Pages

Friday, December 17, 2010

ఎ.జి.కె యాడ్‌ గైడ్

అడ్వర్‌టైజ్‌మెంట్ ఏం చేయాలి..? కంపెనీ బ్రాండ్‌ను పెంచాలి. ఉత్పత్తులు వేగంగా అమ్ముడుపోయేలా చేయాలి. ఈ రెండు పనులు చేయలేదంటే ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ ఫెయిల్ అయినట్లే కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రస్తుతం వస్తున్న ప్రకటనల్లో 85 శాతం ఫలితాలను ఇవ్వడం లేదు. కంపెనీలు కోట్లు కుమ్మరించి తీస్తున్న ప్రకటనలు వృథా అవుతున్నాయి. ఈ రంగాన్ని ఆషామాషీగా తీసుకుని పనిచేస్తున్న వాళ్లు ఎక్కువవ్వడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఇన్స్యూరెన్స్ కంపెనీలలాగే అడ్వర్‌టైజింగ్ రంగం కూడా అంతటి సీరియస్ వృత్తి. ఇందులో పనిచేసేవాళ్లు తాము అందరికంటే సృజనాత్మకశీలురమని భ్రమిస్తుంటారు. ప్రజల అభిరుచులు ఎలా మారిపోతున్నాయి..? ఏం కోరుకుంటున్నారు..? ఎవరి కొనుగోలు శక్తి ఎంత..? అనే విషయాలే పట్టడం లేదు ప్రకటనల రూపకర్తలకు.

వాగ్దానం+నాణ్యత

ఒక్కోసారి కొన్ని అడ్వర్‌టైజ్‌మెంట్లు అసలుకే మోసం తెస్తాయి. కోకాకోలా కంపెనీ ఉత్పత్తిలో అదే జరిగింది. కోక్‌నే కొంచెం మార్చి 'న్యూ కోక్' అనే కొత్తరకం పానీయాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించారు. అయినా సరే, ఆ ఉత్పత్తి ఘోరంగా విఫలమైంది. మళ్లీ పాత కోక్‌నే ఉత్పత్తి చేయక తప్పలేదు. ప్రకటనలలో ఇచ్చే వాగ్దానానికి, నాణ్యతకు పొంతన కుదరకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. మన దేశంలో ప్రకటనల రంగం విలువ రూ.22 వేల కోట్లు.

దీనిలో ఎలక్ట్రానిక్ మీడియా వాటా 55 శాతంకాగా ప్రింట్ మీడియా 40 శాతం ఔట్‌డోర్ 3, రేడియో, ఇంటర్‌నెట్ కలిపి ఒక శాతం ఉంది. భవిష్యత్తులో మొబైల్ ప్రకటనలు కూడా పెరిగే అవకాశం ఉంది. మహారాష్ట్ర, ముంబయి, ఢిల్లీ, చెన్నైలలో ఈ రంగం ఎందుకు దూసుకెళుతోందంటే.. అక్కడ ఉత్పత్తిదారులు ఎక్కువమంది ఉన్నారు. మన రాష్ట్రంలో సేవలు మినహా, ఉత్పత్తి తక్కువ. అందుకే మన దగ్గర ప్రకటనల రంగం అభివృద్ధి కావడం లేదు. అయితే గ్రామాలు, ఓ మోస్తరు పట్టణాల్లో కూడా వస్తువినియోగం వేగవంతమవుతోంది. వినియోగదారుని మనస్తత్వం కూడా మారిపోతోంది.

కాని దీనికి తగ్గట్టు అడ్వర్‌టైజ్‌మెంట్లు మారడం లేదు. విమల్, రస్నా, నిర్మా కంపెనీల ప్రకటనలు గుర్తుండిపోయినట్లు.. ఇప్పుడొస్తున్న ప్రకటనలు గుర్తుండటం లేదు. బ్రాండ్ అస్తిత్వాన్ని నిలబెట్టే ప్రకటనలు కూడా రావడం లేదు. ప్రజలను సమ్మోహితులను చేసి.. వినియోగదారులుగా మార్చగలిగే శక్తి కొన్ని ప్రకటనలకే ఉంది. నిజానికి ఇప్పుడు అన్ని ఉత్పత్తులలో నాణ్యత పెరిగింది. దానికి తోడు పోటీ ఎక్కువైంది. ఇలాంటి సమయంలో ప్రకటనలే కీలకపాత్ర పోషిస్తాయి. వినియోగదారుని మనసులోకి పరకాయప్రవేశం చేస్తేనే ప్రభావశీలమైన ప్రకటనలను తయారుచేయగలరు.

ఈ పుస్తకంలో..

మన దేశంలో ప్రకటనల రంగం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడలేకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అందులో ఒకటి అనుభవజ్ఞుల పుస్తకాలు లేకపోవడం. ఈ కొరతను తీర్చేందుకే 'లర్నింగ్స్ ఆఫ్ యాన్ అడ్వర్‌టైజింగ్ ప్రాక్టీషనర్' పుస్తకం రాశాను. ఈ రంగంలో నాకున్న 30 ఏళ్ల అనుభవాలను ఈ పుస్తకంలో విశ్లేషించాను. కంపెనీ బ్రాండ్లకు ఎలా పేరు తేవాలి? వినియోగదారులు ఏం కోరుకుంటున్నారు? ఉత్పత్తులను ఎంతవరకు ప్రజెంట్ చేయవచ్చు? ప్రకటనలరూపకర్తల ఆలోచనలకు ఎలాంటి హద్దులుండాలి? అనే విషయాలతోపాటు సుమారు ప్రకటనలరంగం మీద 20 అధ్యాయాలుగా విశ్లేషణలున్నాయి. ఈ పుస్తకం శనివారం హైదరాబాద్‌లోని క్రాస్‌వర్డ్ బుక్‌స్టోర్‌లో ఆవిష్కరించనున్నాం.

జూ ఆది మల్లెంపూటి

Thursday, December 16, 2010

అతడు డబ్బును జయించాడు

నేటి ప్రపంచంలో అత్యధిక సంపన్నుడు, పేరు ప్రతిష్ఠలున్న బిల్‌గేట్స్ గురించిన ముచ్చట్లు గతవారం ప్రారంభించాం. పదండి ముందుకు.. ఈ మహాశక్తి వివరాలను విజయాలను మరికొన్ని తెలుసుకుని స్ఫూర్తిని, ఆనందాన్ని సొంతం చేసుకుందాం. ఓ కంప్యూటర్ సంస్థ ప్రకటనకు జవాబుగా చీకట్లో ఒక రాయి విసిరారు బిల్‌గేట్స్, ఆయన మిత్రుడు పాల్ అలెన్. అది సరిగ్గా తగలాల్సిన చోటే తగిలింది. వారి ప్రయత్నానికి సానుకూల స్పందన లభించటం ఆ సంస్థ నుంచి పిలుపు రావటం జరిగింది. మిత్ర ద్వయం రెండు రోజులు నిర్విరామంగా ఆ కంప్యూటర్‌తో కుస్తీపట్టి విజయం సాధించారు.దీంతో వారి విజయ ప్రస్థానం మొదలైంది.

మైక్రోసాఫ్ట్ అవతరణకు దారితీసింది. తాను సాధించిన ప్రతి విజయాన్ని మరోమెట్టుగా వేసుకుంటూ పెద్దపెద్ద విజయాలపై దృష్టి సారించాడు బిల్‌గేట్స్. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగు పరుచుకుంటూ ఎంతగానో తాను ప్రేమించి అభిమానించే రంగంలో మరెంతగానో కృషి చేసాడు. పెనుమార్పులు సాధించాడు. చివరకు బిల్‌గేట్స్ పేరు సాఫ్ట్‌వేర్‌కి పర్యాయపదమైంది. తనదైన రంగం మీద పట్టు బిగించి, సంపూర్ణ ఆధిక్యాన్ని, ఆధిపత్యాన్ని సాధించటానికి సర్వోత్తమ ఉదాహరణ బిల్‌గేట్స్. నిజానికి మనమెవరైనా సరే ఒక రంగంలో నిష్ణాతుడై కొన్ని విజయాలను చవిచూశాక అనంతంగా కృషి చేస్తూ పోవటమే మనముందున్న ఏకైక మార్గం.

కొంచెం బద్దకించామా మనవెనకున్న వ్యక్తి ముందుకు దూసుకుపోతాడు. మనం ఓటమితో నిరాశా నిస్పృహలకు లొంగిపోతాం. విజయం పులి మీద స్వారీ లాంటిది. ఒకసారి పులి స్వారీ మొదలయ్యాక మధ్యలో దిగలేం. దిగితే పులి మనను స్వాహా చేసేస్తుంది. పులి స్వారీ సాగుతూనే ఉండాలి. అయితే అందులోఉన్న ఆనందం, గౌరవం, గుర్తింపు వేరెక్కడా లభించవు. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టమన్నారు. స్వారీ చేయదలిస్తే ఏ కుక్కనో, నక్కనో కాక పులిని స్వారీ చేయాలి. అలాగే మనకిష్టమైన రంగంలో అవిరామంగా కృషి చేసి నిష్ణాతుడిగి రూపాంతరం చెంది సదా విజయపతాకం ఎగురవేసే కంటే జీవితంలో మరే ఆనందముంటుంది. విజయం కన్నా విలువైన ప్రాణవాయువు ఇంకేదైనా ఉందా ఈ లోకంలో..

విజేతల ముఖాలు ఎలా ఆనందంతో, ఆరోగ్యంతో తొణికిసలాడుతుంటాయో గమనించారో ! వారి నడక, వారి బాడీ లాంగ్వేజి, వారి మాట ఈ సారి పరీక్షగా గమనించండి. వారు ఓ ప్రత్యేక జాతికి చెందిన వారుగా, ప్రజ్వలిస్తున్న చైతన్యంతో ఎంతో హాయిగా ఆనందంగా చిరంజీవులుగా గోచరిస్తారు. అంతేకాదు విజేతలు వారు కోరుకున్న జీవితాలను జీవిస్తారు. ఇంతకన్నా ఏ జీవికి మాత్రం ఏం కావాల్సి ఉంటుంది ? కలల కన్నా జీవితాన్ని జీవిచటమే మనందరికి జీవిత గమ్యం కదా ! ఎంచుకున్న రంగంలో నిష్ణాతులుగా మారి అనునిత్యం కృషితో మందంజ వేస్తూ ఉంటేనే ఈ ఆనందమయమైన జీవితం సాధ్యమయ్యేది. బిల్‌గేట్స్ ఈ కోవకి చెందిన వ్యక్తుల్లో అగ్రతాంబూలం అందిపుచ్చుకున్నాడు.

ఆయన కృషి వల్ల సాఫ్ట్‌వేర్ పరిశ్రమ బలంగా వేళ్లూనుంది. ఆయన ఆలోచనల వెంట ప్రపంచం అడుగులు వేసింది. ఒక గేట్స్ విధానాన్ని అనుసరిస్తూ ఒక మహాధ్యాయానికి ప్రపంచం తెరతీసింది. 1995లో 'ద రోడ్ ఎహెడ్' అనే పుస్తకంలో బిల్‌గేట్స్ రాసిన మాటలు నేడు అక్షర సత్యాలయ్యాయి. మీరు మీ కుర్చీలోనే కూర్చొని ఉంటారు. మీ డెస్క్‌ని అంటిపెట్టుకొనే ఉంటారు. అక్కడ నుంచే మీరు పగ్గాలు ధరించి మీ వ్యాపారాన్ని నడిపిస్తారు. ఆ స్థానంలో కూర్చోనే ప్రపంచాన్ని అధ్యయనం చేస్తారు. సంస్కృతుల్ని గమనిస్తారు. వినోదం మీ ముందే ఉంటుంది. స్నేహితులు ఏర్పడతారు. పొరుగు మార్కెట్లతో వ్యాపార వ్యవహారాలు సాగిస్తారు. ఎక్కడో దూరంగా ఉన్న మీ బంధువులకు మీ ఫోటోల్ని చూపిస్తారు. వీటన్నింటినీ మీరు చల్ల కడుపులో చల్ల కదలకుండా చేసే రోజు ఎంతో దూరం లేదు. అది (కంప్యూటర్) ఒక పరికరం లాగా కాకుండా మీ నిత్యావసారాల్లో భాగమైపోతుంది. మీ వినూత్న జీవిత విధానానికి పాస్‌పోర్టులాగా వినియోగపడుతుంది.

ఆనాడు కేవలం 15 ఏళ్ల క్రితం బిల్‌గేట్స్ కన్నకలల్లో నేడు మీరు, నేను నివసిస్తున్నాం. ఆయన రాసిన మాటల్లో ఒక్క మాట పొల్లుపోలేదు. అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్న తపన, అంకితభావాల వెనక ప్రతిఫలించే ప్రగాఢమైన శక్తి బిల్‌గేట్స్‌ని ఒక మిషనరీగా, భవిష్యత్తును చూడగలిగే అసాధారణ జ్ఞానిగా నిలబెట్టింది. కేవలం తన జీవితాన్ని మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండేవారి జీవితాన్ని సైతం ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు దోహదపడింది. నిజానికి బిల్, అలెన్‌లు కంప్యూటర్ రంగంలో ప్రవేశించినపుడు అందులో చెప్పుకోదగ్గ సంఖ్యలో పోటీదారులు లేరు. ఆ విషయాన్ని మిత్రులు నిర్లక్ష్యం చేయలేదు. ధైర్యంగా ఉండిపోలేదు. ప్రతిభకు పదును పెట్టారు. సరికొత్త ప్రయోగంతో వినూత్న ఉత్పాదనలతో ముందుకెళ్లారు. ఎవరికీ అందనంత ముందుకి...

విజయ మార్గంలో పయనమంటూ మొదలయ్యాక అది పులి స్వారీ లాంటిదని బిల్, అలెన్‌లకు తెలుసు. అందుకే అప్రతిహతితంగా వారి విజయ పరంపర కొనసాగుతూనే ఉంది నేటి దాకా. అందువల్ల ప్రపంచానికి ఎలాంటి మేలు జరిగిందో చూడండి. కంప్యూటర్ లేకుండా క్షణకాలం కూడా ఊహించలేని ప్రపంచంలో జీవిస్తున్నాం మనం. నేడు కంప్యూటర్ ఒక యంత్రం కాదు. అది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మనకు జవసత్వాలనిచ్చే టానిక్.

అవునా.. కాదా ?! ఇంత గొప్ప జీవిత సౌలభ్యాన్ని ఆవిష్కరణ చేసిన బిల్‌గేట్స్ ఎంత సంపాదించి ఉంటాడు ? ఊహించండి ...! ప్రపంచంలోని అందరికన్నా ఎక్కువ ధనవంతుడంత ! ఆయన సంపద దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల పైనే. మూడు లక్షల కోట్ల పైచిలుకు!! ఆయన వయస్సెంతో తెలుసా ? కేవలం 54. ఇంతటి సంపదను ఏం చేస్తున్నాడో అనే ఊహరాక మానదు మనకు. సింహభాగం దానధర్మాలకు.. అదీ ప్రపంచవ్యాప్తంగా..ఆయన సతీమణి మెలిండా గేట్స్ పేరున స్థాపించిన ట్రస్టు ద్వారా 10 బిలియన్ డాలర్లు ..అంటే 45 వేల కోట్ల రూపాయలను కొత్త వ్యాక్సిన్సు కనుగొనటానికై విరాళంగా ఇవ్వడానికి అంగీకరించారు. ఈ వ్యాక్సిన్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా సామాన్యంగా బీద, బడుగు వర్గాలను పీడించే అంటురోగాలను నియంత్రించేందుకై.

అంతేకాదు తన సంపదనంతా మనందరం యధావిధిగా మన వారసులకు ఇచ్చేలా కాకుండా లోక కళ్యాణం కోసం వెచ్చిస్తానన్నాడు బిల్ గేట్స్. ఎంతటి మహోన్నత వ్యక్తి కదా బిల్ గేట్స్. ఈ విషయాన్నే ఇటీవల మన దేశంలోని లక్షల కోట్లకు పడగలెత్తిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రస్తావించి..మీరు బిల్ గేట్స్ లాగా ఎందుకు మీ సంపదలో కొంతైనా మన దేశ కళ్యాణానికి వినియోగించరని ఒక జర్నలిస్టు అడిగితే, ఆయన సమాధానం.

"అమెరికాలో పన్నులు జాస్తి. వాటిని తప్పించుకోవటానికి అక్కడి వారు అలా చేస్తుంటారని జవాబిచ్చారు!! ఎంతటి సంపదా మనకే చాలకపోతే, తోటివారి గురించి మనమెందుకు ఆలోచిస్తారా ?? బిల్‌గేట్స్ లాంటి వ్యక్తులు రోజు మనకు తారసపడరు. వారి జీవితం మనకు స్ఫూర్తిని, ఏదైనా సాధించాలనే తపనని, దైర్యాన్ని కలిగించి ఆపై మన సంపదలో కొంతైనా ఆర్తుల సహాయానికై వినియోగపడేలా చేస్తే.. జయహో.. ''
- ఎజి కృష్ణమూర్తి

ఆకర్షణతో ఆకాశమంత ఎత్తుకు..

కొత్త మార్గాన్ని అన్వేషించటం లేక ఉన్న మార్గాన్ని మెరుగుపరచటం.. ఈ రెండే మనముందున్న దోవలు. జీవితంలో ఏదైనా సాధించి పైకి రావాలంటే.. ప్రతి విజేత గాధలో అంతర్లీనంగా ఉన్న సత్యమిదే. సాధిర్ అనే దేవదాసిల నృత్యాన్ని మెరుగుపరిచి భరతనాట్యమనే కొత్త నాట్యకళకు జీవం పోశారు రుక్మిణీ దేవి అరండేల్. నోబిన్ దాస్ నోరూరించే రసగుల్లాకు కొత్త జీవం పోసి దేశ విదేశాల్లో మనకో సరికొత్త అనుభూతికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అలాగే ఎందరో మహానుభావులు వాడుకలో ఉన్న కళలకి, వస్తువులను మెరుగుపరిచి తాము లాభపడ్డారు. మన జీవితాల్లోకి అనూహ్య అనుభూతులను తెచ్చారు.

ఎంఎస్ స్వామినాథన్, రైట్ బ్రదర్స్, నిర్మా కర్సన్‌భాయ్ పటేల్, హెన్రీ ఫోర్డ్, సర్ సివి రామన్, ఎడిసన్.. ఇలా ఎందరో అపర బ్రహ్మలు కొత్త మార్గాల్ని అన్వేషించి మానవ జీవనానికి కొత్త అర్థాన్ని, సరికొత్త రూపురేఖలనీ ఇచ్చారు. రెండు మార్గాలు ఉత్తమమైనవే... మన శక్తి సామర్థ్యాల పైన, ప్రజ్ఞాపాటవాల మీద ఆధారపడుంది మనకే దోవ మంచిదో అనే నిర్థారణ. నా దగ్గరకు ఎంతో మంది యువకులు వస్తుంటారు కొత్త కొత్త కలలు, గమ్యాలతో.. వీరిలో పెక్కు మంది సరికొత్త పథకాలతో, ఆలోచనలతో ఏదైనా కొత్త పుంత తొక్కాలంటే కేవలం ఒక కొత్త ఆలోచనే సరిపోదు.

ఈ ఆలోచనను లేదా ఉత్పాదనను అమల్లోకి తెచ్చి అది నలుగురికి తెలిసి ప్రాచుర్యం పొందేదాకా నిలబడగలిగే స్థోమత, ఓర్పు ఎంతో ముఖ్యం. ప్రతి కొత్త ఆలోచన, ఉత్పాదన ఉద్భవించాక అవి నిలబడి నాలుగు కాలాలపాటు జీవించి ఉండాలంటే పెట్టుబడులు అవసరం. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి యువకుడికి చెప్తుంటాను కలల సాకారం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని అని. కొత్త మార్గాలు అన్వేషించి వాటిలో పయనం మొదలుపెట్టబోయే ముందు ఈ రెండు విషయాలు .. పెట్టుబడి.. అవి ఫలితాలనిచ్చే దాకా నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు.

ఓర్పు.. మనకున్నాయా లేదా అనే విషయం మీద లోతుగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవటం ఎంతో ముఖ్యం. ఇక అమల్లో ఉన్న పద్దతులను, ఉత్పాదనలను మెరుగుపర్చాలన్నా, పెట్టుబడులు, ఓర్పు ఎంతో అవసరం. నిజానికి ఏ దోవ ఎంచుకున్నా ముందుగా ఆ రంగంలో నిష్ణాతుడిగా మారటం అన్నిటి కన్నా ముఖ్యం. ఈ రోజు మరో నిష్ణాతుడి గురించి ముచ్చటించుకుందాం. ఈయన మన ఆధునిక జీవితాన్ని సంపూర్ణంగా మార్చి వేసిన వ్యక్తి. అంతేకాదు తన అపారమైన ధనరాశిని ప్రపంచవ్యాప్తంగా లేమితో బాధపడే ప్రజానీకానికి పంచుతూ వారి జీవితాల్లో వెలుగులు, పెను మార్పు తెస్తున్న వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా ఈయన పేరు తెలియని యువతీ యువకులు ఎవరన్నా ఉంటారంటే ఆశ్చర్యపోవలసిన విషయమే.

వ్యాపారం, రాజకీయాలు, సంఘసేవ నేపథ్యాలుగా కలిగిన కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు తన నేపథ్యానికి భిన్నంగా ఎంతో వైవిధ్యంగా ఆలోచించాడు. తన అసమాన ప్రతిభతో అనూహ్య పరిజ్ఞానంతో ప్రపంచ పోకడనే మార్చివేశాడు. ఆయన కృషివల్ల ప్రపంచం మాటతీరు మారింది. పనితీరు కొత్తదనాన్ని సంతరించుకొంది. సువిశాలమైన గ్లోబల్ విలేజ్‌గా రూపాంతరం చెందింది.

ఆయనే బిల్ గేట్స్.. బిల్ గేట్స్‌కు లెక్కలంటే చాలా ఇష్టం. స్కూల్లోని తెలివైన పిల్లల జాబితాలో ఆ కుర్రాడి పేరు ముందుండేది. ప్రపంచం చేసుకొన్న అదృష్టం కొద్ది ఆ అబ్బాయి అప్పట్లో తొలి దశలో ఉన్న కంప్యూటర్ వైపు ఆకర్షితుడయ్యాడు. అదేం విచిత్రమోకాని ఆ ఆక ర్షణ బిల్‌గేట్స్‌కి కంప్యూటర్‌కి ఒక విడదీయరాని బంధంగా ఏర్పడిపోయింది. అక్కణ్ణుంచి ఆ కుర్రాడు కంప్యూటర్ వదిలితే ఒట్టు !

బిల్‌గేట్స్‌కి అతని నేస్తం పాల్ అలెన్ తోడయ్యాడు. కంప్యూటర్‌ని చూస్తే చాలు ఇద్దరూ తమని తాము మర్చిపోయేవారు. ఫలితంగా స్కూలు పాఠాల మీద శ్రద్ధ తగ్గింది. టీచర్లు బోధించే విషయాలకంటే యంత్రం మౌనంగా వివరించే విషయాల మీద ఆసక్తి పెరిగింది. క్లాసులకు నామం పెట్టి కంప్యూటర్ రూమ్‌లో కాలక్షేపం చేస్తూ మిత్రులిద్దరూ తరచూ పట్టుబడేవారు. వారి ఆలోచనల్లో కంప్యూటర్.. అన్న పానాల్లో కంప్యూటర్, కలల్లో కంప్యూటర్.. అదో యంత్రం కాదు..తమకు మిత్రుడు, ఆత్మీయుడు. దాంతో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందరికన్నా తొందరగా వంటబట్టించుకున్నారు.

తమ భావి జీవితాలు కంప్యూటర్‌తోనే ముడిపడి ఉన్నాయని బాల్యంలోనే ఆకళింపు చేసుకున్నారు. ఇష్టమైన పని చేస్తుంటే ఇదే జరిగేది. సర్వకాల సర్వావస్తలయందు ఆ ఇష్టమైన పని మీదే ధ్యాస. ఫలితంగా ఆ రంగంలో కొద్ది కాలంలోనే ప్రావీణ్యత పొందుంతాం. ఇదే జరిగింది బిల్‌గేట్స్‌కి..పాల్ అలెన్‌కి. దీనికి తోడు అవకాశం కోసం ఎదురు చూసేవారికిఅది తలుపు తడుతుందనే సామెత నిజమైంది వీరిద్దరి విషయంలో. ఆ అవకాశం వీరి తలుపు తట్టింది. ఆ ఇద్దరు మిత్రులు హార్వర్డ్‌లో ఉన్నప్పుడు ఓ పత్రికలోని ప్రకటన వారిని ఆకర్షించింది.

ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ కిట్ తన కమర్షియల్ మోడల్స్‌లో మార్పులు తీసుకు రాబోతుందని ఆ ప్రకటన సారాంశం. ఇంకేం బిల్, పాల్ ఎగిరి గంతేశారు. అవకాశాన్ని అందుకునేందుకు ముందుకొచ్చారు. కంప్యూటర్ కంపెనీకి ఫోన్‌చేసి తమ వద్ద ఓ ప్రోగ్రాం సిద్ధంగా ఉందని, ఆ కంప్యూటర్‌కి చక్కగా సరిపోతుందని చెప్పారు. నిజానికి ఉత్సాహమే తప్ప ప్రోగ్రాంలాంటిదేది వారి దగ్గర సిద్ధంగా లేదు. ఊరికే చీకట్లో రాయి విసిరారంతే. ఆ రాయి వెళ్లి సరిగ్గా తగలాల్సిన గురికే తగిలింది. ఫలితంగా వారి ప్రయత్నానికి అనుకూల స్పందన. కంపెనీ నుంచి పిలుపు వచ్చింది.

ఇద్దరు మిత్రులు కంప్యూటర్‌తో రెండు రోజులపాటు నిర్విరామంగా కుస్తీ పట్టారు. నిజానికి అలాంటి కంప్యూటర్ గాని లేదా ఆ తరహా చిప్‌కాని అంతకు మునుపు వారు చూడలేదు. సరికొత్త గుర్రాన్ని రౌతు మచ్చిక చేసుకొన్నట్టుగా ఆ కంప్యూటర్ స్వభావాన్ని వారు ఆకళింపు చేసుకొన్నారు. డెమో డే రానే వచ్చింది. మిత్రుల ఆదేశాల్ని తుచ తప్పకుండా పాటించిన కంప్యూటర్ వారి తొలి విజయానికి అంకురార్పణ చేసింది .అక్కడ నుంచి బిల్‌గేట్స్ విజయయాత్ర ప్రారంభమైంది. 
- ఎజి కృష్ణమూర్తి

నోబిస్ దాస్..రసగుల్లా

రుక్మిణీ దేవి అరండేల్ దక్షిణాదిలో సృష్టించిన చెన్నై కళాక్షేత్రం నుంచి తూర్పు దిశగా పయనించి నోరూరించే రసగుల్లాలు ఆస్వాదిద్దామా ? అయితే పదండి ఒడిషా వెళదాం. ఈ లోగా మరోసారి గుర్తు చేసుకుందామా.. భగవంతుడు మనకెలాంటి నైపుణ్యాన్ని ప్రసాదించాడన్నది కాదు ముఖ్యం, దాన్ని ఎంత తొందరగా, ఎంత బాగా గుర్తించి, వెలుగులోకి తీసుకువచ్చామన్నదే ప్రధానం.

భరత నాట్యం కావచ్చు.. రసగుల్లాలు కావచ్చు... వాషింగ్ పౌడర్ కావచ్చు....రస్నాలాంటి సాఫ్ట్ డ్రింక్ కాన్‌సంట్రేట్ కావచ్చు... లేక అప్పడాలు కావచ్చు. 'కవితకేది కాదు అనర్హం' అన్నట్లు పేరు ప్రఖ్యాతులు, ధనలక్ష్మీ కటాక్షం పొందటానికి అన్ని రంగాలు, అన్ని వృత్తులు, అందరూ అర్హులే. ఈ సత్యాన్ని విస్మరించి ఎక్కడో దేన్నో వెతుక్కుని తద్వారా గుర్తింపు పొంది విజేతగా రూపాంతరం చెందాలనుకోవటం చంకన పిల్లవాన్ని పెట్టుకుని ఊరంతా గాలించటమే అవుతుంది. మనలో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక నైపుణ్యాన్ని ప్రసాదించాడు. ముందు ఈ సత్యాన్ని గ్రహించటం ఎంతో అవసరం. ఆపైన దాన్ని గుర్తించి, ఆ రంగంలో శ్రమించి నిష్ణాతుడిగా మారటం ఇంకా ఎంతో అవసరం.

ఇక తిరుగేమిటి ? విజయ ప్రస్థానం వైపు దూసుకెళ్లటమే.. చంకలో పిల్లాడంటే గుర్తుకొచ్చింది ఈ చిన్న కథ. అనగనగా ఒక రోజున ఒక వ్యక్తి పేరు రాజయ్య అనుకుందాం. కాశీ యాత్రకు బయల్దేరాడు. ఆ రోజుల్లో నేటిలాగా క్షణాల్లో కాశీలో దించే విమానాలు లేవు కదా ! నడకే ఉన్న ఏకైక మార్గం...మూటా ముల్లే చంకలో వేసుకుని ప్రయాణిస్తున్నాడు. నేటిలాగా ఆ రోజుల్లో కూడా దొంగలకు కొదవలేదు. ఓ దొంగ... రాజయ్య మూటాముల్లే గమనించి తోటి కాశీ ప్రయాణికుడి లాగా పరిచయం చేసుకుని, ఆయనతో ప్రయాణం మొదలుపెట్టాడు.

అయితే ఆ దొంగ కళ్లన్నీ రాజయ్య ముల్లె మీదే... ఒక రాత్రి సత్రంలో బసచేశారు.. ఒకే గదిలో విశ్రమిస్తున్నారు. అర్థరాత్రి దాటాక రాజయ్య ధనాన్ని తస్కరిద్దామని గదంతా గాలించాడు దొంగ. ఎంత వెతికినా, ఎంత శ్రమపడ్డా ఆ డబ్బు మూట దొరకలేదు. విసుగు చెంది నిద్రపోయాడు దొంగ. మర్నాడు ఉదయం రాజయ్య నిద్రలేచాక అడిగాడు "నీ డబ్బు మూటని ఎక్కడ దాచావో కాని, గదంతా గాలించా ఎక్కడా దొరకలేదు... ఎక్కడ దాచావేంటి'' ?!!

"నీ వాలకాన్ని బట్టి నువ్వు దొంగవనే అనుకున్నాను..నువ్వెక్కడా చూడని చోటున నా డబ్బు మూట పెట్టానన్నాడు.'' అదే ఎక్కడ ?? "నీ తల దిండు కింద'' అన్నాడు రాజయ్య చిరునవ్వుతో..దీన్నే చంకలో పిల్లాణ్ణి పెట్టుకొని ఊరంతగా గాలించటమంటే. స్వతహాగా మనకు అబ్బిన నైపుణ్యాన్ని గుర్తించక, కొత్త నైపుణ్యాల కోసం వేటాడటం సమజంసమేనా ? నేను ప్రకటనా రంగంలో కాకుండా మరేదో రంగాన్ని వృత్తిగా ఎన్నుకుని ఉంటే ఏమై ఉండేదో అని తలచుకుంటేనే భయమేస్తుంది. అలాగే బిల్‌గేట్స్ సాఫ్ట్‌వేర్ కాకుండా ఏ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సో చేసుంటే ఏమై ఉండేదో కదా !

ఊహే భయంకరంగా లేదు ? సో, ఫ్రెండ్స్ మీలో అంతర్లీనమై ఉన్న మీ ప్రావీణ్యాన్ని వెలికి తీయండి. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు..ఆపలేరు. ఇక పదండి నోరూరించే రసగుల్లాల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం. ఈ వ్యక్తి బిల్‌గేట్స్ లాంటి అసాధారణ సాంకేతిక ప్రతిభాశాలి కాకపోవచ్చు. కాని ప్రపంచం ఆయన చేతి మహత్తును రుచి చూస్తోంది. ఆయన చేస్తున్న రసగుల్లాలను అద్భుతంగా ఆహ్వానిస్తోంది.

ఇది నోబిన్ దాస్ స్ఫూర్తిదాయకమైన గాథ. ఆయన స్థాపించిన 'కెసి దాస్ అండ్ సన్స్' సంస్థ ప్రపంచవ్యాప్తంగా రసగుల్లా ప్రియుల పాలిట వరప్రసాదంగా మారిన వైనాన్ని నోరూరించేలా వివరించే కథనం... భువనేశ్వర్‌కి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో పహాలా అనే గ్రామంలో కాటేజ్ చీజ్ (పన్నీర్) పంచదార పాకాన్ని మేళవించి తయారు చేసే రసగుల్లా అనే సాంప్రదాయ వంటకం ఎక్కణ్ణుంచి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకుంటే ఔరా అని విస్తుపోక మానరు.

రసగుల్లా ఎక్కువ కాలం నిల్వ ఉండదు.. త్వరగా పాడైపోతుంది. పుల్లగా మారిపోతుంది. ఎంత గొప్ప రిఫ్రిజిరేటర్‌లో దాచినా సరే రెండు రోజులకి మించి దాని రుచిని కాపాడటం కష్టం. నోబిన్ చంద్ర దాస్ నిరుపేద. తండ్రి లేడు. శిథిలావస్తలో ఉన్న మిఠాయి దుకాణాన్ని నెట్టుకొస్తూ తల్లినీ, తోబుట్టువులను పోషిస్తూ వచ్చాడు. నోబిన్ దాస్ వద్ద పెట్టుబడి లేకపోయినా, తన వ్యాపారానికి సంబంధించిన పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉంది. అందువల్లే బెంగాలీ వంటకాలు చేస్తూ బతుకు బండి లాగిస్తూ వచ్చాడాయన. లోలోపల మాత్రం ఏదో తపన. ప్రయోగాలు చెయ్యాలనీ, కొత్తదనాన్ని అన్వేషించాలనీ చాలా ఆరాటపడేవాడు. 1868లో ఓ రోజు నోబిన్ దాస్ జీవితాన్ని మలుపు తిప్పింది. వంటశాలలో ఆయన కొత్త దినుసులు రంగరించాడు. అంతవరకు అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశాడు.

నోబిన్ దాస్ ప్రయోగాల ఫలితంగా రసగుల్లా జీవితకాలం పెరిగింది. రుచిని కోల్పోకుండా, ఎక్కువ రోజులు నిల్వచేయటం వీలైంది. ఆనాటి ప్రయోగం వ్యాపారపరంగా విజయవంతమై, నోబిన్ దాస్‌కి ధనలక్ష్మీ కటాక్షం కలిగించిందో లేదో కానీ, ఆయన కుమారుడు మాత్రం మరో ఆకు ఎక్కువే చదివాడు. తండ్రి కనిపెట్టిన సూత్రాన్ని వ్యాపార విజయంగా మలుచుకున్నాడు. రసగుల్లాలను డబ్బాల్లో ప్యాక్ చేసి, శరవేగంతో అమ్ముడయ్యేలా చేశాడు.

అంతే.. అన్నాళ్లు , ఒకటి రెండు రోజులకు పరిమతమై పోయిన రసగుల్లా అమృతంగా మారి మరో కొత్త జన్మ ఎత్తింది. తన జీవిత కాలంతో పాటు మార్కెట్ పరిధిని కూడా విస్తరించుకుంది. చిక్కటి పాకంలో పౌర్ణమి నాటి చందమామల్లా తేలుతూ దాస్ గారి దుకాణం నుంచి రసగుల్లాలు ఇతర ప్రాంతాలకు ఎగిరివెళ్లాయి. తీపి పదార్థ ప్రియులకు కొత్త లోకాన్ని పరిచయం చేసినాయి.

ఒకరోజు నోబిన్ చంద్రదాస్ చేసిన ప్రయోగం చూడండి. ఎంత గొప్ప వ్యాపార విజయానికి పునాదులు వేసిందో ?! నిజానికి నోబిన్ చంద్ర దాస్ మిఠాయి వంటలో ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రజ్ఞావంతుడేమి కాదు. అప్పట్లో ఒరియా, బెంగాలీ వంటకాల తయారీలో అనుసరించే పద్దతుల్నే అతడు అనుసరించేవాడు.

కానీ, ఒక్కటే తేడా ! తన రంగంలో నిష్ణాతుడిగా కావాలన్న తపన, పట్టుదలే నోబిన్‌దాస్‌ని ప్రయోగాల వైపు నడిపించింది. కేవలం ఒక్కరోజుకే పరిమితమైన రసగుల్లాని మరిన్ని రోజుల పాటు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న జిజ్ఞాస, తన జీవితాన్నే కాకుండా తన తర్వాత తరాల వారి జీవితాల్ని, రసగుల్లా చరిత్రను మార్చివేసింది.
- ఎజి కృష్ణమూర్తి

సంకల్పంతోనే కళాక్షేత్రాలు

  '' నీకు ఎలుక బోను తయారు చేయటం వచ్చా ? అయితే అందులో నిష్ణాతుడిగా మారి, నీ పనితనం చూపించు. అందరి కన్నా మెరుగైన ఎలుకల బోను తయారు చేయి.. అందరూ వాటి కోసం నీ ఇంటి ముందు బారులు తీరుతారు''   ఎమర్సన్ చెప్పిన మాటలవి.
అక్షర సత్యాలు.. విజేతలు కావాలనుకునే ప్రతి ఒక్కరూ పాటించవలసిన ప్రాథమిక సూత్రం ఆచరించవలసిన పద్ధతి. ప్రపంచంలోని ఏ విజేత అయినా తను ఎంచుకున్న రంగంలో నిష్ణాతుడిగా మారి, విజయాలను తన హస్తగతం చేసుకోన్నాడు. ముందుగా బలమైన, దీర్ఘకాలిక కలలు, గమ్యాలను ఏర్పరచుకోవటం.. వీటి గురించి గత 15 వారాలుగా మనం ముచ్చటించుకుంటూ వస్తున్నాం. ఎంతో మంది విజేతలను కలుసుకున్నాం. వారి జీవిత విశేషాల గురించి తెలుసుకున్నాం. ఈ మహానుభావులందరూ తమ తమ రంగాల్లో నిష్ణాతులై, కొత్త వరవడులను సృష్టించిన వారే.

కర్సన్ భాయ్ పటేల్ కొత్త తరహాకు చెందిన డిటర్జెంట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టి, ఆ రంగంలో ఎన్నో మార్పులను తేగా, ధీరూభాయ్ అంబానీ అంతర్జాతీయ స్థాయిలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టి, కలలకు, గమ్యాలకు అర్హతలు ఎల్లలు లేవని నిరూపించాడు. ఆనాటి ఒరవడికి ఎదురీది లేక ఏదో ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగాన్ని వదులుకుని ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాంది పలికారు.

ఇలా ఎందరో... అందరూ ఎంచుకున్న రంగాల్లో అపారమైన కృషి చేసి నిష్ణాతులుగా మారి వారి వారి కలలను సాకారం చేసుకున్న వారే. అటువంటి మరి కొందరి జీవితగాధలను ఈ వారం నుంచి ముచ్చటించుకుందాం. వీరి జీవిత గాధలు మనకిచ్చే సందేశం ఒక్కటే. ఎంచుకొన్న రంగంలో నిష్ణాతులుగా మారటం. ఏదో ఒక నైపుణ్యం, కొంతైనా చాకచక్యం.. వాటిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చునేమో గాని, భగవంతుడు మనుషులందరికి ప్రసాదించాడన్నది మాత్రం నిజం. మనిషి చేయవలసిందల్లా ఒక్కటే. తనను తాను విశ్లేషించుకోవాలి. తనలోని సామర్థ్యాన్ని గుర్తించాలి. దాన్ని సానబెట్టి, పదునుపెట్టాలి.

అందరూ ఒకే రకమైన పనుల్లో నిష్ణాతులు కావాలన్న నియమం లేదు. ఒకరు అప్పడాలను అత్యుత్తమంగా తయారు చేయటంలో ప్రతిభ కనబరిస్తే, మరొకరు శూన్యంలోంచి సిరుల వర్షం కురిపించవచ్చు. ఎవ రి ప్రతిభ వారిది. ఆ ప్రతిభను గుర్తించాల్సిన బాధ్యత మాత్రం మనది. ఇంకా ఏం చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. చేస్తున్న పని ఏదైనా, ఎంత గొప్పగా చేస్తున్నామన్నదే ముఖ్యం.

నిజానికి ఈ ప్రపంచంలోని సర్వసుఖాలు, గౌరవ మర్యాదలు, అన్ని విజేతలకే కదా. ఆ విజేతలు తమ తమ రంగాల్లో నిష్ణాతులుగా మారటం వల్లే కదా.. ఆ విజయాలన్ని... సచిన్ టెండూల్కర్ నుంచి మన బాలు దాకా. అందరూ తమ తమ రంగాల్లో ఆరితేరిన వారు, ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకున్నవారు. గతంలో చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. ఆడటం ముఖ్యం కాదు, ఆడిన ఆటలో విజేతలుగా మారటం ముఖ్యం. 'విన్నర్ టేక్స్ ఆల్' అన్నది ఎంతో నిజం. విజేతే అన్నింటినీ కైవసం చేసుకుంటాడు. కనుకే ఆడటమే కాదు. ఆ ఆటలో గెలవటం ముఖ్యం.

ఏ పందెంలోనైనా గెలిచిన వారు గుర్తుంటారు మనకు. ఓడిన వారు కాదు కదా! పదండి చెన్నైకి ప్రయాణం చేద్దాం. గజ్జల సవ్వడి వినబడటం లేదూ! అదుగో చూడండి.. నట్టువాంగాలతో, మృందగ నాదాలతో రాగ తాళభరితమైన భరత నాట్య వేదికకు తెరలేస్తూంది. ఆ వేదిక మీద ఆవిడ దర్శనమిస్తారు మనకు. భారత దేశానికి ప్రతీకగా, అంతర్జాతీయ వేదికలపై భరతనాట్యాన్ని నిలిపిన ఆ మహిళా మూర్తి మనకి మార్గదర్శిలా స్ఫూర్తినిస్తారు. రుక్మిణీ దేవి అరండేల్ గురించి నేను చెబుతున్నది.

ఇప్పుడు భరతనాట్యమంటున్నామే.. దాని సృష్టికర్త రుక్మిణీ దేవే. 1930 దశకంలో భరత నాట్య శైలికి ఆమె ఊపిరి పోశారు. తన మానస పుత్రికను మనోహరంగా తీర్చిదిద్దారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రుక్మిణీ దేవి తన తండ్రి ద్వారా దివ్యజ్ఞాన సమాజంలో ప్రవేశించారు. అక్కడే తన భావి జీవిత భాగస్వామిని కలుసుకొన్నారు. ఆయనే డాక్టర్ అరండేల్ రుక్మిణీ దేవి కళారాధనకూ, కళా సాధనకూ అండగా నిలిచిన వ్యక్తి. నృత్యం వైపు ఆమె ఆకర్షితురాలు కావటానికి దోహదం చేసిన వారు మాత్రం ప్రముఖ నాట్యవేత్త అన్నా పావ్లోవా. రుక్మిణీ అరండేల్ దంపతులు బొంబాయి నుంచి ఆస్ట్రేలియాకు నౌకలో వె ళ్తున్నప్పుడు అదృష్టవశాత్తు వారికి అన్నా పావ్లోవాతో పరిచయం అయింది.

ఆ సందర్భంలో భారతీయ నృత్యరీతులపై దృష్టి సారించి, నిర్లక్ష్యానికి గురైన సత్సంప్రదాయాలకు పునర్‌వైభవాన్ని తీసుకురావాల్సిందిగా రుక్మిణీ దేవిని అన్నా పావ్లోవా కోరారు. ఆ సలహా ఆమెకు ఎంతో నచ్చింది. ఆ రంగం వైపు దృష్టి సారించేలా చేసింది. ఒకరోజు రుక్మిణీ దేవి అరండేల్ 'సాధిర్' అనే దేవదాసీలు చేసే నృత్యాన్ని చూశారు. ఆ రోజుల్లో దేవదాసీ నృత్యాలను తక్కువ స్థాయికిచెందిన వినోద ప్రదర్శనలుగా సమాజంలోని ఉన్నత వర్గాల వారు భావించేవారు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రుక్మిణీ దేవి మాత్రం అలా భావించలేదు. పైగా ఆ నృత్యం ఆమెకో లక్ష్యాన్ని ప్రసాదించింది. సలక్షమైన మార్గానికి రూపకల్పన చేసే దిశగా పురికొల్పింది.

శ్రీ శంకర్ మీనన్ మాటల్లో చెప్పాలంటే "దేవదాసీల నృత్యంలోని అభ్యంతరకరమైన అంశాన్ని తొలగిస్తే దానికొక ఉదాత్తమైన, కళాత్మకమైన శైలిగా రూపొందించే వీలుంది. రుక్మిణీ దేవి ఆ సంకల్పంతోనే తనదైన మార్గాన్ని ఎంచుకున్నారు. తమ కులం నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాల్ని , విమర్శల్నీ ఆవిడ పట్టించుకోలేదు. దేవదాసీల నృత్యాన్ని త్రికరణ శుద్ధిగా అభ్యసించేందుకు అడుగు ముందుకు వేశారామే. కానీ మార్గం చాలా కఠినమైనదన్న విషయం వెంటనే తోచింది. ఎందుకంటే 'సాధిర్'నృత్యం అంతగా ప్రాచుర్యం పొందిన నృత్యశైలి కాదు. పైగా గురువు దొరకటం చాలా కష్టం. అప్పట్లో పేరు ప్రఖ్యాతులున్న నాట్య గురువులందర్నీ ఆవిడ కలుసుకొన్నారు. 'సాధిర్' నృత్యం నేర్పించమని వేడుకున్నారు. తిరస్కారాలే ఎదురయ్యాయి. నిరుత్సాహపడలేదామె. అసలు నాట్యం వైపు తాను ఆకర్షితురాలయ్యేందుకు కారకుడైన పండనల్లూర్ మీనాక్షీ సుందరం పిళ్లైని ఎలాగైతేనేం రుక్మిణీ దేవి ఒప్పించగలిగారు. ఆయన ఆ రంగంలో గొప్ప నిష్ణాతుడు.

పిళ్లై కఠోర సాధనకు మారుపేరు. ఉదయం ఏడు గంటలకు గజ్జెలు కడితే మధ్యలో ఓ గంట భోజన విరామం మినహాయించి సాయంత్రం ఏడు గంటల వరకు సాధన చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో రుక్మిణీ దేవి పగలంతా చేసిన సాధన పట్ల సంతృప్తి చెందని పిళ్లై ఆమె చేత రాత్రివేళ కూడా నాట్య సాధన చేయించేవారు. దాన్ని రుక్మిణీ దేవి శిక్షగా కాకుండా శిక్షణలో భాగంగా ఆనందంగా స్వీకరించేవారు. నాట్యమే సర్వస్వంగా భావించి, నిరంతర సాధనతో తన కలల్ని నిజం చేసుకోవాలని భావించిన రుక్మిణీ దే వి అరండేల్ అరంగేంట్రం సిద్దమయ్యారు. అప్పుడు ఆవిడ వయస్సు 34 సంవత్సరాలు. సాధారణంగా వయస్సు ఇరవై దాటక ముందే అందరూ అరంగేట్రం చేస్తారు. ఈ వయసులో ఆవిడ ఏం నాట్యం చేస్తుందిలే ? అన్న సంశయం లోలోపల గూడు కట్టుకున్నా సమాజంలో పేరు ప్రతిష్టలున్న అరండేల్ మీదున్న గౌరవం కొద్ది చెన్నైలోని పెద్దలు నాట్య ప్రదర్శనకు విచ్చేశారు.

రుక్మిణీ దేవి అరండేల్ జీవితంలో తొలి నాట్య ప్రదర్శనకు తెరలేచింది.. నాట్యం మొదలైన దగ్గర్నుంచి చివరి దాకా అందరూ ఆశ్యర్యచకితులయ్యారు. దేవదాసీల నృత్యాల్లోని అభ్యంతరకర అంశాల్ని తొలగించి, దైవదత్తమైన ఉదాత్త హావాభావాలకు ఆమె పెద్దపీట వేశారంటూ విమర్శకులు పొగిడారు. "ఈ క్షణం నుంచి దీని పేరు భరత నాట్యం'' అంటూ ఇ కృష్ణ నామకరణం చేశారు. ఓ మహోదాత్తమైన నృత్యకళ ప్రాణం పోసుకుంది. తొలి ప్రదర్శనకు అపూర్వమైన ఆదరణ లభించినా, తన ప్రస్థానం అప్పుడే మొదలైందని, గమ్యం ఎంతో దూరమని రుక్మిణీ దేవి గ్రహించారు.

తన లక్ష్యసాధనకై 'కళా క్షేత్ర'ను నెలకొల్పారామె. కానీ అందులోకి విద్యార్ధినీ, విద్యార్ధులను రప్పించటం కష్టమైపోయింది. కారణం.. పరువు ప్రతిష్టలున్న కుటుంబాల వారికి నృత్యం నేర్చుకోవటం నామోషీగా అనిపించటమే ! రుక్మిణీ దేవి నిరుత్సాహపడలేదు. తన కల సాకారమయ్యేందుకు అవిరామంగా శ్రమించారు. భరత నాట్యంలోని ప్రత్యేకతలను గురించి వ్యక్తులకు వివరించారు.

చివరకు కళా క్షేత్ర కళకళలాడింది. ఒకప్పుడు అత్యంత చౌకబారుగా ముద్రపడిన నాట్యశైలి. ఉదాత్తమైన అథ్యాత్మిక భావప్రకటనగా ఆమోదం పొందింది. ఇదంతా రుక్మిణీ దేవి అరండేల్ ధృడస్పంకల్పం, కృషి వల్లనే సాధ్యమైంది. పరిస్థితులకు ఎదురీది మూఢభావాలను నిర్మూలించి అపురూపమైన కళా ప్రక్రియను అత్యున్నత శిఖరాలపై నిలబెట్టి ప్రపంచాన్ని తన దారికి రప్పించిన ఘనత రుక్మిణీ దేవి అరండేల్‌దే.

కలలకి, నిష్ణాతులకి అసాధ్యాలంటూ ఏమీ ఉండవని మరోసారి నిరూపించారు రుక్మిణీ దేవి అరండేల్. 
- ఎజి కృష్ణమూర్తి

Sunday, November 7, 2010

తప్పిన ‘జల్‌’‌ గండం అయినా అతలాకుతలం

Chennai-4
జల్‌ తుపాన్‌ తాకిడికి కోస్తా, రాయ లసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈశాన్య రుతుప వనాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే తిరిగి జల్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘జల్‌’ తుపాను సాధారణ తుపానుగా బలహీనపడినప్ప టిీ నెల్లూరు జిల్లాలో ప్రజలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉండటం తో. ప్రభుత్వం వారిని సహాయకశిబిరాలకు తరలిస్తుంది.ఈ తుపాన్‌ కారణంగా ఒక్క నెల్లూరు జిల్లాలోనే 15మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు సుమారు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినటుల జిల్లా యం త్రాంగం వెల్లడించారు.జిల్లా వ్యాప్తంగా చెరువుల అన్నీ నిండి పోయి ప్రమాదపుటంచుల్లో ఉన్నాయి.జల్‌ ప్రభావంతో నెల్లూ రు-గూడూరుల మధ్య రైళ్ల వేగాన్ని 50కి.మీలకు నియం త్రించినట్లు అధికారులుతెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీగానే వర్షాలు నమోదయ్యాయి. మధ్య మధ్యలో వర్షం తెరపినప్పటికీ తిరిగి జల్లులతో కూడిన వర్షాలు పడ్డాయి. కృష్ణాజిల్లా తీర ప్రాంత గ్రామాల్లో ఈ వర్షాలు అలజడి సృష్టించాయి. ఆటుపోట్లు అధికంగా ఉండటంతో పాటు భారీ వర్షాల కారణంగా సముద్రంలో కలిసే డ్రైన్లలోని నీరు ఎదురు తన్నటంతో తీర ప్రాంత గ్రామాల్లో సముద్రపు నీరు గ్రామాన్ని తాకింది.

చిత్తూరులో సముద్ర తీరానికి సమీపంలో వున్న నిరుపేదలు నిర్మించుకున్న పూరిగుడిసెలు తుపాను గాలికి ఎగిరిపోయా యి. అలల ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని బారువ- కొత్తూరు తీర ప్రాంతంలో పది అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. అయితే ఈ జిల్లాల్లోని లోత ట్టు ప్రాం తాల ప్రజలను ముందుస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతా లకు తరలించడంతో ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. పెను తుపాను ప్రభా వంతో ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని పలు మండ లాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు ఉధృతమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రికి తీరం దాటుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపు తున్నారు. గుంటూరు, పశ్చిమగోదావరిజిల్లా జల్‌ తుపాన్‌ ప్రభావం అతంతమాత్రమే కనిపించింది. సముద్రంలో అలజడి కొనసాగుతుంది. జల్‌ తుపాన్‌ ప్రభావం వివరాలు జిల్లాల వారీగా..

తెల్లారేదాకా నెల్లూరు జిల్లా ప్రజలకు తప్పని ముప్పు
JAALబంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘జల్‌’ తుపాను సాధారణ తుపానుగా బలహీనపడినప్పటికీ తుపాను హెచ్చరికలు జిల్లా కు గత మూడు రోజులుగా రావడంతో అధికార యంత్రాంగం అన్ని ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేసినప్పటికీ జిల్లాలో చలి గాలులు, విద్యుద్ఘాతాలు, చెట్లు విరిగిన సంఘటనల్లో జిల్లా వ్యాప్తంగా 15 మంది మృతిచెందారు. అయితే కేవలం ఏడు మంది మాత్రమే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని చెరువులు నిండిపోయి ప్రమాదపుటంచు ల్లో ఉన్నాయి. జిల్లాలోని అతిపెద్ద చెరువైన కనిగిరి రిజర్వాయ ర్‌ పూర్తిస్థాయి మట్టాన్ని దాటి నిండిపోయి ఉంది. ముఖ్యంగా ఈ తీరప్రాంత మండలాలైన ఇందుకూరుపేట, అల్లూరు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో సముద్రపు నీరు తీరప్రాంత గ్రామాల్లోకి రావడంతో అధికారులు స్థాని కులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోనే అతి పెద్ద సముద్రతీరప్రాంతం కలిగిన నెల్లూరు జిల్లాలో ఈ తుపా ను అలజడి ఎక్కువగా ఉంది. సముద్రపు అలలు రెండు నుం చి 4 నాలుగు మీటర్ల ఎత్తు వరకూ ఎగిసిపడుతున్నాయి.

ముఖ్యంగా గూడూరు డివిజన్‌లోని తీరప్రాంత గ్రామాల్లోనూ, పులికాట్‌ సరస్సు సమీపంలోనూ సముద్రపు అలల తాకిడి ఎక్కువ గా ఉంది.ఇందుకూరుపేట, కోట, అల్లూరు, టీపీ గూడూరు మండ లాల పరిధిలోని తీరప్రాంత గ్రా మాల్లో సముద్రం 20 నుంచి 30 మీటర్ల వరకూ ముందుకు వచ్చిం ది. పులికాట్‌ సరస్సు సమీపం లోని జాలర్ల బోట్లు, వలలు దెబ్బ తిన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.ఆదివారం సాయంత్రం నుంచి జిల్లాలో జల్‌ తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం ఉదయం నుంచే జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. నెల్లూరు-చెనై్నల నడుమ తుపాను తీరం దాటనుందనే సమాచారంతో అధికారులు ఈ రెండు ప్రాంతాల నడుమ ఉన్న తుపాను ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

కృష్ణపట్నం ఓడరేవులో ఆదివారం ఉదయం 10నెంబరు అతిప్రమాద సూచికను ఎగరవేసిన అధికారులు సాయంత్రా నికి తీవ్రత తగ్గడంతో 7వ నెంబరు సూచికను ఎగరవేశారు. జిల్లావ్యాప్తంగా తీరప్రాంత, లోతట్టు ప్రాంతాలకు చెందిన 9,500 మందిని 34 పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి భోజన, వసతి సౌకర్యాలను కల్పించారు. జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జిల్లా కేంద్రంలోనే ఉంటూ కాన్ఫెరెన్స్‌ ద్వారా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు ప్రత్యేకాధికారిగా ప్రభు త్వం నియమించిన మార్క్‌ఫెడ్‌ ఎండీ చేరుకుని మంత్రి, జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో పాటు అధికారులతో సమీక్షించి పలు సూచనలు అందచేశారు. మరోవైపు పోలీస్‌ అధికారులు సముద్ర తీర ప్రాంతాల్లో పికెట్‌లు వేసి ప్రజల ఆస్తిపాస్తులకు రక్షణ చర్యలు చేపడుతున్నారు. కటక్‌ నుంచి జాతీయ విపత్తు రక్షణ దళం రెండు రోజులు ముందుగానే జిల్లాకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. జిల్లాలోని 12 తీర ప్రాంత మండలాలకు జిల్లా కలెక్టర్‌ కె.రాంగోపాల్‌ ప్రత్యేకాధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తూర్పులో ఈదురు గాలులు - మోస్తరు వర్షం
jaalaబంగాళాఖాతంలో ఏర్పడ్డ జల్‌ తుపాను ప్రభావం తూర్పుకు ఉండకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నా.. జిల్లా లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నుంచి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఓ మోస్త రు నుంచి భారీగానే వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లోనే తిరిగి తుపాను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో ముసురు ప్రభావం ఉంది. వారం రోజుల పాటు నీటమునిగిన వరి చేలు జల్‌ తుపానుతో ఇబ్బందికరంగా మారాయి. కాకి నాడ పోర్టులో మూడవ నెంబర్‌ ప్రమాద హెచ్చరిక కొనసా గిస్తున్నారు. రేవులో ట్రాఫిక్‌ను సస్పెండ్‌ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వెళ్లకుం డా నిషేధా జ్ఞలు జారీ చేశారు. ఏ పాటి చిన్న తుపాను వచ్చిన ఉలిక్కిపడే ఉప్పాడ సముద్రం మరో పర్యాయం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉవ్వె త్తున రోడ్డుపైకి కెరటాలు చొచ్చుకొస్తున్నాయి.

ఈ వర్షాల వల్ల జిల్లాలోని 2లక్షల 50వేల ఎకరాల్లో పంట నష్టాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. లక్షా 75 వేల కుటుంబాలు ముంపు బాధితులుగా గుర్తించారు. వారికి సోమవారం నుంచి 20 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్‌ అందజేస్తారు. కోనసీమలో రెవెన్యూ యంత్రాంగం పునరావా స కేంద్రాలు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు.

కృష్ణా సముద్రంలో అలజడి
jaala1జల్‌ తుఫాను వార్తలు కృష్ణాజిల్లాలోని తీర ప్రాంత గ్రామా ల్లో అలజడి సృష్టించాయి. సహజంగా అమావాస్య, పౌర్ణమి లకు సముద్రంలో ఆటుపోట్లు అధికంగా ఉండటంతో పాటు భారీ వర్షాల కారణంగా సముద్రంలో కలిసే డ్రైన్లలోని నీరు ఎదురు తన్నటంతో తీర ప్రాంత గ్రామాల్లో అక్కడక్కడ సముద్రపు నీరు గ్రామాన్ని తాకింది. కృత్తివెన్ను మండలం మల్లంపూడి గ్రామ సమీపంలోని పెదలంక డ్రైన్‌ పొంగటంతో ఓర్లగొందితిప్ప గ్రామం జలమయమైంది. అయితే సముద్రపు ఆటుపోట్లతో ఆదివారం నీళ్ళు వెనక్కు వెళ్ళిపోయాయి. అలాగే ఉప్పుటేరు, లజ్జబండ డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నీట మునిగిన వరి పొలాలు నేటికి నీరు లాగకపోవటంతో వరి కంకులు కుళ్ళి పోతున్నాయి. సముద్ర తీర ప్రాంత వాసులకు ఇది సహజమే అయినా జల్‌ తుఫాను వార్తలతో గత రెండ్రోజులుగా రెవిన్యూ శాఖ ఎప్పటికప్పుడు గ్రామస్థులను హెచ్చరిస్తూ పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది.

దివిసీమలో 1977 సం నవంబరులో సంభవించిన ఉప్పెన వలన 30 వేల మం ది ప్రజలు జలసమాధయ్యారు. ఈ నేపథ్యంలో జల్‌ తుఫాను ఏక్షణంలోనైనా జిల్లాను తాకుంతుదేమోనని ప్రజలు భయ భ్రాంతులవుతున్నారు. కృష్ణాజిల్లాలో నాగాయలంక, అవని గడ్డ, బందరు రూరల్‌, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండ లాలలో ఎక్కువ శాతం తీరప్రాంత గ్రామాలు ఉండ టంతో ఇప్పటికే జిల్లా రెవిన్యూ యంత్రాంగం 8 పునరావాస కేంద్రాల ను ఏర్పాటుచేసి సుమారు 2 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ జిల్లా అంతా వాతావరణం ప్రశాంతం గా ఉంది. ఎటువంటి వర్షం ఇంత వరకూ పడలేదు. అక్కడక్కడ చిన్నచిన్న చినుకులు మినహా పెద్దగా వర్షం నమోదు కాలేదు. తుఫాను పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా గతంలో పనిచేసిన బి.ఆర్‌ మీనా ఆదివారం బందరు చేరుకున్నారు. కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామ వాసి నడకుదిటి రామన్న చేపల వేటకు వెళ్ళి మృతిచెందాడు. ఓర్లగొందితిప్ప గ్రామంలో ఓ వృద్ధురాలు చలికి తట్టుకోలేక మృతిచెందింది. రాష్ట్ర పశుసం వర్థక శాఖా మంత్రి కొలుసు పార్థ సారధి ఉదయం నుంచి తీర ప్రాంత గ్రామాలైన కృత్తివెన్ను, లక్ష్మీపురం, బంటుమిల్లి ప్రాంతా ల్లో పునరావాస కేం ద్రాలను పరిశీలించారు.

తడిసి ముద్దైన చిత్తూరు
jaala2సముద్రతీరానికి సమీపంలో వున్న శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బుచ్చినాయుడు కండ్రిగ, వరద య్యపాళ్యం, సత్యవేడు మండలాల్లో తుఫాన్‌ తాకిడి అధికంగా వుంది. నిరుపేదలు నిర్మించుకున్న పూరిగుడిసెలు తుఫాను గాలికి ఎగిరిపోయాయి. గూడు లేక పేదలు రోడ్డుపై నిలిచారు. ఐదు చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిని పూడ్చడానికి అధికా రులు ప్రయత్నిస్తున్నారు. పీలేరు వద్ద కొత్తచెరువు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అధికారులు ముందస్తుగానే గండిని పూడ్చివేశారు. జిల్లాలోని శ్రీకాళహస్తి పరిధిలో లక్ష్మీపురం గిరిజన కాలనీ, చెంచులక్ష్మీ కాలని, ఈదలగుంట ప్రాంతాల్లో వాననీరు కాలనీల్లోకి చేరింది. దీంతో పేద గిరిజనులు సర్వం కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కాళంగి, ఆరణియార్‌, కృష్టాపురం డ్యాంములు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కాళంగిలో పది గేట్లను ఎత్తివేసి నీటి ఉధృతిని తగ్గించారు. జిల్లా కలెక్టర్‌ శేషాద్రి, ప్రత్యేక అధికారి రావత్‌లు తూర్పు మండలాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన సహాయక చర్యలను చేపట్టడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏకదాటిగా ఈదురగాలుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారికంగా 136 ఇండ్లు నేలమట్టమయ్యాయి.

ఇందులో పాక్షికంగా కూడా కొన్ని ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఆర్‌డిఒ కార్యాలయంలో తుఫాన్‌ ప్రభావంపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న ఇండ్లకు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు. కాళహస్తి పరిధిలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో వర్షం కారణంగా విద్యుత్‌ వైర్లు తెగి నాగార్జున అనే విద్యార్థి మృతిచెందాడు. కరకంబాడి వద్ద 30 ఎకరాల అరటి తోట ధ్వంసం అయ్యింది. నేడు జిల్లాలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. జల్‌ తుపాన్‌ ప్రభావం జిల్లా అంతటా ఉన్నప్పటికీ తూర్పు మండలాల్లో అధికంగా ఉంది. రబిలో విత్తిన వరిపైరు పూర్తిగా నీట మునిగింది. తూర్పు మండలాల్లో ని పలు గిరిజన కాలనీలు జలమయమయ్యాయి.

‘జల్‌’దరించిన ఉత్తరాంధ్ర
jaala3కోస్తాంధ్ర ప్రజలను ఆందోళనకు గురిచేసిన జల్‌తుపాన్‌ ఉత్తరాంధ్రను కాస్త కనికరించింది. విశాఖ తుపాన్‌ కేంద్రం ముందస్తు హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో సఫలీకృతం కావడంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు వాటిల్లలేదు. అయితే ఆదివారం నాడు కురిసిన కుండ పోత వర్షాలు, అలల ఉధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని బారువ-కొత్తూరు తీర ప్రాంతంలో పది అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకుపోయింది. అయితే ఈమూడు జిల్లాల్లోని వాతావరణం సాధారణ స్థాయికి చేరుకోవడంతో అనేక ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రం లోకి చేపల వేటకు వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో విజయనగరం జిల్లా , భోగాపురం మండలం, చింతపల్లి ప్రాంతానికి చెందిన మత్స్యకారులు చేపలవేట ముగించుకుని తిరుగుప్రయాణంలో పడవ ఇంజన్‌ మరమ్మతులకు గురికా వడంతో సముద్రంలో చిక్కుకుపోయారు. కోస్ట్‌ గార్డు సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడంతో వారు ప్రాణపాయం నుంచి గట్టెక్కారు.

nlrఅదే విధం గా శ్రీకాకుళం జిల్లా బారువా-కొత్తూరు ప్రాంతానికి చెందిన మరో మత్స్యకారుడు బోటు పై నుంచి పడిన సంఘటన మిన హాయించి ఎలాంటి ప్రభావం కనిపించలేదని ఆ జిల్లా రెవి న్యూ అధికారులు తెలిపారు. ఈ తుపాన్‌ ప్రభావం మరో రెండు రోజులు కొనసాగే అవకాశాలు వున్న దృష్య్టా రణస్థలం, కంచి లి, టెక్కలి, పాతపట్నం తదితర ప్రాంతాల్లో సహాయక కేంద్రా లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు జిల్లాలోని సహాయక చర్యలపై నిత్యం అధికారు లతో ఫోన్‌ ద్వారా సమీక్షిస్తున్నారు. అదే విధం గా విజయన గరం జిల్లాకు చెందిన మంత్రి బొత్సా కూడా అదే స్థాయిలో జిల్లా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో కలిసి సమీక్షిస్తు న్నారు. ఇక విశాఖజిల్లాలో జల్‌ తుపాన్‌ కార ణంగా పాయక రావుపేట మండలం, బంగారమ్మపేట వద్ద సముద్రపు అలలు పది అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను స్థానిక ఎమ్మెల్యే ఆదేశా లతో సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అదే విధంగా పూడిమడక ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఐదుగురు సముద్రంలో చేపల వేటకు వెళ్లగా, వారు ఆదివారం తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో వారు ప్రయా ణించే బోటు బోల్తా పడింది.

అయితే బోటులో వున్న ఒక మత్స్యకారుడు మాత్రం మృత్యువాత పడ్డాడు. మిగిలిన వారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నగరం లోని ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న కుండపోత వర్షా నికి నగరంలోని ఒక వస్త్ర దుకాణం పూర్తిగా నేలకొరి గింది. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. అదే విధంగా కంచరపాలెం, గాజు వాక ,పారిశ్రామిక ప్రాంతాల్లోని కొండ వాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. అయితే మరో రెండు రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు వున్న దృష్య్ట వారిని ప్రత్యేక శిబిరాల్లో వుండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

‘ప్రకాశం’ బిక్కుబిక్కు
busఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన పెను తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్‌లోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు ఉధృతమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించింది. 3000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు .ఆదివారం రాత్రికి తీరం దాటుతుం డటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటు కాలం గడుపుతున్నారు. ఇప్పటికే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కరికాల వళవన్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే, ఎస్పీ నరసింహ రాజు అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో 75 లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఎటువంటి విపత్కర పరిస్థితిలోనైనా నష్టాన్ని నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల వరద నీరు మన్నెరులోకి విడుదల చేశారు.

ఉదయం ఏడు గంటల సమయంలో ప్రాజెక్టులో నీటి మట్టం 18.8 అడుగులు చేరుకుంది. సాయంత్రం 5 గంటల నుంచి సింగరాయకొండ, కందుకూరు, ఉలవపాడు, లింగసముద్రం, గుడ్లూరు మండలాల్లో భారీ వర్షంతో పాటు చలితో కూడిన ఈదురు గాలులు బలంగా వీశాయి. తీరం వెంబడి సముద్రం ఒడ్డు సుమారు ఏడు మీటర్లు కోతకు గురికాక, మరికొన్ని చోట్ల 30 నుంచి 50 మీటర్ల మేర ముందుకు వచ్చింది.

Tuesday, November 2, 2010

రాష్ట్రానికి సూపర్ సైక్లోన్ గండం! * పొంచివున్న సూపర్ సైక్లోన్?

వాతావరణ నిపుణుల అనుమానం.. ముందే అప్రమత్తం కావాలని సూచన
అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో వాయుగుండం
బంగాళాఖాతంలో బలంగా ఉన్న వాయుగుండం సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం
రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు... కోస్తాంధ్రపై పెను ప్రభావం
దీపావళి నాటికి ప్రతాపం చూపే ప్రమాదం... ఇదే జరిగితే భారీగా నష్టం
1977లో దివిసీమ ఉప్పెనకు సూపర్ సైక్లోనే కారణం

అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో వాయుగుండం
రెండు, మూడ్రోజుల్లో రాష్ట్రం వైపు వచ్చే అవకాశం
 
రాష్ట్రానికి తుపాను రూపంలో పెనుగండం పొంచి ఉందా..? ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనంతో అతలాకుతలమవుతున్న రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోందా..? దివిసీమను వణికించిన భయంకర పరిస్థితులు కోస్తాంధ్రలో మళ్లీ పునరావృతం కానున్నాయా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి ‘సూపర్ సైక్లోన్’ ముప్పు ఉందని పేర్కొంటున్నారు. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ వద్ద అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఏర్పడ్డ వాయుగుండం తీరుతెన్నులను బట్టి వీరు ఈ అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ వాయుగుండం ముందుకు కదిలి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనంలో విలీనమైంది. రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఈ పెను తుఫాన్‌కు ‘జల’ అని నామకరణం చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తుఫాను మనరాష్ట్రం వైపు రావడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పట్టనుంది. అంటే దీపావళి (ఈ నెల 5) నాటికి ప్రతాపం చూపడం ఆరంభిస్తుందన్నమాట! ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో బలంగా ఉంది. దీని కదలికను బట్టి తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల వైపు దూసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాయుగుండం పరిస్థితిని అంచనా వేస్తున్న వాతావరణ శాస్తవ్రేత్తలు ఇది ‘సూపర్ సైక్లోన్’గా మారే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే 1999 నవంబర్‌లో ఒరిస్సాలో సంభ వించిన పరిస్థితులు తలెత్తవచ్చని భావిస్తున్నారు. 1999 అక్టోబర్ 25న ఏర్పడ్డ వాయుగుండం తీవ్ర తుఫానుగా, అనంతరం సూపర్‌సైక్లోన్‌గా బలపడి నవంబర్ మూడో తేదీ వరకూ ప్రతాపం చూపింది. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. ఈ బీభత్సానికి ఒరిస్సాలో 15 వేల మంది దుర్మరణం పాలయ్యారు. 1977 నవంబర్‌లో దివిసీమ ఉప్పెనకు కూడా సూపర్ సైక్లోనే కారణం. అయితే ప్రస్తుతం అంతటి తీవ్రత దీనికి లేకున్నా రానున్న ప్రమాదాన్ని తక్కువగా చూడలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా ఎలాంటి ప్రభావం చూపని అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాలతోనే ఈశాన్య రుతుపవనాలు రెచ్చిపోయి కుంభవృష్టి వర్షాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అలాంటిది రుతుపవనాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్న తరుణంలో వచ్చే పెను తుపానుతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో పలుచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనికి గంటకు 80 కిలోమీటర్లకు పైగా వేగంతో పెనుగాలులు తోడుకానున్నాయి. మరోవైపు ఈ పెనుతుపాను వారం రోజుల్లో తమిళనాడుకు ఉత్తరంగా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీర ప్రాంతాన్ని తాకుతుందని స్కైమెట్ అంచనా వేస్తోంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో అనేకచోట్ల రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు కొద్దిపాటి భారీ వర్షాన్ని కూడా భరించే స్థితిలో ఇవి లేవు. ముందున్న ముప్పును అంచనా వేసిన ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లను ఈ నెల 9 వరకూ కొనసాగించాలని ఆదేశించింది. తుపాను ప్రభావం చూపడానికి ఇంకా రెండు, మూడు రోజుల సమయం ఉండటంతో పూటుగా నిండిన చెరువులు, కరకట్టల గట్టులను యుద్ధ ప్రాతిపదికన పటిష్టం చేయాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. తాగునీటిని, మందులను నిల్వ చేయాలని ఆంధ్రా వర్సిటీ వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు గౌరవ ప్రొఫెసర్ ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ సూచించారు.

సూపర్ సైక్లోన్ అంటే..?
వాతావరణంలో అల్పపీడన ద్రోణి నుంచి సూపర్ సైక్లోన్ ప్రస్థానం మొదలవుతుంది. ద్రోణి బలపడి అల్పపీడనంగా మారుతుంది. అది వాయుగుండంగాను, తీవ్ర వాయుగుండంగానూ రూపాంత రం చెందాక తుఫాను అవుతుంది. ఇది బలపడితే తీవ్ర తుఫాను, మరింత తీవ్రమైతే సూపర్ సైక్లోన్‌గా మారుతుంది. అల్పపీడనంగా ఉన్నప్పుడు గాలుల వేగం గంటకు 30 కిలోమీటర్ల లోపు, వాయుగుండంగా మారితే 30-49 కిలోమీటర్లు, తీవ్రవాయుగుండానికి 50-61, తుఫానుకు 62-87, తీవ్ర తుఫానుకు 88- 117, అతి తీవ్ర తుపానుకు 118-220, సూపర్ సైక్లోన్‌కు 222 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ సమయంలో పక్కా ఇళ్లు, భారీ వృక్షాలు కూడా నేలమట్టమవుతాయి. 20 సెం.మీలకు పైగానే వర్షపాతం నమోదవుతుంది. సూపర్ సైక్లోన్ సమయంలో సముద్రంలో అలల ఉధృతి 14 మీటర్లకు పైనే ఉంటుంది.

Sunday, October 3, 2010

కలల ప్రపంచంలోకి... సరికొత్త ఆలోచనకు స్ఫూర్తి


పారిస్ పట్టణ ప్రజలకు ‘పాల్ కౌడమీ’ అంటే బోలెడంత ఇష్టం. ఇతగాడి ఆలోచన ఉంటే చాలు - ఎంచక్కా కలల ప్రపంచంలోకి దొర్లిపోవచ్చన్నది జనం మాట. హాయిగా నిద్రపోతూ ఈ లోకానే్న మర్చిపోవచ్చునంటార్ట. కొంపతీసి - ఇతగాడు ‘హిప్నటైజ్’ చేసో.. జోలపాట పాడో నిద్రపుచ్చుతాడా? అంటే అవేవీ కాదు. మీ బెడ్‌రూంని అందంగా డిజైన్ చేస్తాడు. మీ మనస్తత్వానికి తగ్గట్టు. పారిస్‌లో పావువంతు ఇళ్లు ఇతను డిజైన్ చేసినవే. తన ‘ఆర్ట్’తో జనాన్ని నిద్రపుచ్చటం ఇతనికి జోలపాటతో వచ్చింది. ఆఫీసులనూ పడగ్గదులనూ.. హాల్స్‌నూ - విభిన్న తరహాలో డిజైన్ చేసి జనాన్ని మెప్పించటమే కాదు.. పాత గుహల్లోకి సైతం తీసికెళ్లగలడు. బెడ్‌రూంని ‘ఎలుగుబంటి గుహ’గా మార్చేయగలడు. ఉరికే జలపాతం బెడ్‌రూంని తడిపేయనూ వచ్చు. అందంగా అమరిన ‘కీ బోర్డ్’ కాస్తంత తడిసి కరిగి గోడల నుంచీ జాలువారనూ వచ్చు. లేదా మరొకటి మరొకటి... మీ ఆలోచన ఏమిటో చెప్పండి. దానికి తగ్గట్టు ఉన్నది ఉన్నట్టుగా క్షణాల్లో మార్చివేస్తాడు. దీనికి అంత ఖర్చూ ఉండదు. భవన నిర్మాణంలో మిగిలిపోయిన రాళ్ల ముక్కలూ.. చిప్స్.. విరిగిన టైల్స్.. ఏవైనా కావొచ్చు. వాటిని భద్రంగా మీరు ఇంటికి తెచ్చుకోగలిగితే చాలు. ఇక మీ పనై పోయినట్టే.





ఓ రోజు ఖాళీగా కూర్చుని ఆలోచిస్తూంటే - బెడ్‌రూంలో ఓ మూలగా ‘కలర్’ అంటి ఉండటం గమనించాడు. తుడిపేద్దామని ప్రయత్నించాడు. పోలేదు. దాంతో ఆ గోడపై మరిన్ని ‘కలర్’ మరకలు వేశాడు. ‘మరక మంచిదే’ అన్న కానె్సప్ట్‌కి తగ్గట్టు తయారైందా గది. రోజులూ వారాలూ గడిచాయి. బెడ్‌రూమంతా రంగుల కలగా మారిపోయింది. ఇదేదో బాగుందే?! అనుకొని అప్పట్నుంచీ ‘గ్రాఫిక్ డిజైన్స్’ చేయటం మొదలుపెట్టాడు. అలా అలా అది పారిస్ అంతా పాకింది. ఇంటీరియర్ డిజైన్లకు పాల్ పెట్టింది పేరైంది. ఇదే బాటలో స్వీడిష్ గ్రాఫిక్ డిజైనర్ లిసా బెంగ్‌ట్సాన్ కూడా బెడ్‌రూంని ఫొటో ఫ్రేమ్‌లతో నింపేశాడు. అవన్నీ జ్ఞాపకాల పొరలు. ఏళ్ల తరబడి ఆల్బమ్‌లలో శిథిలమై పోతున్న జ్ఞాపకాలు అలా గోడలపై వేలాడటం సరికొత్త ఆలోచనకు స్ఫూర్తిని అందించింది.

-హేమ


కాఫీ ఏనాటిది?


కొన్నికొన్ని పరిశోధనలు ఎవరి ఆలోచనల్లో మెదిలినవో తెలీకుండానే ప్రపంచానికి సరికొత్త అధ్యాయానికి తెర తీస్తాయి. అటువంటి వాటిల్లో ‘కాఫీ’ ఒకటి. పొద్దున లేస్తూనే ఘుమఘుమలాడే ‘కాఫీ’ పరిమళాలను ఆస్వాదించని వ్యక్తి లోకంలోనే ఉండరు. కానీ ‘కాఫీ’ సిప్‌ని మొట్టమొదటిసారిగా ఎవరు చేసి ఉంటారు అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. కొన్ని వేల ఏళ్ల క్రితం - అబిస్సినియన్ జాతుల వారికి ‘బెర్రీ’ గింజలు లభ్యమయ్యాయి. ఇవి చూట్టానికి అలానే ఉండటంవల్ల వాటికి ఆ పేరు వచ్చింది. రుచిగా.. మనసుకి హాయినిచ్చేదిగా.. పరిమళ భరితంగా ఉన్న ఈ గింజలను ఆయా తెగలు తింటూండేవారు. అప్పటికి కాఫీ అన్న పదం పుట్టలేదు. అలా తూర్పు ఆఫ్రికన్లు మొట్టమొదటిసారిగా ఆ గింజలను ‘టేస్ట్’ చేశారు. క్రీ.శ.15వ శతాబ్దం నాటికి ఆ రుచి దక్షిణ అరేబియా వరకూ పాకింది. ఇప్పుడు మనం ‘రుచి’ చూస్తున్న కాఫీ గింజలు 200 ఏళ్ల నాటివే. వీటిని యెమెన్‌లో పెంచారు. క్రీ.శ.19వ శతాబ్దంలో జావాలో డచ్ వారు ఈ పంటను పెంచ నారంభించారు. అక్కడ్నుంచీ జమైకా ద్వీప సముదాయాల్లోనూ.. మధ్య.. దక్షిణ అమెరికాలకు పాకింది. యూరోప్‌లోనూ.. అమెరికాలోనూ ‘కాఫీ’ జీవితంలో ఒక భాగమైంది. నేడు ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యే కాఫీ పంటలో 3/4 వంతు బ్రెజిల్‌దే. ఎందుకంటే - ఇక్కడ కాఫీ పంటకు అనుకూల వాతావరణం ఉంది. ఇక వెనిజులా, కొలంబియా, గుటిమాలా, మెక్సికో, వెస్టిండీస్, జావా తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తాయి. నేడు ‘కాఫీ’లో బోలెడన్ని వెరైటీలు. వాటిలో ‘మోకా’ ‘జావా’ ‘రియో’ ‘సాంటోస్’ ప్రసిద్ధి గాంచాయి.

- హెచ్


తపనే ‘వెల్త్’!


కామన్‌వెల్త్ క్రీడలను పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన ‘కామన్‌వెల్త్ ఆన్ వీల్’ పోటీల్లో విస్మయానికి గురిచేసిన అంగవికలుల భరతనాట్య ప్రదర్శన.

గిన్నిస్ ఎడిటర్ మెచ్చిన గిన్నిస్ రికార్డు

పెద్ద ఆవు పక్కన నిలబడిన ఈ చిన్న ఆవు పేరు స్వాలో. ఇది ఎంత చిన్న ఆవు అంటే గొర్రెకంటే తక్కువ ఎత్తులో ఉంటుంది. ఎత్తు కేవలం 33.5 అంగుళాలు (0.8 మీటర్). పదకొండేళ్ల ఈ ఆవు ఇప్పటికే తొమ్మిది దూడలకు జన్మనిచ్చింది. తాజాగా అతిచిన్న ఆవుగా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. చాలా విషయాలు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కుతుంటాయి. అయితే, ఈ ఆవు మాత్రం గిన్నిస్ బుక్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెండే మనసు దోచింది. తాజాగా నమోదైన మూడువేల గిన్నిస్ రికార్డుల్లో క్రెయిగ్‌ను ఈ విషయం బాగా ఆకట్టుకుందని బీబీసీ పేర్కొంది.

సంబరాల స్వాతంత్య్రం !


విచిత్ర వేషధారణలో పొడవైన బూరలు ఊదుతూ కొనసాగుతున్న ఈ ఊరేగింపు మెక్సికోలోది. మెక్సికన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుక జరిగింది. ఇది మెక్సికన్లకు 200వ స్వాతంత్య్ర దినోత్సవం కావడం విశేషం. 1810 సంవత్సరానికి ముందు స్పెయిన్ పాలనలో ఉన్న మెక్సికన్లు సుమారు పదేళ్లు పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నారు.

బురక్రొద్దీ ఐడియా


సమస్య చూసే కోణాన్ని బట్టి పరిష్కారం ఉంటుంది. ఈ చిత్రం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బురిగంగా నదిపై తీసినది. నదిని దాటడానికి బ్రిడ్జి లేకపోవడంతో అక్కడ పడవలు వాడేవారు. అయితే, గురప్రు డెక్క విపరీతంగా పెరిగిపోయి పడవ ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో స్థానికులు ఇలా పడవలన్నింటినీ ఒకదానిపక్కన ఒకటి వేసి వంతెనలాగా తయారుచేసుకున్నారు. ఆలోచించాలే గాని పరిష్కారాలకు ఏం కొదవ చెప్పండి!

Saturday, September 25, 2010

పొడుపు ప్రశ్నలు

సర్దుకుపోయే మనిషి

నీకు నిజాలు తెలుసుకునే హక్కు కావాలా? అబద్ధాలు వినే శక్తి కావాలా?
అబద్ధాలు తెలుసుకునే హక్కు, నిజాలు వినే శక్తి ఇచ్చినా పర్వాలేదు.

లెక్కమంతుడు

ఎన్ని అబద్ధాలు కలిస్తే ఒక నిజం అవుతుంది?
రెండు అబద్ధాలు పోట్లాడుకుంటే ఒక నిజం అవుతుంది.


భాష్యకారుడు

స్వార్థానికి మంచి అర్థం ఎప్పుడొస్తుంది?
అర్థం అంటే డబ్బు ఒక్కటే కాదని తెలిసినప్పుడు.

సూక్ష్మగ్రాహి

మూడు పూవులు ఆరు కాయలని ఎందుకు అంటారు?
ఆడవాళ్లు జనాభాలో సగమే కదా!

దయార్ద హృదయుడు

మనిషి మెదడును ప్రింటర్‌కు కనెక్ట్ చేస్తే ఏమవుతుంది?
పాపం! నల్లటి కాగితాలు ఎన్నని చదువుతారు అందరూ.

యదార్థవాది

మంచివాళ్లు ఉండబట్టే వర్షాలు ఇంకా పడుతున్నాయని, పంటలు ఇంకా పండుతున్నాయని ఎందుకంటారు? వాళ్ల అవసరాలు అంత ఎక్కువా?
ఎక్కువ వానలు కురిసి ఎక్కువ పంటలు పండకపోతే మిగతావాళ్లు వాళ్ల కడుపు మాడ్చి చంపేయరూ.

Tuesday, September 7, 2010

8 - 9 - 10 వెయ్యేళ్లకోసారి * ఇది బుధవారమే ప్రత్యేకత!

 8.. 9.. 10.. ఇదేంటీ..!? వరుసగా అంకెలు లెక్కబెడుతున్నారు అనుకుంటున్నారా!? అదేం కాదు. నేటి బుధవారానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇదో అరుదైన రోజు. ఈరోజు తారీఖు 8. ఈనెల సెప్టెంబర్ అంటే, 9. ఈ ఏడాది 2010, అంటే 10. ఈరోజు ఎవరు సంతకాలు చేసి తేదీ వేయాల్సి వచ్చినా వరుసగా ఎనిమిది, తొమ్మిది, పది వేయాల్సిందే! ఈ అంకెలు ఇలా వరుసగా రావడం వెయ్యి సంవత్సరాలకు ఓసారి వస్తుంది.

ఇక, ఈ తేదీల కలయిక చాలా మంచిదని సంఖ్యా శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఎందుకంటారా.. ఈ మూడింటినీ కలిపితే 27. ఆ రెండు అంకెలనూ కలిపితే 9. ఇది అందరికీ మంచి సంఖ్యేనని వారు వివరిస్తున్నారు. అందరికీ కలిసొచ్చే ఈ సంఖ్య వల్ల ఈ రోజంతా శుభమే కలుగుతుందని చెబుతున్నారు.  

Monday, September 6, 2010

వర్మగారొక మర్మయోగి

(సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ. 'రక్తచరిత్ర' నేపథ్యంలో ఓబుల్‌రెడ్డి అనుచరులు తనని బెదిరించారన్న వర్మ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు' సినిమా పాటలో తెలుగు దర్శకులందరినీ విమర్శించి హాట్‌టాపిక్ అయ్యారు. మరి ఆయన గురించి నటుడు ఎవిఎస్ తన బ్లాగ్‌లో ఏం రాసుకున్నారో చదవండి)

రామ్‌గోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం. నిస్సందేహంగా గొప్ప దర్శకుడు. తెలుగు వాళ్లు గర్వించదగ్గ జాతీయ స్థాయి పర్సనాలిటీ. తెలుగు సినిమాలకో ట్రెండ్ నేర్పిన సంచలన సాంకేతిక నిపుణుడు. ఆయనలోని దర్శకుడి ప్రతిభా పాటవాలకు ఎన్నో సినిమాలు ఉదాహరణగా నిలిచాయి. ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్... గ్లామర్... నిరీక్షణ.. ఇది అందరికీ సాధ్యం కాని పని.

కాని ఇటీవలి కాలంలో వర్మలోని దర్శకుడిని బిజినెస్‌మాన్ డామినేట్ చేస్తున్నాడు. సినిమాను ఎలా అమ్ముకోవాలి.. ఎలా బయ్యర్లను ఆకట్టుకోవాలి... రిలీజుకు ముందే సినిమాను ఎలా సెన్సేషన్ చేసుకోవాలి.. అన్న వాటి మీదనే వర్మ గారి దృష్టి యావత్తూ ఉందనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ వినిపిస్తున్న విమర్శ. ఇంతకుముందు వర్మ సినిమాలు రిలీజుకు ముందు నిశ్శబ్దంగా ఉండి రిలీజు తరువాత సంచలనాలను సృష్టించేవి.

ప్రస్తుతం రిలీజుకు ముందు సంచలనాలు సృష్టించి రిలీజు తరువాత నిశ్శబ్దంగా ఉంటున్నాయి. ప్రతి సినిమాకు ముందు ఏదో ఒక వివాదం. అవి నిజమే అయినా తరచూ జరుగుతుండటం వల్ల చూసేవాళ్లకు.. వినేవాళ్లకు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక గొప్ప దర్శకుడి సినిమాలకు ఈ తరహా వివాదాలు అవసరమా? అన్న ప్రశ్న నాలాంటి చాలామంది అభిమానులను బాధకు గురిచేస్తోంది. తమ సినిమాలను బిజినెస్ చేసుకోవటం ఎవరికైనా అవసరమే.. కాదనలేము. కాని రాంగోపాల్ వర్మ లాంటి అత్యున్నత దర్శకుడికి ఆ అవసరం లేదన్నది నా అభిప్రాయం.

పోనీ అంతే మేరకు ఆయన సినిమాలు విజయాలను పొందుతున్నాయా? అంటే అదీ లేదు. వర్మ గారి లెక్కలు ఏమిటో తెలుసుకోవాలంటే ఆ మర్మం ఏమిటో అర్థం చేసుకోవాలంటే అందరివల్లా కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. వర్మ గారిని అర్థం చేసుకోవడంలో నేను ఫెయిలయ్యానని ఎవరయినా భావిస్తే నేను చేయగలిగిందేమీ లేదు.
- ఎవిఎస్, ఉ. 9.32, సెప్టెంబర్ 3, 2010

Sunday, September 5, 2010

సేమియా బచ్చలి బొండా

కావలసిన పదార్థాలు
సేమియా - ఒక కప్పు, శనగపిండి - ఒక కప్పు, గోధుమ పిండి - ఒక కప్పు, మినుములు - ఒక కప్పు, క్యారెట్‌లు - రెండు, బచ్చలి ఆకులు(సన్నగా తరిగినవి) - ఒక కప్పు, ఉల్లిపాయలు - మూడు, పచ్చి మిరపకాయలు - మూడు, కొత్తిమీర- ఒక కట్ట, కరివేపాకు - మూడు రెబ్బలు, వంటసోడా - చిటికెడు, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.

తయారుచేయు విధానం
సేమియాను ఒక గంట పాటు నానబెట్టిన తరువాత నీళ్లు వంపేసి పెట్టుకోవాలి. మినుములను కూడా ఒకగంట ముందుగా నానబెట్టి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. క్యారెట్‌లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో ఈ పదార్థాలన్నింటినీ వేసి కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలి.

కొత్తిమరీ, కరివేపాకు, వంటసొడా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఒక పాత్రలో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. పిండిని బొండాల మాదిరిగా చేసుకుంటూ నూనెలో వేసుకొని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంతే..సేమియా బచ్చలి బొండాలు రెడీ.
- కె. మంజుల, తిరుపతి.

Thursday, August 26, 2010

వారు నా కంటే అందగత్తెలు - జయసుధ

ఇంక ఈర్ష్య, పోటీ ఎందుకు?
ఏఎన్నార్‌తోనే సౌలభ్యంగా ఉండేది
జగన్ వెంటే ఉంటా.. జీసస్‌ను చూశా...
-    జయసుధ
సినీ వినీలాకాశంలో ఆమె సహజనటి... ఇప్పు డు రాజకీయాల్లోకి వచ్చాక ఆ స్థాయిలో నటించలేకపోతున్నానని చెబుతున్నారు. ఇక్కడ అంతకంటే సహజ నటులున్నారని అంటున్నారు. తాను ఏదీ ప్రణాళిక ప్రకారం చేయలేదని, నటిగా అయినా, ఇప్పుడు ఎమ్మెల్యేగా మారినా అన్నీ అనుకోకుండా జరిగినవేనని పేర్కొన్నారు. తనకు టెన్నిస్ ఆడాలనే కోరిక మాత్రం ఇప్పటి దాకా తీరలేదంటున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, నటి జయసుధ ...


సినీ, రాజకీయ జీవితాల మధ్య తేడా ఎలా ఉంది?
రాజకీయాల్లో ఇంకా ఇమడలేదు. ప్రతి రోజూ ఏదో ఒక విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. కొన్ని రాజకీయ చిత్రాల్లో చూసినప్పుడు నిజంగా అలా ఉంటుందా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే దాదా పు అలాగే ఉంది. అంత మెలో డ్రామా కాకపోయినా దాదాపు 75% అలాగే ఉంది. సినిమాల్లో నటించేంత తేలిక కాదంటే... రాజకీయాలను అలా మార్చేశా రు. మన చేతిలో ఏమీ లేదు. త ప్పు మనది కాకపోయినా మన ల్నే అడుగుతారు. అయితే, ప్రజ లు ఎన్నుకున్నందున వాటిని ఎ దుర్కొనేందుకు సిద్ధపడాల్సిందే.


క్రైస్తవ మతం ఎందుకు తీసుకున్నారు?
1985లో బ్యాంకాక్‌లో ప్రమాదానికి గురైనప్పుడు జీసస్‌ను తలచుకున్నాను. అప్పటి నుంచి అలా నమ్మకం ఏర్పడింది. ఏసును అప్పుడు నేను చూశాను. ఏసుక్రీస్తుతో మనసులో మాట్లాడుతూనే ఉంటాను. 2001లో మతం పుచ్చుకున్నాను.


రాజకీయాల్లో మీకంటే సహజ నటులు తారసపడి ఉంటారు?
అబ్బో చాలామంది ఉన్నారండీ. చాలా సన్నివేశాల్లో నేను అవాక్కయిపోయాను కూడా. మన దగ్గర ఒకలా మాట్లాడి, వేరే చోట ఇంకోలా మాట్లాడటం... ఇది రాజకీయ సాంప్రదాయం అనుకోవాల్సిందే. మంత్రిగా అవకాశం ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పలేదు. ఈ రాజకీయాల్లో ఇమడలేకపోతే రాజీనామా చేస్తానని చెప్పాను. అది పత్రికల్లో మరోలా వచ్చింది.


ఎమ్మెల్యేగా కాకుండా జయసుధగా గడచిన పది నెలల పరిణామాలు ఎలా అనిపిస్తున్నాయి?
మొదటి నుంచి చూస్తున్నారు కదా.. జగన్‌కు మేం మద్దతు పలకడం. ఇప్పుడు కూడా దాంట్లో మార్పు లేదు. జయసుధగా ఉండటం ముఖ్యం.. రాజకీయాలు కాదు. వైఎస్ తీసుకొస్తేనే వచ్చాను. పార్టీ నుంచి జగన్ వెళ్లిపోతే ఆయనతోనే ఉంటాను.


జయప్రదతో మీ పోటీ ఎలా ఉండేది?
జయప్రద, శ్రీదేవిలా అందంగా ఉండాలని కోరుకోలేదు. కథ చెప్పేటప్పుడు మాత్రం ఇద్దరు హీరోయిన్లుంటే నా క్యారెక్టర్ చనిపోవాలని పట్టుబట్టే దాన్ని. అందరం స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. నాకంటే వాళ్లు అందంగా ఉంటారు. అలాంటప్పుడు ఇంకెందుకు ఈర్ష్య? పద్మశ్రీ అవార్డు సైఫ్ అలీఖాన్‌కు ఇచ్చారు కదా... నేను ఇప్పుడు ప్రయత్నించవచ్చు. అయితే, కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిందనిపించుకోవడం ఇష్టం లేదు.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లలో ఎవరితో సౌలభ్యంగా ఉండేది?

నాగేశ్వరరావు గారితోనే. ఆయన చాలా సరదాగా ఉంటారు. చాలా విషయాలు ఆయన నుంచి నేర్చుకున్నాను. రామారావు గారి దగ్గరకొచ్చే సరికి అంతా భయపెట్టేసేవారు. అలాంటిది ఆయనకు క్రికెట్ పిచ్చి పట్టించాను. మన హీరోలతో ఎప్పుడు ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇక్కడి హీరోలు చాలా మంచివారు. కమల్, నన్ను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు. ఎక్కువ చిత్రాల్లో చేశాం. ఆ తర్వాత అంతా వదిలేశారు. రాజకీయాల కోసం సినిమాలను త్యాగం చేయాల్సిన అవసరం లేదు. క్రీడలంటే నాకు ఇష్టం. నేను కోరుకోకుండానే చాలా జరిగాయి. టెన్నిస్ ఆడాలని ఉంది. కానీ, ఇప్పుడది కుదరదేమో..?!


మూడు దశాబ్దాలు తెలుగు రాకుం డా ఎలా రాణించగలిగారు?
నేర్పించడానికి ప్రయత్నించారు గానీ, రాలేదు. ఆ రోజుల్లో టీవీలు లేకపోవడంతో బతికిపోయాను. లేకపోతే నా గురించి చాలా తెలిసిపోయేది. డైలాగులు విని చెప్పడం అలవాటైపోయిందంతే... జ్యోతి చిత్రం తర్వాత వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండాపోయింది. సినిమాల్లో కూడా ముందు నాకు ఆసక్తి లేదు. మంచి పాత్రలు రావడం నా అదృష్టం. రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చేది.

Wednesday, August 25, 2010

ఒకటే జననం... ఒకటే మరణం - జయహో.. విజయగాధలు: పద్ధతులు - 1

అసాధ్యాలంటూ ఏమీ ఉండవేమో, స్ఫూర్తితో కొన్ని పద్ధతులను అవలంబిస్తే...

*** మనసుంటే మార్గముంటుంది; పర్‌ఫెక్ట్ చదువు, పర్‌ఫెక్ట్ ఉద్యోగం అవసరం లేదని నిరూపించాడు నోబెల్ బహుమతి విజేత సర్ సి.వి.రామన్

*** కలలకు గమ్యాలకు ఉన్న శక్తి సామర్థ్యాలేమిటో ప్రపంచానికి చాటిచెప్పిన మరో విశిష్ట భారతీయుడు; మన దేశంలో హరిత విప్లవానికి నాంది పలికి, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా దారి మళ్ళించిన విజేత - ఎం.ఎస్.స్వామినాథన్.

*** విల్మా రుడాల్ఫ్
అమెరికన్ వనిత. నల్లజాతికి చెందినది.
1940లో పుట్టిన ఆమెకు సంవత్సరం తిరిగేలోగా పోలియో సోకింది.
డాక్టర్లు ఇక ఆమె నడవలేదని తేల్చి చెప్పారు.
ఇరవై ఏళ్ళ తర్వాత 1960లో జరిగిన ఒలంపిక్స్‌లో విల్మా రుడాల్ఫ్ మూడు గోల్డ్ మెడల్సు గెలుచుకుంది. వాటిలో రెండు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి.
ఇది కల కాదు.
కథ కాదు
యాభై ఏళ్ళ క్రితం జరిగిన చరిత్రలోని ఒక పుట.
ఇది చదివాక అసాధ్యాలు అంటూ ఏవైనా ఉంటాయని మీరింకా భావిస్తూ ఉంటే, తీరిగ్గా కూర్చొని పునరాలోచన చేయండి

*** నేనెవర్ని?
నాలో దాగి ఉన్న ప్రజ్ఞ ఏమిటి?
ఏ పనిలో నేను నిష్ణాతుణ్ణి??
ఏ పని నన్ను ఆనంద డోలికల్లో ముంచెత్తుతుంది??
స్వశక్తిపై నమ్మకాన్ని, ఎన్నుకొన్న రంగంలో అపారమైన కృషి చేసి, నిష్ణాతుడిగా మారి దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు గడించిన కర్సన్‌బాయ్ పటేల్ సృష్టి 'నిర్మా' వాషింగ్ పౌడర్. ఆయన జీవిత గాథ, విజయాలు మనందరినీ ఉత్తేజపరిచేవే!
మనందరికీ మార్గదర్శకాలే!

*** ఈ విజేతలందరూ సామాన్యులే
ప్రేరణే వారి బలం. పద్ధతులు వారి ఆయుధాలు

*** రే క్రాక్
వయస్సు: 52
అమెరికన్
డయాబిటీస్ ఉంది.
ఆ్రర్దయిటిస్ కూడా ఉంది
గాల్ బ్లేడర్ తీసేసారు.
థైరాయిడ్ గ్లాండ్‌లోని చాలా భాగం కూడా తీసేసారు.
"అయినప్పటికి నా భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుందనే నమ్మకం నాకుంది''.
రే క్రాక్ అన్నమాటలివి.
అన్నమాటలే కాదు. చేసి నిరూపించాడు తనకీ, యావత్ ప్రపంచానికి.
నేటి మెక్‌డొనాల్డ్స్ సంస్థ నిర్మాణంలో మూలస్థంభం లాంటి వ్యక్తి ఈ రేక్రాక్ మహాశయుడే.
ఈ ప్రస్థానం మొదలైంది ఆయన 52వ ఏట. రకరకాల ఆరోగ్య సమస్యల వలయంలో ఉన్నప్పటికీ రే క్రాక్ తన గమ్యాలను వీడలేదు. అనుకున్నది సాధించాడు.

*** ఇలా ఎన్నో గాథలు. అన్నీ స్ఫూర్తినిచ్చేవే. మనల్ని కార్మోన్ముఖులుగా మార్చేవే.
రాబోయే వారాల్లో వీరి గురించి, ఇంకా పలువురి గురించి వివరంగా ముచ్చటించుకుందాం.
విజయానికి మార్గాలేవో మనమూ కనుగొందాం!
ఈ నా రచనకి మూలకారణమైన ప్రస్థానానికి నాంది పలికిన రోజు నాకింకా ఎంతో స్పష్టంగా గుర్తుంది.
31 అక్టోబర్ 1968
ఆ రోజు రాత్రి చేతిలో ఒక పాత ఇనప్పెట్టె, అందులో రెండు మూడు జతల బట్టలు, జేబులో నూట యాభై రూపాయలు, గుండెల్లో భయం, మనస్సులో వేయి కోరికలతో హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌లో రాత్రి 7.55కి బయల్దేరాల్సిన బాంబే ఎక్స్‌ప్రెస్‌లో ఒక థర్డ్‌క్లాస్ డబ్బా ఎక్కాను. అన్నీ తెలియని ముఖాలు. ఊహకందని భవిష్యత్తు.
29 నవంబరు 2009న తిరిగి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ నివాస మేర్పరచుకోవటానికని.
నలభై ఒక్క సంవత్సరాలు.
ఆ పైన ఇరవై ఎనిమిది రోజులు.
జీవితంలోని ముఖ్య భాగమంతా అహ్మదాబాద్‌లోనే గడచిపోయింది.
నేను అహ్మదాబాద్‌లో అడుగు పెట్టినప్పటి పరిస్థితులకి, తిరిగి హైదరాబాద్ రావటానికి వీడ్కోలు చెప్పిన నాటికి ఒక గొప్ప తేడా ఉంది.
ఆనాడు, తమ ప్రకటనల కోసం గుజరాత్‌లోని పలు వ్యాపార సంస్థలు బాంబేలోని అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీలకు ఆ బాధ్యతలను అప్పచెప్పుతుండే వారు.
1980 దశకంలో అది పూర్తిగా ఆగిపోయింది. అహ్మదాబాదులోని ముద్రా స్థాపనతో.
1990 దశకానికల్లా దేశంలోని నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా అడ్వర్‌టైజింగ్ రంగంలో ఉన్నత విద్య నభ్యసించటానికి విద్యార్థులు అహ్మదాబాద్‌కి రావటం మొదలుపెట్టారు. మైకా స్థాపనతో (మైకా: ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహ్మదాబాదు) నేడు ఇది అంతర్జాతీయంగా పేరుపొందిన విద్యా సంస్థ.
ఎలా జరిగాయి ఈ అద్భుతాలన్నీ..
-ఎజి కృష్ణమూర్తి

ఇష్టం కనిపెట్టడమే కష్టం... జయహో.. విజయగాధలు: పద్ధతులు-2

ఇష్టమైన పనిని మనందరం కష్టపడి చేస్తాం అని మనందరికి తెలుసు.
ఆ ఇష్టమైన పనేదో మనకెప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది ??
కొంతమందికి తల్లిదండ్రులు స్ఫూర్తినిచ్చి, వారి వృత్తే పిల్లలకు ఇష్టమైన వృత్తిగా మారేలా చూస్తారు. మనలో చాలా మందికి రోల్ మోడల్స్ మన తల్లిదండ్రులే కదా.
కొంతమంది దురదృష్టవంతులకి ఇది వర్తించకపోవచ్చు. తల్లిదండ్రులు నేరస్తులయితేనో, లంచగొండులయితేనో..
పైన ఉదహరించుకొన్న కోవకి చెందిన వారు - డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు తదితరులు.
వీరికి వంశపారపర్యంగా వస్తున్న కుటుంబ వృత్తి వ్యాపారాలు ఆదర్శప్రాయంగా, ఆచరణీయంగా మారి, ఎంచుకున్న వృత్తి ఇష్టపడే వృత్తి ఒకటిగానే ఉండిపోతాయి. వీరికి ఏ చిక్కూ లేదు.
తండ్రిదో ఉద్యోగం, పిల్లలవి వేరువేరు...
మా నాన్న గారు హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. మా అన్నయ్యా హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోనే. చిన్నతనంలోనే మా అన్నయ్యకి నాన్న గారి వృత్తి మీద అభిమానంవల్లో లేక మా నాన్న గారి ప్రోద్భలంవల్లో ఆ రంగంలో చదువుకొని ఉద్యోగస్తుడయ్యాడు. ఆ రంగంలోనే రిటైర్ అయ్యాడు. తనకు ఆ రంగమంటే అసహ్యమని మా అన్నయ్య చెప్పగా నేనెన్నడూ వినలేదు.

ఇక నా విషయానికొస్తే, నా కిష్టమైన రంగమేంటో తెల్సుకోవటానికి చాలా సంవత్సరాలు పట్టింది. చాలా ప్రయోగాలు చేశాను. విద్యార్థిగా కనీసం ఇంజనీరింగ్ చదువుకోవాలనే గాఢమైన కోరికుండేది. కనీసం అని ఎందుకన్నానంటే, అసలైన కల డాక్టర్ కావాలని. నిజానికి ఆ రోజుల్లో అంతే 1950 దశకం నుంచి 1990 దశకం దాకా ప్రతి వాడికి డాక్టరో, ఇంజనీరో కావాలనే కోరిక తప్ప మరేది ఉండేది కాదేమో. నేటిలాగా పలు రంగాలు అభివృద్ధి చెందలేదు. పరిమితమైన జీవితాలు - ఇంకా పరిమితమైన చదువులు. ఇంకా ఇంకా పరిమితమైన అవకాశాలు. ఈ అవకాశాలు అదృష్టవంతులకు మాత్రమే లభ్యమవుతాయన్న ఒక బలమైన నమ్మకం కేవలం నాకే కాదు, ఆ నాటి సమాజంలో గాఢంగా పాతుకుపోయిందేమోననిపిస్తుంది.

"పెట్టి పుట్టాలి''
"చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా''
ఇలాంటి సామెతలు తరచుగా వింటుండే వాణ్ణి. ముఖ్యంగా మా అమ్మ ద్వారా.
బీదరికం
తరతరాలుగా వస్తున్న బీదరికం కాదు.
"మా నాన్న గారు పుట్టినపుడు 1901లో వారిది గుంటూరు జిల్లాలోనే ఒక సంపన్న కుటుంబం''.
'బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్' అంటామే - వాడికేమయ్యా, ఆగర్భ శ్రీమంతుడనో లేక నోట్లో బంగారు చెంచాతో పుట్టాడయ్యా అనో అంటామే - ఆ కోవకి చెందిన వారు మా నాన్న గారు.

పురిట్లోనే తల్లిని కోల్పోయారు మా నాన్నగారు. కొన్నేళ్ల తర్వాత భోగభాగ్యాలు కూడా, ఎందుకయ్యా అంటే, మా తాత గారు ఆనాటి సమాజంలోని పదుగురిలా అబద్దం చెప్పని సీదాసాదా వ్యాపారస్థుడు. పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారం. లక్షల్లో స్టాక్ కొని గిడ్డంగుల్లో నింపారు. సడన్‌గా రేట్లు పడిపొయ్యాయి. బాకీలు పెరిగాయి. కోర్టు కేసులు. ఒక్క అబద్దం చెబితే యావదాస్థి నిలిచేది. ఊహు.. ఆ మహానుభావుడు నిజం చెప్పాడు కోర్టులో యావదాస్థి తనదేనని.. తనది కాదు, తమ్ముడిదని చెప్పుంటే ఆస్తి జప్తు జరిగేది కాదు.
మాటే ప్రాణంగా భావిస్తున్న రోజులవి. విలువలకి సర్వం కోల్పోవటానికవి సిద్దమయిన రోజులవి.

మా తాత గారు అబద్దం చెప్పలేదు. ఆస్థి నిలువలేదు.
మా నాన్న గారి నోట్లోని బంగారు చెంచా సడన్‌గా సత్తు
చెంచాగా మారిపోయింది.
జీవన పోరాటం మొదలైంది. చిన్న ఉద్యోగం.
ఆనాటి అందరి లాగే పెద్ద కుటుంబం. మేము నలుగురు అన్నదమ్ములం, ఒక చెల్లెలు. నాది రెండో నంబరు.
పుట్టింది వినుకొండలోనైనా నా చిన్ననాటి జ్ఞాపకాలన్ని తెనాలి, బాపట్ల లోనివే. తెనాలిలోని మారీస్ పేటలో ఉండేవాళ్ళం. పూరింట్లోని ఒక భాగం అద్దెకు తీసుకుని అందులో ఉండేవాళ్లం.
మిగతా అమ్మల సంగతి నాకు తెలీదు కాని, మా అమ్మ అంత మంచి అమ్మ, కష్టపడే అమ్మ వేరెవ్వరూ ఏ లోకంలోనూ ఉండరు.

ఐదుగురు పిల్లలు... వీరు బతికిన సంతానం. పోయిన వారు కాని తెల్సినంత వరకు మరో ఇద్దరు. అందరి కన్నా పెద్దదైన అక్క, అందరి కన్నా చిన్నదైన చెల్లెలు.
ఇంట్లో బీదరికం.
ఎడంపక్కన మేడ. చౌదరి గారు ఉంటుండేవారు. ఆ రోజుల్లో మేడ ఉందంటే భాగ్యవంతుడి కింద లెక్కే కదా.
కుడి పక్కన డాబా ఇల్లు. అందులో రోజు నాకు దర్శనమిస్తూ, నా ఈర్ష్యకు గురైన ఒక మధ్య వయస్కుడు.
ఆరేడు ఏళ్లు ఉంటాయామో నాకు అప్పుడు.
రోజు ఉదయం స్కూలుకి వెళ్లేటపుడు ఈ పెద్ద మనిషి ఎంచక్కా ఒక పడక కుర్చీలో హాయిగా పడుకుని, చేతిలో పేపరు, పక్కన టేబులు మీద పాడుతున్న రేడియోతో దర్శనమిచ్చేవాడు.

ఇవన్నీ మాకు లేవు.
డాబా లేదు.
రేడియో లేదు.
పూరిల్లు, కరెంటు లేదు.
ఆహా ఈయన గారిది ఏమి అదృష్టమనుకుంటూ రోజూ ఈర్ష్యకు గురయ్యేవాడిని. నేను ఏనాటి కైనా ఈ పెద్ద మనిషిలాగా ఓ మిద్దె, ఓ రేడియో ఒక పడక్కుర్చీ పొంది, హాయిగా జీవించాలనేకునేవాణ్ణి.
దానికి మరి పెట్టి పుట్టాలి కదా.

అదృష్టముండాలి కదా.
కష్టేఫలి సూత్రం వినే వయస్సు లేదు. దాన్ని నమ్మి ఆచరించే వయస్సు అంతకన్నా కాదు.
ఈ నమ్మకం - అదృష్టమే.. జీవితంలోని ప్రతి మంచికి, సుఖానికి మూల కారణమనే నమ్మకం - 1968 నవంబర్ 2న అహ్మదాబాద్ చేరిన తర్వాత పదేళ్లలో పూర్తిగా మరుగున పడిపోయింది.
1968 లో గీరా బెన్ శరభాయ్‌ను కలిసాను.
1976లో ధీరూభాయ్ అంబానీనీ కలిసాను.

1968 నుంచి 1971 దాకా కష్టపడి పనిచేసి గీరా బెన్ నమ్మకాన్ని, అభిమానాన్ని పొంది 1972 లో అహ్మదాబాద్‌లో స్థాపించబడిన శిల్పీ అడ్వర్‌టైజింగ్‌లోకి మార్చబడ్డాను.
1972 నుంచి నేటి దాకా ఈ అడ్వర్‌టైజింగ్ రంగంతో తెగని బంధం నాది. ఈ రంగమే నాకు కూడు, గుడ్డ, ఇల్లు వాకిలీ, మొబైల్ అన్నీ సమకూర్చింది. ఎంతో ప్రియమైన రంగం నాకిది.
ఇన్నేళ్ల తర్వాత కూడా అంటే. 38 ఏళ్ల తర్వాత కూడా ఏదన్నా, మంచి యాడ్ సృష్టిలో భాగం పంచుకుంటే ఆనాడు పండగే.
ఎన్ని గంటలైనా పనిచేయగలను, నేటికి కూడా అలసిపోకుండా.

దీన్నే ఇష్టమైన పని కష్టం కాదనటం అంటే.
అయితే నా విషయంలో ఈ పనే నా కిష్టమైనదని 1972లో కాని తెలియలేదు. అంటే నా ముప్పయ్యో ఏట.
ఈ లోగా ఎన్ని ప్రయోగాలో, కూటి కోసం కోటి విద్యలంటారే.. అలాగా...
అయితే ఏదో ఒక రోజున మన కిష్టమైన పనేదో మనం గ్రహిస్తేనే, జీవితంలో ముందంజ..దానికో సార్థకత లభించేది...


-ఎజి కృష్ణమూర్తి

డబ్బే ముఖ్యం కాదు.. జయహో విజయగాధలు : పద్ధతులు - 3

ఇష్టమైన పని, అది ఎంత కష్టమైనా ఆనందంగా చేస్తాం...చేస్తూనే ఉంటాం...
ఉదాహరణగా, ప్రేయసి పార్కులో ఎదురు చూస్తుంది. బస్సు దొరకలేదు.ఆలస్యమవుతూంది.. మరో బస్సు వచ్చింది. జనంతో కిటకిటలాడుతూ ఉంది. ఫుట్ బోర్డు మీద వెళ్లాడ్తూ దుమ్ము ధూళి లెక్కచేయకుండా, సంతోషంగా ప్రయాణం చేసి ప్రియురాలిని చేరుకుంటాడు ప్రియుడు.
ఇంతకన్నా సాహసాలు చేసిన ఎంతో మంది ప్రేమికుల కథలు,గాధలు మనకు సుపరిచయాలే కదా !
ఇష్టమైన వ్యక్తి కోసం కష్టంలో కూడా సుఖమే దొరుకుతుంది.
అసలది కష్టమైతేనే కదా...
అదే మన ఫుట్ బోర్డ్ ప్రియుణ్ణి అలాగే ప్రయాణం చేసి ఆఫీసుకు వెళ్లవయ్యా అంటే వెళ్తాడా? ఛాన్సేలేదు !!
నిదానంగా ఆఫీసు చేరుకొని ఎందుకు ఆలస్యమయిందయ్యా అంటే, బస్సు దొరక లేదంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే, ఇష్టమైన పనికి, లేని దానికి ఉన్న తేడా ఇది.
ముద్రాలో ట్రీసా అనే ఆవిడ నా సెక్రటరీగా చాలా కాలం పని చేసింది. ఆమెకి తన వృత్తి మీద అపారమైన ప్రేమ, గౌరవం. రాత్రిపూట, పెను తుపాను, నాలుగైదు అడుగుల ఎత్తుగా సిటీ అంతా నిలిచిన నీరు..ఇవేవి లెక్కచేయకుండా మా ఇంటికి వచ్చింది ఆ మర్నాడు ఉదయం నా ప్రయాణానికి అవసరమైన టిక్కెట్లు, ఆ మీటింగ్ కాగితాలతో.. తన వృత్తి మీద ఎంత ఇష్టం, గౌరవం లేకపోతే ఈ సాహసం చేయగలుగుతుంది ట్రీసా.
ఫలితంగా అటువంటి వారికి సంస్థలో గౌరవ మర్యాదలు అందరి కన్నా మిన్నగా జీతభత్యాలు లభించటం సహజమే కదా. విజేతలు అవలంబించే పద్దతుల్లో ఇదొకటి. ఎన్నుకున్న వృత్తిని ప్రేమించటం, అందులో ఉత్తములుగా ఎదగటం.
అందరికీ డబ్బు కావాలి !
అయితే డబ్బు ఉప ఉత్పాదన అన్న విషయం చాలా మందికి తెలియదు. నమ్మకంగా కష్టపడి పని చేస్తే పేరొస్తుంది. దాని ప్రతిఫలమే డబ్బు. ఇంత చిన్న సత్యం గ్రహించలేక డబ్బు కోసం వెంపర్లాడి, అది లభించక అశాంతికి గురైపోతాం లేదా అడ్డదార్లు వెతుక్కుంటాం.
మూర్ఖత్వం కాదా ?
గుజరాతీలకు వంశపారపర్యంగా అబ్బినది వ్యాపారంలోని మెళకువలు.. వ్యాపారం పట్ల మక్కువ. ఉద్యోగాలంటే అయిష్టం. వారికి వ్యాపారమంటే ఎంతో ఇష్టం.అందుకే తరాలు మారినా కుటుంబ వ్యాపారం అలా అలా సాగిపోతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది.
కనుకే వీరికి ఇష్టమైన పనేదో తెల్సుకోవటం, ఆ పనిని ఎంతో ఇష్టంగా చేయటం కష్టం కాదు.
మరి మనలాంటి వారి మాటేమిటి ?
తరతరాలుగా వ్యాపారాన్నే నమ్ముకున్న గుజరాతీయులు కాదు మనం. మన తల్లిదండ్రులు డాక్టర్లు, లాయర్లు కారు. మన కుటుంబానికంటూ ఎలాంటి వ్యాపారమూ లేదు. రాజకీయాల మీద వ్యామోహం లేదు మనకి.
మధ్యతరగతి లేక నిత్యం పోరాటం సాగిస్తున్న బీద కుటుంబాలో మనవి.
ఎలా మనకి ఏది ఇష్టమో తెల్సుకోవటం ? ఎలా ఆ తెల్సుకున్న రంగంలో నిష్ణాతులుగా మారటం ?
ఎలా విజేతగా రూపాంతరం చెందటం. ???
ప్రశ్నలు..ప్రశ్నలు.. ప్రశ్నలు...
సమాధానాలకు మూలకారణాలు ప్రశ్నలే కదా !
మీ ప్రస్థానం కూడా ప్రశ్నల నుంచే మొదలు కావాలి. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటూనే ఉండాలి. మీకు సమాధానం లభించేదాకా.
నా మొదటి ఉద్యోగం బాపట్ల కోర్టులో స్టెనో టైపిస్టుగా.
ఇంజనీరింగ్ చదవాలనే నా కోరిక ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులు రాక తీరని కోరికగానే మిగిలిపోయింది. 1956లో ఎస్ఎస్ఎల్‌సి పాసయ్యాను బాపట్లలో. 56 శాతం వచ్చినట్లు గుర్తు. పాలిటెక్నిక్‌కి ఆ మార్కులు సరిపోలేదు. డొనేషన్ రాజ్యం ఇంకా మొదలు కాలేదు. అందుకని తమిళనాడులో ఉంటున్న మా ఆమ్మ కొడుకు సహాయం అర్థించాం. ఆయన మంచి పొజిషన్‌లో, ఇతరులకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాడు. సరే, రమ్మన్నాడు మధురై. నేను, మా నాన్న గారు పెట్టే బేడాతో వెళ్లాం. నన్ను దింపి రెండ్రోజులుండి, మా నాన్న బాపట్ల తిరిగి వచ్చారు.

ఐదారు రోజుల తర్వాత తెల్సింది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇతర రాష్ట్రాల వారికి సీటు రావటం చాలా కష్టమని. అంతే తిరుగుటపాలో పెవిలియన్‌కి. బాపట్లకు చేరా.

తర్వాత తెల్సింది జీవితంలోని మంచి చెడ్డల గురించి సింహావలోకనం చేసుకుంటున్న సమయంలో. నాకే గనుక ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులు అంటే ఏ డెబ్బయ్యో, ఎనభైయ్యో వచ్చుంటే నాకు మన రాష్ట్రంలోనే ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజిలో ఇంజనీరింగ్ సీటు వచ్చి ఉండేదని. జీవితంలో మొదటి పాఠానికి పునాది పడింది ఆ రోజుల్లోనే..
చేస్తున్న పని ఏదైనా కష్టపడి ఆ పనిలో శ్రేష్టుడిగా నిలవాలని..
'విన్నర్ టేక్స్ ఆల్'- విజేతకే అన్నీ లాంటి లోకోక్తులతో తర్వాత పరిచయమైనప్పటికి, ఒక్కటి మాత్రం నిజం నాకు ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులొచ్చి ఉంటే, అప్పటి నా కల నెరవేరేదని.
మధురై నుంచి బాపట్ల తిరిగి వచ్చిన నన్ను చూసి మా కుటుంబమంతా షాక్ అయ్యారు. వారి దృష్టిలో నేను అక్కడ పాలిటెక్నిక్‌లో చేరిపొయ్యాననే. నిరాశ నిస్పృహలు మరుగున పడ్డాక కొన్నాళ్లు టీకాలు వేసే వేక్సినేటరుగా ఉద్యోగం చేశాను. ఆ తర్వాత టైపు, షార్టు హ్యాండు క్లాసుల్లో చేరాను.

అప్పుడు నా వయసు 15
ఒక సంవత్సరంలోనే టైపు హయ్యరు, షార్టు హ్యాండు లోయర్ పాసయ్యాను.
బాపట్ల సబ్‌కోర్టులో లీవ్ వేకెన్సీలో రెండు మూడు నెలల కోసం స్టెనో టైపిస్ట్ ఉద్యోగం.
పదహారేళ్ల వయసు
పొట్టిగా ఉండేవాణ్ణి.
శాస్త్రిగారని అడిషనల్ సబ్ జడ్జిగారి దగ్గర ఉద్యోగం. స్ఫురద్రూపి, కంచు గంట లాంటి కంఠం.
ధారాళంగా ఇంగ్లీషులో డిక్టేషన్ ఇచ్చేవాడు పొద్దున్నే ఇంటికి పిలిచి. ఒక్క ముక్క కూడా అర్ధమయ్యేది కాదు. తప్పుల తడకలుగా టైపు చేసి ఇచ్చే వాణ్ణి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు.
ఒక రోజున కోర్టులోకి పిలిచాడు డిక్టేషన్‌కని. కోర్టులో కెళ్లే సిబ్బందీ అందరూ కోట్లు ధరించాలి. నాకు సొంత కోటు లేక మా అన్నయ్య కోటు వేసుకొని కోర్టుకెళ్తుండే వాడిని.
ఆ రోజున శాస్త్రిగారి మూడ్ బాగా లేదో, నా టైపింగ్ మరీ చంఢాలంగా ఉందో కాని, నిండు కోర్టులో ఎడాపెడా దులిపేశాడు. కోర్టులోనే ఏడ్చాను. నిజానికి నేటి క్కూడా- అంటే 52 ఏళ్ల తర్వాత కూడా ఆ కోర్టు సీను నా కళ్లకు కట్టినట్లుగా కనబడుతుంది.
నిండు కోర్టులో ఉగ్ర నరసింహ స్వామిలా జడ్జిగారు....వెక్కిళ్లు పెడ్తూ నేను.
ఆ నరకం తొందరగానే ముగిసింది. అది టెంపరరీ జాబ్ కనుక. అయితే ఆ దృశ్యం అలాగే నిలిచిపోయింది, నేను నా జీవితంలో ఎంతో తీవ్రంగా ద్వేషించే దృశ్యంగా.
ఆ తర్వాత మరికొన్ని టెంపరరీ జాబులు-కోర్టుల్లోనే.
1960లో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజీ ద్వారా నాకు ఇంటర్వ్యూ వచ్చి భారతీయ పురాతత్వ శాఖలో స్టెనో గ్రాఫర్‌గా పర్మనెంట్ ఉద్యోగం దొరికింది. అదీ గుంటూరులోనే.
జీవితం మరో మలుపు తిరిగింది. మరో ప్రయోగం మొదలైంది.
ఇన్నేళ్లు గడిచినా, ఎస్ఎస్ఎల్‌సిలో మంచి మార్కులొచ్చి ఉంటే ఎంత బాగుడేంది కదా అనిపిస్తుంది !

-ఎజి కృష్ణమూర్తి

Sunday, March 14, 2010

Thursday, February 25, 2010

నేటి మాట - ఆరోగ్యమే మహాభాగ్యం


   ' ఆరోగ్యమే మహాభాగ్యం '


ఆరోగ్యమే మహాభాగ్యము 


ఈ వాక్యము చదవడానికి రెండు సెకండ్లు 


    అర్ధమవడానికి - 60 ఏళ్ళు .... 


కళ్ళు   పళ్ళు   కీళ్ళు ఒళ్ళు  


రిపేరుకు వస్తుంటే


కొంచెం కొంచెం భోధపడుతుంది.