Pages

Thursday, December 16, 2010

అతడు డబ్బును జయించాడు

నేటి ప్రపంచంలో అత్యధిక సంపన్నుడు, పేరు ప్రతిష్ఠలున్న బిల్‌గేట్స్ గురించిన ముచ్చట్లు గతవారం ప్రారంభించాం. పదండి ముందుకు.. ఈ మహాశక్తి వివరాలను విజయాలను మరికొన్ని తెలుసుకుని స్ఫూర్తిని, ఆనందాన్ని సొంతం చేసుకుందాం. ఓ కంప్యూటర్ సంస్థ ప్రకటనకు జవాబుగా చీకట్లో ఒక రాయి విసిరారు బిల్‌గేట్స్, ఆయన మిత్రుడు పాల్ అలెన్. అది సరిగ్గా తగలాల్సిన చోటే తగిలింది. వారి ప్రయత్నానికి సానుకూల స్పందన లభించటం ఆ సంస్థ నుంచి పిలుపు రావటం జరిగింది. మిత్ర ద్వయం రెండు రోజులు నిర్విరామంగా ఆ కంప్యూటర్‌తో కుస్తీపట్టి విజయం సాధించారు.దీంతో వారి విజయ ప్రస్థానం మొదలైంది.

మైక్రోసాఫ్ట్ అవతరణకు దారితీసింది. తాను సాధించిన ప్రతి విజయాన్ని మరోమెట్టుగా వేసుకుంటూ పెద్దపెద్ద విజయాలపై దృష్టి సారించాడు బిల్‌గేట్స్. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగు పరుచుకుంటూ ఎంతగానో తాను ప్రేమించి అభిమానించే రంగంలో మరెంతగానో కృషి చేసాడు. పెనుమార్పులు సాధించాడు. చివరకు బిల్‌గేట్స్ పేరు సాఫ్ట్‌వేర్‌కి పర్యాయపదమైంది. తనదైన రంగం మీద పట్టు బిగించి, సంపూర్ణ ఆధిక్యాన్ని, ఆధిపత్యాన్ని సాధించటానికి సర్వోత్తమ ఉదాహరణ బిల్‌గేట్స్. నిజానికి మనమెవరైనా సరే ఒక రంగంలో నిష్ణాతుడై కొన్ని విజయాలను చవిచూశాక అనంతంగా కృషి చేస్తూ పోవటమే మనముందున్న ఏకైక మార్గం.

కొంచెం బద్దకించామా మనవెనకున్న వ్యక్తి ముందుకు దూసుకుపోతాడు. మనం ఓటమితో నిరాశా నిస్పృహలకు లొంగిపోతాం. విజయం పులి మీద స్వారీ లాంటిది. ఒకసారి పులి స్వారీ మొదలయ్యాక మధ్యలో దిగలేం. దిగితే పులి మనను స్వాహా చేసేస్తుంది. పులి స్వారీ సాగుతూనే ఉండాలి. అయితే అందులోఉన్న ఆనందం, గౌరవం, గుర్తింపు వేరెక్కడా లభించవు. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టమన్నారు. స్వారీ చేయదలిస్తే ఏ కుక్కనో, నక్కనో కాక పులిని స్వారీ చేయాలి. అలాగే మనకిష్టమైన రంగంలో అవిరామంగా కృషి చేసి నిష్ణాతుడిగి రూపాంతరం చెంది సదా విజయపతాకం ఎగురవేసే కంటే జీవితంలో మరే ఆనందముంటుంది. విజయం కన్నా విలువైన ప్రాణవాయువు ఇంకేదైనా ఉందా ఈ లోకంలో..

విజేతల ముఖాలు ఎలా ఆనందంతో, ఆరోగ్యంతో తొణికిసలాడుతుంటాయో గమనించారో ! వారి నడక, వారి బాడీ లాంగ్వేజి, వారి మాట ఈ సారి పరీక్షగా గమనించండి. వారు ఓ ప్రత్యేక జాతికి చెందిన వారుగా, ప్రజ్వలిస్తున్న చైతన్యంతో ఎంతో హాయిగా ఆనందంగా చిరంజీవులుగా గోచరిస్తారు. అంతేకాదు విజేతలు వారు కోరుకున్న జీవితాలను జీవిస్తారు. ఇంతకన్నా ఏ జీవికి మాత్రం ఏం కావాల్సి ఉంటుంది ? కలల కన్నా జీవితాన్ని జీవిచటమే మనందరికి జీవిత గమ్యం కదా ! ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా మారి అనునిత్యం కృషితో మందంజ వేస్తూ ఉంటేనే ఈ ఆనందమయమైన జీవితం సాధ్యమయ్యేది. బిల్‌గేట్స్ ఈ కోవకి చెందిన వ్యక్తుల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్నాడు.

ఆయన కృషి వల్ల సాఫ్ట్‌వేర్ పరిశ్రమ బలంగా వేళ్లూనుంది. ఆయన ఆలోచనల వెంట ప్రపంచం అడుగులు వేసింది. ఒక గేట్స్ విధానాన్ని అనుసరిస్తూ ఒక మహాధ్యాయానికి ప్రపంచం తెరతీసింది. 1995లో 'ద రోడ్ ఎహెడ్' అనే పుస్తకంలో బిల్‌గేట్స్ రాసిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయి. మీరు మీ కుర్చీలోనే కూర్చొని ఉంటారు. మీ డెస్క్‌ని అంటిపెట్టుకొనే ఉంటారు. అక్కడ నుంచే మీరు పగ్గాలు ధరించి మీ వ్యాపారాన్ని నడిపిస్తారు. ఆ స్థానంలో కూర్చోనే ప్రపంచాన్ని అధ్యయనం చేస్తారు. సంస్కృతుల్ని గమనిస్తారు. వినోదం మీ ముందే ఉంటుంది. స్నేహితులు ఏర్పడతారు. పొరుగు మార్కెట్లతో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారు. ఎక్కడో దూరంగా ఉన్న మీ బంధువులకు మీ ఫోటోల్ని చూపిస్తారు. వీటన్నింటినీ మీరు చల్ల కడుపులో చల్ల కదలకుండా చేసే రోజు ఎంతో దూరం లేదు. అది (కంప్యూటర్) ఒక పరికరం లాగా కాకుండా మీ నిత్యావసారాల్లో భాగమైపోతుంది. మీ వినూత్న జీవిత విధానానికి పాస్‌పోర్టులాగా వినియోగపడుతుంది.

ఆనాడు కేవలం 15 ఏళ్ల క్రితం బిల్‌గేట్స్ కన్నకలల్లో నేడు మీరు, నేను నివసిస్తున్నాం. ఆయన రాసిన మాటల్లో ఒక్క మాట పొల్లుపోలేదు. అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్న తపన, అంకితభావాల వెనక ప్రతిఫలించే ప్రగాఢమైన శక్తి బిల్‌గేట్స్‌ని ఒక మిషనరీగా, భవిష్యత్తును చూడగలిగే అసాధారణ జ్ఞానిగా నిలబెట్టింది. కేవలం తన జీవితాన్ని మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండేవారి జీవితాన్ని సైతం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడింది. నిజానికి బిల్, అలెన్‌లు కంప్యూటర్ రంగంలో ప్రవేశించినపుడు అందులో చెప్పుకోదగ్గ సంఖ్యలో పోటీదారులు లేరు. ఆ విషయాన్ని మిత్రులు నిర్లక్ష్యం చేయలేదు. ధైర్యంగా ఉండిపోలేదు. ప్రతిభకు పదును పెట్టారు. సరికొత్త ప్రయోగంతో వినూత్న ఉత్పాదనలతో ముందుకెళ్లారు. ఎవరికీ అందనంత ముందుకి...

విజయ మార్గంలో పయనమంటూ మొదలయ్యాక అది పులి స్వారీ లాంటిదని బిల్, అలెన్‌లకు తెలుసు. అందుకే అప్రతిహతితంగా వారి విజయ పరంపర కొనసాగుతూనే ఉంది నేటి దాకా. అందువల్ల ప్రపంచానికి ఎలాంటి మేలు జరిగిందో చూడండి. కంప్యూటర్ లేకుండా క్షణకాలం కూడా ఊహించలేని ప్రపంచంలో జీవిస్తున్నాం మనం. నేడు కంప్యూటర్ ఒక యంత్రం కాదు. అది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనకు జవసత్వాలనిచ్చే టానిక్.

అవునా.. కాదా ?! ఇంత గొప్ప జీవిత సౌలభ్యాన్ని ఆవిష్కరణ చేసిన బిల్‌గేట్స్ ఎంత సంపాదించి ఉంటాడు ? ఊహించండి ...! ప్రపంచంలోని అందరికన్నా ఎక్కువ ధనవంతుడంత ! ఆయన సంపద దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైనే. మూడు లక్షల కోట్ల పైచిలుకు!! ఆయన వయస్సెంతో తెలుసా ? కేవలం 54. ఇంతటి సంపదను ఏం చేస్తున్నాడో అనే ఊహరాక మానదు మనకు. సింహభాగం దానధర్మాలకు.. అదీ ప్రపంచవ్యాప్తంగా..ఆయన సతీమణి మెలిండా గేట్స్ పేరున స్థాపించిన ట్రస్టు ద్వారా 10 బిలియన్ డాలర్లు ..అంటే 45 వేల కోట్ల రూపాయలను కొత్త వ్యాక్సిన్సు కనుగొనటానికై విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారు. ఈ వ్యాక్సిన్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా సామాన్యంగా బీద, బడుగు వర్గాలను పీడించే అంటురోగాలను నియంత్రించేందుకై.

అంతేకాదు తన సంపదనంతా మనందరం యధావిధిగా మన వారసులకు ఇచ్చేలా కాకుండా లోక కళ్యాణం కోసం వెచ్చిస్తానన్నాడు బిల్ గేట్స్. ఎంతటి మహోన్నత వ్యక్తి కదా బిల్ గేట్స్. ఈ విషయాన్నే ఇటీవల మన దేశంలోని లక్షల కోట్లకు పడగలెత్తిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రస్తావించి..మీరు బిల్ గేట్స్ లాగా ఎందుకు మీ సంపదలో కొంతైనా మన దేశ కళ్యాణానికి వినియోగించరని ఒక జర్నలిస్టు అడిగితే, ఆయన సమాధానం.

"అమెరికాలో పన్నులు జాస్తి. వాటిని తప్పించుకోవటానికి అక్కడి వారు అలా చేస్తుంటారని జవాబిచ్చారు!! ఎంతటి సంపదా మనకే చాలకపోతే, తోటివారి గురించి మనమెందుకు ఆలోచిస్తారా ?? బిల్‌గేట్స్ లాంటి వ్యక్తులు రోజు మనకు తారసపడరు. వారి జీవితం మనకు స్ఫూర్తిని, ఏదైనా సాధించాలనే తపనని, దైర్యాన్ని కలిగించి ఆపై మన సంపదలో కొంతైనా ఆర్తుల సహాయానికై వినియోగపడేలా చేస్తే.. జయహో.. ''
- ఎజి కృష్ణమూర్తి

No comments:

Post a Comment