్నామే.. దాని సృష్టికర్త రుక్మిణీ దేవే. 1930 దశకంలో భరత నాట్య శైలికి ఆమె ఊపిరి పోశారు. తన మానస పుత్రికను మనోహరంగా తీర్చిదిద్దారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రుక్మిణీ దేవి తన తండ్రి ద్వారా దివ్యజ్ఞాన సమాజంలో ప్రవేశించారు. అక్కడే తన భావి జీవిత భాగస్వామిని కలుసుకొన్నారు. ఆయనే డాక్టర్ అరండేల్ రుక్మిణీ దేవి కళారాధనకూ, కళా సాధనకూ అండగా నిలిచిన వ్యక్తి. నృత్యం వైపు ఆమె ఆకర్షితురాలు కావటానికి దోహదం చేసిన వారు మాత్రం ప్రముఖ నాట్యవేత్త అన్నా పావ్లోవా. రుక్మిణీ అరండేల్ దంపతులు బొంబాయి నుంచి ఆస్ట్రేలియాకు నౌకలో వె ళ్తున్నప్పుడు అదృష్టవశాత్తు వారికి అన్నా పావ్లోవాతో పరిచయం అయింది.

ఆ సందర్భంలో భారతీయ నృత్యరీతులపై దృష్టి సారించి, నిర్లక్ష్యానికి గురైన సత్సంప్రదాయాలకు పునర్‌వైభవాన్ని తీసుకురావాల్సిందిగా రుక్మిణీ దేవిని అన్నా పావ్లోవా కోరారు. ఆ సలహా ఆమెకు ఎంతో నచ్చింది. ఆ రంగం వైపు దృష్టి సారించేలా చేసింది. ఒకరోజు రుక్మిణీ దేవి అరండేల్ 'సాధిర్' అనే దేవదాసీలు చేసే నృత్యాన్ని చూశారు. ఆ రోజుల్లో దేవదాసీ నృత్యాలను తక్కువ స్థాయికిచెందిన వినోద ప్రదర్శనలుగా సమాజంలోని ఉన్నత వర్గాల వారు భావించేవారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రుక్మిణీ దేవి మాత్రం అలా భావించలేదు. పైగా ఆ నృత్యం ఆమెకో లక్ష్యాన్ని ప్రసాదించింది. సలక్షమైన మార్గానికి రూపకల్పన చేసే దిశగా పురికొల్పింది.

శ్రీ శంకర్ మీనన్ మాటల్లో చెప్పాలంటే "దేవదాసీల నృత్యంలోని అభ్యంతరకరమైన అంశాన్ని తొలగిస్తే దానికొక ఉదాత్తమైన, కళాత్మకమైన శైలిగా రూపొందించే వీలుంది. రుక్మిణీ దేవి ఆ సంకల్పంతోనే తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తమ కులం నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాల్ని , విమర్శల్నీ ఆవిడ పట్టించుకోలేదు. దేవదాసీల నృత్యాన్ని త్రికరణ శుద్ధిగా అభ్యసించేందుకు అడుగు ముందుకు వేశారామే. కానీ మార్గం చాలా కఠినమైనదన్న విషయం వెంటనే తోచింది. ఎందుకంటే 'సాధిర్'నృత్యం అంతగా ప్రాచుర్యం పొందిన నృత్యశైలి కాదు. పైగా గురువు దొరకటం చాలా కష్టం. అప్పట్లో పేరు ప్రఖ్యాతులున్న నాట్య గురువులందర్నీ ఆవిడ కలుసుకొన్నారు. 'సాధిర్' నృత్యం నేర్పించమని వేడుకున్నారు. తిరస్కారాలే ఎదురయ్యాయి. నిరుత్సాహపడలేదామె. అసలు నాట్యం వైపు తాను ఆకర్షితురాలయ్యేందుకు కారకుడైన పండనల్లూర్ మీనాక్షీ సుందరం పిళ్లైని ఎలాగైతేనేం రుక్మిణీ దేవి ఒప్పించగలిగారు. ఆయన ఆ రంగంలో గొప్ప నిష్ణాతుడు.

పిళ్లై కఠోర సాధనకు మారుపేరు. ఉదయం ఏడు గంటలకు గజ్జెలు కడితే మధ్యలో ఓ గంట భోజన విరామం మినహాయించి సాయంత్రం ఏడు గంటల వరకు సాధన చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో రుక్మిణీ దేవి పగలంతా చేసిన సాధన పట్ల సంతృప్తి చెందని పిళ్లై ఆమె చేత రాత్రివేళ కూడా నాట్య సాధన చేయించేవారు. దాన్ని రుక్మిణీ దేవి శిక్షగా కాకుండా శిక్షణలో భాగంగా ఆనందంగా స్వీకరించేవారు. నాట్యమే సర్వస్వంగా భావించి, నిరంతర సాధనతో తన కలల్ని నిజం చేసుకోవాలని భావించిన రుక్మిణీ దే వి అరండేల్ అరంగేంట్రం సిద్దమయ్యారు. అప్పుడు ఆవిడ వయస్సు 34 సంవత్సరాలు. సాధారణంగా వయస్సు ఇరవై దాటక ముందే అందరూ అరంగేట్రం చేస్తారు. ఈ వయసులో ఆవిడ ఏం నాట్యం చేస్తుందిలే ? అన్న సంశయం లోలోపల గూడు కట్టుకున్నా సమాజంలో పేరు ప్రతిష్టలున్న అరండేల్ మీదున్న గౌరవం కొద్ది చెన్నైలోని పెద్దలు నాట్య ప్రదర్శనకు విచ్చేశారు.

రుక్మిణీ దేవి అరండేల్ జీవితంలో తొలి నాట్య ప్రదర్శనకు తెరలేచింది.. నాట్యం మొదలైన దగ్గర్నుంచి చివరి దాకా అందరూ ఆశ్యర్యచకితులయ్యారు. దేవదాసీల నృత్యాల్లోని అభ్యంతరకర అంశాల్ని తొలగించి, దైవదత్తమైన ఉదాత్త హావాభావాలకు ఆమె పెద్దపీట వేశారంటూ విమర్శకులు పొగిడారు. "ఈ క్షణం నుంచి దీని పేరు భరత నాట్యం'' అంటూ ఇ కృష్ణ నామకరణం చేశారు. ఓ మహోదాత్తమైన నృత్యకళ ప్రాణం పోసుకుంది. తొలి ప్రదర్శనకు అపూర్వమైన ఆదరణ లభించినా, తన ప్రస్థానం అప్పుడే మొదలైందని, గమ్యం ఎంతో దూరమని రుక్మిణీ దేవి గ్రహించారు.

తన లక్ష్యసాధనకై 'కళా క్షేత్ర'ను నెలకొల్పారామె. కానీ అందులోకి విద్యార్ధినీ, విద్యార్ధులను రప్పించటం కష్టమైపోయింది. కారణం.. పరువు ప్రతిష్టలున్న కుటుంబాల వారికి నృత్యం నేర్చుకోవటం నామోషీగా అనిపించటమే ! రుక్మిణీ దేవి నిరుత్సాహపడలేదు. తన కల సాకారమయ్యేందుకు అవిరామంగా శ్రమించారు. భరత నాట్యంలోని ప్రత్యేకతలను గురించి వ్యక్తులకు వివరించారు.

చివరకు కళా క్షేత్ర కళకళలాడింది. ఒకప్పుడు అత్యంత చౌకబారుగా ముద్రపడిన నాట్యశైలి. ఉదాత్తమైన అథ్యాత్మిక భావప్రకటనగా ఆమోదం పొందింది. ఇదంతా రుక్మిణీ దేవి అరండేల్ ధృడస్పంకల్పం, కృషి వల్లనే సాధ్యమైంది. పరిస్థితులకు ఎదురీది మూఢభావాలను నిర్మూలించి అపురూపమైన కళా ప్రక్రియను అత్యున్నత శిఖరాలపై నిలబెట్టి ప్రపంచాన్ని తన దారికి రప్పించిన ఘనత రుక్మిణీ దేవి అరండేల్‌దే.

కలలకి, నిష్ణాతులకి అసాధ్యాలంటూ ఏమీ ఉండవని మరోసారి నిరూపించారు రుక్మిణీ దేవి అరండేల్. 
- ఎజి కృష్ణమూర్తి

No comments:

Post a Comment