Pages

Saturday, September 25, 2010

పొడుపు ప్రశ్నలు

సర్దుకుపోయే మనిషి

నీకు నిజాలు తెలుసుకునే హక్కు కావాలా? అబద్ధాలు వినే శక్తి కావాలా?
అబద్ధాలు తెలుసుకునే హక్కు, నిజాలు వినే శక్తి ఇచ్చినా పర్వాలేదు.

లెక్కమంతుడు

ఎన్ని అబద్ధాలు కలిస్తే ఒక నిజం అవుతుంది?
రెండు అబద్ధాలు పోట్లాడుకుంటే ఒక నిజం అవుతుంది.


భాష్యకారుడు

స్వార్థానికి మంచి అర్థం ఎప్పుడొస్తుంది?
అర్థం అంటే డబ్బు ఒక్కటే కాదని తెలిసినప్పుడు.

సూక్ష్మగ్రాహి

మూడు పూవులు ఆరు కాయలని ఎందుకు అంటారు?
ఆడవాళ్లు జనాభాలో సగమే కదా!

దయార్ద హృదయుడు

మనిషి మెదడును ప్రింటర్‌కు కనెక్ట్ చేస్తే ఏమవుతుంది?
పాపం! నల్లటి కాగితాలు ఎన్నని చదువుతారు అందరూ.

యదార్థవాది

మంచివాళ్లు ఉండబట్టే వర్షాలు ఇంకా పడుతున్నాయని, పంటలు ఇంకా పండుతున్నాయని ఎందుకంటారు? వాళ్ల అవసరాలు అంత ఎక్కువా?
ఎక్కువ వానలు కురిసి ఎక్కువ పంటలు పండకపోతే మిగతావాళ్లు వాళ్ల కడుపు మాడ్చి చంపేయరూ.

Tuesday, September 7, 2010

8 - 9 - 10 వెయ్యేళ్లకోసారి * ఇది బుధవారమే ప్రత్యేకత!

 8.. 9.. 10.. ఇదేంటీ..!? వరుసగా అంకెలు లెక్కబెడుతున్నారు అనుకుంటున్నారా!? అదేం కాదు. నేటి బుధవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇదో అరుదైన రోజు. ఈరోజు తారీఖు 8. ఈనెల సెప్టెంబర్ అంటే, 9. ఈ ఏడాది 2010, అంటే 10. ఈరోజు ఎవరు సంతకాలు చేసి తేదీ వేయాల్సి వచ్చినా వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది వేయాల్సిందే! ఈ అంకెలు ఇలా వరుసగా రావడం వెయ్యి సంవత్సరాలకు ఓసారి వస్తుంది.

ఇక, ఈ తేదీల కలయిక చాలా మంచిదని సంఖ్యా శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఎందుకంటారా.. ఈ మూడింటినీ కలిపితే 27. ఆ రెండు అంకెలనూ కలిపితే 9. ఇది అందరికీ మంచి సంఖ్యేనని వారు వివరిస్తున్నారు. అందరికీ కలిసొచ్చే ఈ సంఖ్య వల్ల ఈ రోజంతా శుభమే కలుగుతుందని చెబుతున్నారు.  

Monday, September 6, 2010

వర్మగారొక మర్మయోగి

(సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. 'రక్తచరిత్ర' నేపథ్యంలో ఓబుల్‌రెడ్డి అనుచరులు తనని బెదిరించారన్న వర్మ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమా పాటలో తెలుగు దర్శకులందరినీ విమర్శించి హాట్‌టాపిక్ అయ్యారు. మరి ఆయన గురించి నటుడు ఎవిఎస్ తన బ్లాగ్‌లో ఏం రాసుకున్నారో చదవండి)

రామ్‌గోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం. నిస్సందేహంగా గొప్ప దర్శకుడు. తెలుగు వాళ్లు గర్వించదగ్గ జాతీయ స్థాయి పర్సనాలిటీ. తెలుగు సినిమాలకో ట్రెండ్ నేర్పిన సంచలన సాంకేతిక నిపుణుడు. ఆయనలోని దర్శకుడి ప్రతిభా పాటవాలకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్... గ్లామర్... నిరీక్షణ.. ఇది అందరికీ సాధ్యం కాని పని.

కాని ఇటీవలి కాలంలో వర్మలోని దర్శకుడిని బిజినెస్‌మాన్ డామినేట్ చేస్తున్నాడు. సినిమాను ఎలా అమ్ముకోవాలి.. ఎలా బయ్యర్లను ఆకట్టుకోవాలి... రిలీజుకు ముందే సినిమాను ఎలా సెన్సేషన్ చేసుకోవాలి.. అన్న వాటి మీదనే వర్మ గారి దృష్టి యావత్తూ ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వినిపిస్తున్న విమర్శ. ఇంతకుముందు వర్మ సినిమాలు రిలీజుకు ముందు నిశ్శబ్దంగా ఉండి రిలీజు తరువాత సంచలనాలను సృష్టించేవి.

ప్రస్తుతం రిలీజుకు ముందు సంచలనాలు సృష్టించి రిలీజు తరువాత నిశ్శబ్దంగా ఉంటున్నాయి. ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక వివాదం. అవి నిజమే అయినా తరచూ జరుగుతుండటం వల్ల చూసేవాళ్లకు.. వినేవాళ్లకు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక గొప్ప దర్శకుడి సినిమాలకు ఈ తరహా వివాదాలు అవసరమా? అన్న ప్రశ్న నాలాంటి చాలామంది అభిమానులను బాధకు గురిచేస్తోంది. తమ సినిమాలను బిజినెస్ చేసుకోవటం ఎవరికైనా అవసరమే.. కాదనలేము. కాని రాంగోపాల్ వర్మ లాంటి అత్యున్నత దర్శకుడికి ఆ అవసరం లేదన్నది నా అభిప్రాయం.

పోనీ అంతే మేరకు ఆయన సినిమాలు విజయాలను పొందుతున్నాయా? అంటే అదీ లేదు. వర్మ గారి లెక్కలు ఏమిటో తెలుసుకోవాలంటే ఆ మర్మం ఏమిటో అర్థం చేసుకోవాలంటే అందరివల్లా కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. వర్మ గారిని అర్థం చేసుకోవడంలో నేను ఫెయిలయ్యానని ఎవరయినా భావిస్తే నేను చేయగలిగిందేమీ లేదు.
- ఎవిఎస్, ఉ. 9.32, సెప్టెంబర్ 3, 2010

Sunday, September 5, 2010

సేమియా బచ్చలి బొండా

కావలసిన పదార్థాలు
సేమియా - ఒక కప్పు, శనగపిండి - ఒక కప్పు, గోధుమ పిండి - ఒక కప్పు, మినుములు - ఒక కప్పు, క్యారెట్‌లు - రెండు, బచ్చలి ఆకులు(సన్నగా తరిగినవి) - ఒక కప్పు, ఉల్లిపాయలు - మూడు, పచ్చి మిరపకాయలు - మూడు, కొత్తిమీర- ఒక కట్ట, కరివేపాకు - మూడు రెబ్బలు, వంటసోడా - చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేయు విధానం
సేమియాను ఒక గంట పాటు నానబెట్టిన తరువాత నీళ్లు వంపేసి పెట్టుకోవాలి. మినుములను కూడా ఒకగంట ముందుగా నానబెట్టి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్‌లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఈ పదార్థాలన్నింటినీ వేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి.

కొత్తిమరీ, కరివేపాకు, వంటసొడా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక పాత్రలో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. పిండిని బొండాల మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే..సేమియా బచ్చలి బొండాలు రెడీ.
- కె. మంజుల, తిరుపతి.

Thursday, August 26, 2010

వారు నా కంటే అందగత్తెలు - జయసుధ

ఇంక ఈర్ష్య, పోటీ ఎందుకు?
ఏఎన్నార్‌తోనే సౌలభ్యంగా ఉండేది
జగన్ వెంటే ఉంటా.. జీసస్‌ను చూశా...
-    జయసుధ
సినీ వినీలాకాశంలో ఆమె సహజనటి... ఇప్పు డు రాజకీయాల్లోకి వచ్చాక ఆ స్థాయిలో నటించలేకపోతున్నానని చెబుతున్నారు. ఇక్కడ అంతకంటే సహజ నటులున్నారని అంటున్నారు. తాను ఏదీ ప్రణాళిక ప్రకారం చేయలేదని, నటిగా అయినా, ఇప్పుడు ఎమ్మెల్యేగా మారినా అన్నీ అనుకోకుండా జరిగినవేనని పేర్కొన్నారు. తనకు టెన్నిస్ ఆడాలనే కోరిక మాత్రం ఇప్పటి దాకా తీరలేదంటున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నటి జయసుధ ...


సినీ, రాజకీయ జీవితాల మధ్య తేడా ఎలా ఉంది?
రాజకీయాల్లో ఇంకా ఇమడలేదు. ప్రతి రోజూ ఏదో ఒక విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. కొన్ని రాజకీయ చిత్రాల్లో చూసినప్పుడు నిజంగా అలా ఉంటుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదా పు అలాగే ఉంది. అంత మెలో డ్రామా కాకపోయినా దాదాపు 75% అలాగే ఉంది. సినిమాల్లో నటించేంత తేలిక కాదంటే... రాజకీయాలను అలా మార్చేశా రు. మన చేతిలో ఏమీ లేదు. త ప్పు మనది కాకపోయినా మన ల్నే అడుగుతారు. అయితే, ప్రజ లు ఎన్నుకున్నందున వాటిని ఎ దుర్కొనేందుకు సిద్ధపడాల్సిందే.


క్రైస్తవ మతం ఎందుకు తీసుకున్నారు?
1985లో బ్యాంకాక్‌లో ప్రమాదానికి గురైనప్పుడు జీసస్‌ను తలచుకున్నాను. అప్పటి నుంచి అలా నమ్మకం ఏర్పడింది. ఏసును అప్పుడు నేను చూశాను. ఏసుక్రీస్తుతో మనసులో మాట్లాడుతూనే ఉంటాను. 2001లో మతం పుచ్చుకున్నాను.


రాజకీయాల్లో మీకంటే సహజ నటులు తారసపడి ఉంటారు?
అబ్బో చాలామంది ఉన్నారండీ. చాలా సన్నివేశాల్లో నేను అవాక్కయిపోయాను కూడా. మన దగ్గర ఒకలా మాట్లాడి, వేరే చోట ఇంకోలా మాట్లాడటం... ఇది రాజకీయ సాంప్రదాయం అనుకోవాల్సిందే. మంత్రిగా అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పలేదు. ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతే రాజీనామా చేస్తానని చెప్పాను. అది పత్రికల్లో మరోలా వచ్చింది.


ఎమ్మెల్యేగా కాకుండా జయసుధగా గడచిన పది నెలల పరిణామాలు ఎలా అనిపిస్తున్నాయి?
మొదటి నుంచి చూస్తున్నారు కదా.. జగన్‌కు మేం మద్దతు పలకడం. ఇప్పుడు కూడా దాంట్లో మార్పు లేదు. జయసుధగా ఉండటం ముఖ్యం.. రాజకీయాలు కాదు. వైఎస్ తీసుకొస్తేనే వచ్చాను. పార్టీ నుంచి జగన్ వెళ్లిపోతే ఆయనతోనే ఉంటాను.


జయప్రదతో మీ పోటీ ఎలా ఉండేది?
జయప్రద, శ్రీదేవిలా అందంగా ఉండాలని కోరుకోలేదు. కథ చెప్పేటప్పుడు మాత్రం ఇద్దరు హీరోయిన్లుంటే నా క్యారెక్టర్ చనిపోవాలని పట్టుబట్టే దాన్ని. అందరం స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. నాకంటే వాళ్లు అందంగా ఉంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈర్ష్య? పద్మశ్రీ అవార్డు సైఫ్ అలీఖాన్‌కు ఇచ్చారు కదా... నేను ఇప్పుడు ప్రయత్నించవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందనిపించుకోవడం ఇష్టం లేదు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లలో ఎవరితో సౌలభ్యంగా ఉండేది?

నాగేశ్వరరావు గారితోనే. ఆయన చాలా సరదాగా ఉంటారు. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. రామారావు గారి దగ్గరకొచ్చే సరికి అంతా భయపెట్టేసేవారు. అలాంటిది ఆయనకు క్రికెట్ పిచ్చి పట్టించాను. మన హీరోలతో ఎప్పుడు ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇక్కడి హీరోలు చాలా మంచివారు. కమల్, నన్ను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు. ఎక్కువ చిత్రాల్లో చేశాం. ఆ తర్వాత అంతా వదిలేశారు. రాజకీయాల కోసం సినిమాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. క్రీడలంటే నాకు ఇష్టం. నేను కోరుకోకుండానే చాలా జరిగాయి. టెన్నిస్ ఆడాలని ఉంది. కానీ, ఇప్పుడది కుదరదేమో..?!


మూడు దశాబ్దాలు తెలుగు రాకుం డా ఎలా రాణించగలిగారు?
నేర్పించడానికి ప్రయత్నించారు గానీ, రాలేదు. ఆ రోజుల్లో టీవీలు లేకపోవడంతో బతికిపోయాను. లేకపోతే నా గురించి చాలా తెలిసిపోయేది. డైలాగులు విని చెప్పడం అలవాటైపోయిందంతే... జ్యోతి చిత్రం తర్వాత వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. సినిమాల్లో కూడా ముందు నాకు ఆసక్తి లేదు. మంచి పాత్రలు రావడం నా అదృష్టం. రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది.

Wednesday, August 25, 2010

ఒకటే జననం... ఒకటే మరణం - జయహో.. విజయగాధలు: పద్ధతులు - 1

అసాధ్యాలంటూ ఏమీ ఉండవేమో, స్ఫూర్తితో కొన్ని పద్ధతులను అవలంబిస్తే...

*** మనసుంటే మార్గముంటుంది; పర్‌ఫెక్ట్ చదువు, పర్‌ఫెక్ట్ ఉద్యోగం అవసరం లేదని నిరూపించాడు నోబెల్ బహుమతి విజేత సర్ సి.వి.రామన్

*** కలలకు గమ్యాలకు ఉన్న శక్తి సామర్థ్యాలేమిటో ప్రపంచానికి చాటిచెప్పిన మరో విశిష్ట భారతీయుడు; మన దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా దారి మళ్ళించిన విజేత - ఎం.ఎస్.స్వామినాథన్.

*** విల్మా రుడాల్ఫ్
అమెరికన్ వనిత. నల్లజాతికి చెందినది.
1940లో పుట్టిన ఆమెకు సంవత్సరం తిరిగేలోగా పోలియో సోకింది.
డాక్టర్లు ఇక ఆమె నడవలేదని తేల్చి చెప్పారు.
ఇరవై ఏళ్ళ తర్వాత 1960లో జరిగిన ఒలంపిక్స్‌లో విల్మా రుడాల్ఫ్ మూడు గోల్డ్ మెడల్సు గెలుచుకుంది. వాటిలో రెండు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి.
ఇది కల కాదు.
కథ కాదు
యాభై ఏళ్ళ క్రితం జరిగిన చరిత్రలోని ఒక పుట.
ఇది చదివాక అసాధ్యాలు అంటూ ఏవైనా ఉంటాయని మీరింకా భావిస్తూ ఉంటే, తీరిగ్గా కూర్చొని పునరాలోచన చేయండి

*** నేనెవర్ని?
నాలో దాగి ఉన్న ప్రజ్ఞ ఏమిటి?
ఏ పనిలో నేను నిష్ణాతుణ్ణి??
ఏ పని నన్ను ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది??
స్వశక్తిపై నమ్మకాన్ని, ఎన్నుకొన్న రంగంలో అపారమైన కృషి చేసి, నిష్ణాతుడిగా మారి దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు గడించిన కర్సన్‌బాయ్ పటేల్ సృష్టి 'నిర్మా' వాషింగ్ పౌడర్. ఆయన జీవిత గాథ, విజయాలు మనందరినీ ఉత్తేజపరిచేవే!
మనందరికీ మార్గదర్శకాలే!

*** ఈ విజేతలందరూ సామాన్యులే
ప్రేరణే వారి బలం. పద్ధతులు వారి ఆయుధాలు

*** రే క్రాక్
వయస్సు: 52
అమెరికన్
డయాబిటీస్ ఉంది.
ఆ్రర్దయిటిస్ కూడా ఉంది
గాల్ బ్లేడర్ తీసేసారు.
థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం కూడా తీసేసారు.
"అయినప్పటికి నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది''.
రే క్రాక్ అన్నమాటలివి.
అన్నమాటలే కాదు. చేసి నిరూపించాడు తనకీ, యావత్ ప్రపంచానికి.
నేటి మెక్‌డొనాల్డ్స్ సంస్థ నిర్మాణంలో మూలస్థంభం లాంటి వ్యక్తి ఈ రేక్రాక్ మహాశయుడే.
ఈ ప్రస్థానం మొదలైంది ఆయన 52వ ఏట. రకరకాల ఆరోగ్య సమస్యల వలయంలో ఉన్నప్పటికీ రే క్రాక్ తన గమ్యాలను వీడలేదు. అనుకున్నది సాధించాడు.

*** ఇలా ఎన్నో గాథలు. అన్నీ స్ఫూర్తినిచ్చేవే. మనల్ని కార్మోన్ముఖులుగా మార్చేవే.
రాబోయే వారాల్లో వీరి గురించి, ఇంకా పలువురి గురించి వివరంగా ముచ్చటించుకుందాం.
విజయానికి మార్గాలేవో మనమూ కనుగొందాం!
ఈ నా రచనకి మూలకారణమైన ప్రస్థానానికి నాంది పలికిన రోజు నాకింకా ఎంతో స్పష్టంగా గుర్తుంది.
31 అక్టోబర్ 1968
ఆ రోజు రాత్రి చేతిలో ఒక పాత ఇనప్పెట్టె, అందులో రెండు మూడు జతల బట్టలు, జేబులో నూట యాభై రూపాయలు, గుండెల్లో భయం, మనస్సులో వేయి కోరికలతో హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌లో రాత్రి 7.55కి బయల్దేరాల్సిన బాంబే ఎక్స్‌ప్రెస్‌లో ఒక థర్డ్‌క్లాస్ డబ్బా ఎక్కాను. అన్నీ తెలియని ముఖాలు. ఊహకందని భవిష్యత్తు.
29 నవంబరు 2009న తిరిగి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ నివాస మేర్పరచుకోవటానికని.
నలభై ఒక్క సంవత్సరాలు.
ఆ పైన ఇరవై ఎనిమిది రోజులు.
జీవితంలోని ముఖ్య భాగమంతా అహ్మదాబాద్‌లోనే గడచిపోయింది.
నేను అహ్మదాబాద్‌లో అడుగు పెట్టినప్పటి పరిస్థితులకి, తిరిగి హైదరాబాద్ రావటానికి వీడ్కోలు చెప్పిన నాటికి ఒక గొప్ప తేడా ఉంది.
ఆనాడు, తమ ప్రకటనల కోసం గుజరాత్‌లోని పలు వ్యాపార సంస్థలు బాంబేలోని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలకు ఆ బాధ్యతలను అప్పచెప్పుతుండే వారు.
1980 దశకంలో అది పూర్తిగా ఆగిపోయింది. అహ్మదాబాదులోని ముద్రా స్థాపనతో.
1990 దశకానికల్లా దేశంలోని నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా అడ్వర్‌టైజింగ్ రంగంలో ఉన్నత విద్య నభ్యసించటానికి విద్యార్థులు అహ్మదాబాద్‌కి రావటం మొదలుపెట్టారు. మైకా స్థాపనతో (మైకా: ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాదు) నేడు ఇది అంతర్జాతీయంగా పేరుపొందిన విద్యా సంస్థ.
ఎలా జరిగాయి ఈ అద్భుతాలన్నీ..
-ఎజి కృష్ణమూర్తి

ఇష్టం కనిపెట్టడమే కష్టం... జయహో.. విజయగాధలు: పద్ధతులు-2

ఇష్టమైన పనిని మనందరం కష్టపడి చేస్తాం అని మనందరికి తెలుసు.
ఆ ఇష్టమైన పనేదో మనకెప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది ??
కొంతమందికి తల్లిదండ్రులు స్ఫూర్తినిచ్చి, వారి వృత్తే పిల్లలకు ఇష్టమైన వృత్తిగా మారేలా చూస్తారు. మనలో చాలా మందికి రోల్ మోడల్స్ మన తల్లిదండ్రులే కదా.
కొంతమంది దురదృష్టవంతులకి ఇది వర్తించకపోవచ్చు. తల్లిదండ్రులు నేరస్తులయితేనో, లంచగొండులయితేనో..
పైన ఉదహరించుకొన్న కోవకి చెందిన వారు - డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు తదితరులు.
వీరికి వంశపారపర్యంగా వస్తున్న కుటుంబ వృత్తి వ్యాపారాలు ఆదర్శప్రాయంగా, ఆచరణీయంగా మారి, ఎంచుకున్న వృత్తి ఇష్టపడే వృత్తి ఒకటిగానే ఉండిపోతాయి. వీరికి ఏ చిక్కూ లేదు.
తండ్రిదో ఉద్యోగం, పిల్లలవి వేరువేరు...
మా నాన్న గారు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. మా అన్నయ్యా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోనే. చిన్నతనంలోనే మా అన్నయ్యకి నాన్న గారి వృత్తి మీద అభిమానంవల్లో లేక మా నాన్న గారి ప్రోద్భలంవల్లో ఆ రంగంలో చదువుకొని ఉద్యోగస్తుడయ్యాడు. ఆ రంగంలోనే రిటైర్ అయ్యాడు. తనకు ఆ రంగమంటే అసహ్యమని మా అన్నయ్య చెప్పగా నేనెన్నడూ వినలేదు.

ఇక నా విషయానికొస్తే, నా కిష్టమైన రంగమేంటో తెల్సుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా ప్రయోగాలు చేశాను. విద్యార్థిగా కనీసం ఇంజనీరింగ్ చదువుకోవాలనే గాఢమైన కోరికుండేది. కనీసం అని ఎందుకన్నానంటే, అసలైన కల డాక్టర్ కావాలని. నిజానికి ఆ రోజుల్లో అంతే 1950 దశకం నుంచి 1990 దశకం దాకా ప్రతి వాడికి డాక్టరో, ఇంజనీరో కావాలనే కోరిక తప్ప మరేది ఉండేది కాదేమో. నేటిలాగా పలు రంగాలు అభివృద్ధి చెందలేదు. పరిమితమైన జీవితాలు - ఇంకా పరిమితమైన చదువులు. ఇంకా ఇంకా పరిమితమైన అవకాశాలు. ఈ అవకాశాలు అదృష్టవంతులకు మాత్రమే లభ్యమవుతాయన్న ఒక బలమైన నమ్మకం కేవలం నాకే కాదు, ఆ నాటి సమాజంలో గాఢంగా పాతుకుపోయిందేమోననిపిస్తుంది.

"పెట్టి పుట్టాలి''
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా''
ఇలాంటి సామెతలు తరచుగా వింటుండే వాణ్ణి. ముఖ్యంగా మా అమ్మ ద్వారా.
బీదరికం
తరతరాలుగా వస్తున్న బీదరికం కాదు.
"మా నాన్న గారు పుట్టినపుడు 1901లో వారిది గుంటూరు జిల్లాలోనే ఒక సంపన్న కుటుంబం''.
'బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్' అంటామే - వాడికేమయ్యా, ఆగర్భ శ్రీమంతుడనో లేక నోట్లో బంగారు చెంచాతో పుట్టాడయ్యా అనో అంటామే - ఆ కోవకి చెందిన వారు మా నాన్న గారు.

పురిట్లోనే తల్లిని కోల్పోయారు మా నాన్నగారు. కొన్నేళ్ల తర్వాత భోగభాగ్యాలు కూడా, ఎందుకయ్యా అంటే, మా తాత గారు ఆనాటి సమాజంలోని పదుగురిలా అబద్దం చెప్పని సీదాసాదా వ్యాపారస్థుడు. పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారం. లక్షల్లో స్టాక్ కొని గిడ్డంగుల్లో నింపారు. సడన్‌గా రేట్లు పడిపొయ్యాయి. బాకీలు పెరిగాయి. కోర్టు కేసులు. ఒక్క అబద్దం చెబితే యావదాస్థి నిలిచేది. ఊహు.. ఆ మహానుభావుడు నిజం చెప్పాడు కోర్టులో యావదాస్థి తనదేనని.. తనది కాదు, తమ్ముడిదని చెప్పుంటే ఆస్తి జప్తు జరిగేది కాదు.
మాటే ప్రాణంగా భావిస్తున్న రోజులవి. విలువలకి సర్వం కోల్పోవటానికవి సిద్దమయిన రోజులవి.

మా తాత గారు అబద్దం చెప్పలేదు. ఆస్థి నిలువలేదు.
మా నాన్న గారి నోట్లోని బంగారు చెంచా సడన్‌గా సత్తు
చెంచాగా మారిపోయింది.
జీవన పోరాటం మొదలైంది. చిన్న ఉద్యోగం.
ఆనాటి అందరి లాగే పెద్ద కుటుంబం. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. నాది రెండో నంబరు.
పుట్టింది వినుకొండలోనైనా నా చిన్ననాటి జ్ఞాపకాలన్ని తెనాలి, బాపట్ల లోనివే. తెనాలిలోని మారీస్ పేటలో ఉండేవాళ్ళం. పూరింట్లోని ఒక భాగం అద్దెకు తీసుకుని అందులో ఉండేవాళ్లం.
మిగతా అమ్మల సంగతి నాకు తెలీదు కాని, మా అమ్మ అంత మంచి అమ్మ, కష్టపడే అమ్మ వేరెవ్వరూ ఏ లోకంలోనూ ఉండరు.

ఐదుగురు పిల్లలు... వీరు బతికిన సంతానం. పోయిన వారు కాని తెల్సినంత వరకు మరో ఇద్దరు. అందరి కన్నా పెద్దదైన అక్క, అందరి కన్నా చిన్నదైన చెల్లెలు.
ఇంట్లో బీదరికం.
ఎడంపక్కన మేడ. చౌదరి గారు ఉంటుండేవారు. ఆ రోజుల్లో మేడ ఉందంటే భాగ్యవంతుడి కింద లెక్కే కదా.
కుడి పక్కన డాబా ఇల్లు. అందులో రోజు నాకు దర్శనమిస్తూ, నా ఈర్ష్యకు గురైన ఒక మధ్య వయస్కుడు.
ఆరేడు ఏళ్లు ఉంటాయామో నాకు అప్పుడు.
రోజు ఉదయం స్కూలుకి వెళ్లేటపుడు ఈ పెద్ద మనిషి ఎంచక్కా ఒక పడక కుర్చీలో హాయిగా పడుకుని, చేతిలో పేపరు, పక్కన టేబులు మీద పాడుతున్న రేడియోతో దర్శనమిచ్చేవాడు.

ఇవన్నీ మాకు లేవు.
డాబా లేదు.
రేడియో లేదు.
పూరిల్లు, కరెంటు లేదు.
ఆహా ఈయన గారిది ఏమి అదృష్టమనుకుంటూ రోజూ ఈర్ష్యకు గురయ్యేవాడిని. నేను ఏనాటి కైనా ఈ పెద్ద మనిషిలాగా ఓ మిద్దె, ఓ రేడియో ఒక పడక్కుర్చీ పొంది, హాయిగా జీవించాలనేకునేవాణ్ణి.
దానికి మరి పెట్టి పుట్టాలి కదా.

అదృష్టముండాలి కదా.
కష్టేఫలి సూత్రం వినే వయస్సు లేదు. దాన్ని నమ్మి ఆచరించే వయస్సు అంతకన్నా కాదు.
ఈ నమ్మకం - అదృష్టమే.. జీవితంలోని ప్రతి మంచికి, సుఖానికి మూల కారణమనే నమ్మకం - 1968 నవంబర్ 2న అహ్మదాబాద్ చేరిన తర్వాత పదేళ్లలో పూర్తిగా మరుగున పడిపోయింది.
1968 లో గీరా బెన్ శరభాయ్‌ను కలిసాను.
1976లో ధీరూభాయ్ అంబానీనీ కలిసాను.

1968 నుంచి 1971 దాకా కష్టపడి పనిచేసి గీరా బెన్ నమ్మకాన్ని, అభిమానాన్ని పొంది 1972 లో అహ్మదాబాద్‌లో స్థాపించబడిన శిల్పీ అడ్వర్‌టైజింగ్‌లోకి మార్చబడ్డాను.
1972 నుంచి నేటి దాకా ఈ అడ్వర్‌టైజింగ్ రంగంతో తెగని బంధం నాది. ఈ రంగమే నాకు కూడు, గుడ్డ, ఇల్లు వాకిలీ, మొబైల్ అన్నీ సమకూర్చింది. ఎంతో ప్రియమైన రంగం నాకిది.
ఇన్నేళ్ల తర్వాత కూడా అంటే. 38 ఏళ్ల తర్వాత కూడా ఏదన్నా, మంచి యాడ్ సృష్టిలో భాగం పంచుకుంటే ఆనాడు పండగే.
ఎన్ని గంటలైనా పనిచేయగలను, నేటికి కూడా అలసిపోకుండా.

దీన్నే ఇష్టమైన పని కష్టం కాదనటం అంటే.
అయితే నా విషయంలో ఈ పనే నా కిష్టమైనదని 1972లో కాని తెలియలేదు. అంటే నా ముప్పయ్యో ఏట.
ఈ లోగా ఎన్ని ప్రయోగాలో, కూటి కోసం కోటి విద్యలంటారే.. అలాగా...
అయితే ఏదో ఒక రోజున మన కిష్టమైన పనేదో మనం గ్రహిస్తేనే, జీవితంలో ముందంజ..దానికో సార్థకత లభించేది...


-ఎజి కృష్ణమూర్తి